Rain Effect: తూ.గో.జిల్లాకు అలర్ట్.. భారీ వర్షాలకు విద్యాసంస్థలు బంద్..
ABN , Publish Date - Sep 04 , 2024 | 08:37 AM
బంగాళాఖాతంలో అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. నిన్న(మంగళవారం) కాస్త గ్యాప్ ఇచ్చిన వర్షం.. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీగా పడుతోంది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలోనూ ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
తూర్పుగోదావరి: బంగాళాఖాతంలో అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. నిన్న(మంగళవారం) కాస్త గ్యాప్ ఇచ్చిన వర్షం.. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీగా పడుతోంది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలోనూ ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
జాగ్రత్తగా ఉండాలి..
ఈ మేరకు గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కూర్మనాథ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువ ప్రాంతం భద్రాచలం వద్ద 42.2అడుగుల నీటిమట్టం కొనసాగుతోందని, ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో 3,05,043లక్షలు కాగా.. ఔట్ ఫ్లో 3,12,057లక్షల క్యూసెక్కులు ఉందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూర్మనాథ్ హెచ్చరించారు.
అప్రమత్తమైన యంత్రాంగం..
మరోవైపు రాజమహేంద్రవరంతోపాటు తూ.గో.వ్యాప్తంగా ఉదయం నుంచీ ఎడతెరిపిలేని భారీ వర్షం కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు.
అలాగే వరద బాధితులకు ఆహారం పంపిణీ చేయాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, దీంతో గోదావరికి వరద ప్రవాహం పెరుగుతుందని ఆమె చెప్పారు. ఇవాళ సాయంత్రానికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతుందని చెప్పారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు.