Share News

AP News: మీ సేవలిక చాలు!

ABN , Publish Date - Jun 06 , 2024 | 04:19 AM

వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ రెడ్డిని పక్కన పెట్టాలని కొత్త ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

AP News: మీ సేవలిక చాలు!

  • త్వరగా సెలవుపై వెళ్లిపోవాలని సీఎస్‌ జవహర్‌రెడ్డికి సంకేతాలు

  • చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే వెళ్తే మంచిదని సూచన

  • ఎన్నికల ముందు జగన్‌ సర్కారుకు ఏకపక్షంగా పనిచేశారని విమర్శలు

  • కుమారుడిపై అవినీతి ఆరోపణలు

  • బాబుతో సీఎస్‌, డీజీపీ, అధికారుల భేటీ

అమరావతి, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ రెడ్డిని పక్కన పెట్టాలని కొత్త ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. సెలవుపై వెళ్లాలని ఆయనకు సంకేతాలు పంపినట్లు సమాచారం. జగన్‌ ప్రభుత్వంలో ఆయన ఏకపక్షంగా పనిచేయడంతో పాటు తీవ్ర ఆరోపణలు రావడం ఇందుకు కారణమని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ప్రధాన కార్యదర్శిగా జవహర్‌ రెడ్డి ఉండటాన్ని అప్పటి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యతిరేకించింది. ఆయనను బదిలీ చేయాలని కోరుతూ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తులు పంపింది.

వృద్ధులకు నెలవారీ పింఛన్ల పంపిణీ బాధ్యతల నుంచి వలంటీర్లను దూరంగా ఉంచిన తర్వాత సచివాలయాల సిబ్బంది ద్వారా ఇళ్ల వద్ద పంపిణీ చేయించాలని సీఎ్‌సను టీడీపీ కోరింది. కాన్నీ అందుకు విరుద్ధంగా ఒక నెలలో గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేయించిన అధికార యంత్రాంగం.. తర్వాతి నెలలో బ్యాంకు ఖాతాల్లో వేయించింది. దీనివల్ల వృద్ధులు చాలా అవస్థలు పడ్డారు. ప్రతిపక్షాల పట్ల వ్యతిరేకత కలిగేలా వారిని రెచ్చగొట్టడానికే సీఎస్‌ ఇలా చేశారని టీడీపీ ఆరోపించింది. ముఖ్యమంత్రి ఏనాడో బటన్‌ నొక్కిన పథకాలకు సరిగ్గా పోలింగ్‌ ముందు లబ్ధిదారుల ఖాతాలకు డబ్బులు విడుదల చేయాలని అధికార యంత్రాంగం చూడటం కూడా ప్రతిపక్ష పార్టీల విమర్శలకు దారితీసింది. చివరకు ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకొని పంపిణీని నిలిపివేయించింది.

ఇక విశాఖ చుట్టుపక్కల ఎసైన్‌మెంట్‌ భూములను జవహర్‌ రెడ్డి కుమారుడు అక్రమంగా కొనుగోలు చేశారని జనసేన, టీడీపీ బహిరంగంగా ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఆయనను ప్రధాన కార్యదర్శిగా కొనసాగించడం వాంఛనీయం కాదని టీడీపీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికే తప్పుకొని సెలవుపై వెళ్తే బాగుంటుందని ఆయనకు సమాచారం పంపారని ప్రచారం జరుగుతోంది.


చంద్రబాబుతో అధికారుల భేటీ

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో జవహర్‌ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో బుధవారం కలిశారు. ఆయన కలిసిన సమయంలో చంద్రబాబు ముభావంగా ఉన్నట్లు సమాచారం. డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా, జవహర్‌ రెడ్డి, మరికొందరు అధికారులు చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబు మొదట డీజీపీని పిలిపించి కొద్దిసేపు మాట్లాడారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత జవహర్‌ రెడ్డి సహా ఐఏఎస్‌ అధికారులు అందరినీ ఒకేసారి తన గదిలోకి పిలిపించారు. జవహర్‌ రెడ్డి పుష్పగుచ్ఛం ఇచ్చే సమయంలో చంద్రబాబు ఎలాంటి ప్రతిస్పందనా వ్యక్తం చేయకుండా ముభావంగా ఉన్నారు.

కొన్ని విషయాలు వివరించాల్సి ఉందని జవహర్‌ రెడ్డి చెప్పగా, ఇప్పుడేమీ అవసరం లేదని చంద్రబాబు బదులిచ్చారు. ప్రమాణ స్వీకార సమయం, స్థలం వివరాలు చెబితే ఏర్పాట్లు మొదలు పెడతామని జీఏడీ కార్యదర్శి అన్నారు. ఖరారు కాగానే కబురు పెడతామని చంద్రబాబు చెప్పారు. అటవీ పర్యావరణ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ కూడా ఆ సమయంలో వచ్చారు. ఆయనతో చంద్రబాబు కొద్దిసేపు విడిగా మాట్లాడారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు కూడా చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.


బాబు నివాసం కిటకిట

ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో బుధవారం చంద్రబాబు నివాసానికి తరలివచ్చారు. దీనితో ఆయన నివాసం కిటకిటలాడింది. చంద్రబాబును కలిసిన వారిలో ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్‌, కృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, గద్దె రామ్మోహనరావు, ఐతాబత్తుల ఆనందరావు, అరిమిల్లి రాధాకృష్ణ, పల్లా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, ఆనందబాబు, శ్రావణ్‌కుమార్‌, యార్లగడ్డ వెంకట్రావు, పార్థసారథి తదితరులున్నారు.

Updated Date - Jun 06 , 2024 | 08:06 AM