Guntur: న్యాయం చచ్చిపోయింది.. పోరాడే ఓపిక లేదు.. రిషితేశ్వరి తల్లి ఆవేదన
ABN , Publish Date - Nov 29 , 2024 | 01:26 PM
2015 జులై 14న నాగార్జున యూనివర్శిటీలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్ కారణంగా తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు యువతి సూసైడ్ నోట్ రాసింది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేకపోతున్నట్లు ఆమె లేఖలో పేర్కొంది.
గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నాగార్జున యూనివర్శిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో గుంటూరు కోర్టు తీర్పు వెలువడింది. విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న తొమ్మిదేళ్ల తర్వాత గుంటూరు జిల్లా న్యాయస్థానం కేసు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
2015 జులై 14న నాగార్జున యూనివర్శిటీలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడింది. ర్యాగింగ్ కారణంగా తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు యువతి సూసైడ్ నోట్ రాసింది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేకపోతున్నట్లు ఆమె లేఖలో పేర్కొంది. కాగా, అప్పట్లో రిషితేశ్వరి ఆత్మహత్య సంచలనంగా మారింది. బాధితురాలి కుటుంబసభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ తుది దశకు చేరుకోగా.. నేడు గుంటూరు జిల్లా 5వ కోర్టు తీర్పు వెలువరించింది. కాగా విద్యార్థిని రిషికేశ్వరి తెలంగాణ రాష్ట్రం వరంగల్‌కు చెందిన యువతి.
2015లో ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబూరావు అనధికారికంగా తనకు నచ్చిన చోట ఫ్రెషర్స్ డే పార్టీ నిర్వహించారని ఆరోపణలు వచ్చాయి. ప్రిన్సిపల్‌తో పాటు పలువురు విద్యార్థులు మద్యం సేవించారనే ఆరోపణలు ఉన్నాయి. అనంతరం విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించారని, సీనియర్ విద్యార్థులు సైతం ఆమెపై ర్యాగింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై కేసు నమోదైంది. సీనియర్ల ర్యాగింగ్‌కు మనస్తానం చెందిన రిషితేశ్వరి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విచారణ తర్వాత గుంటూరు కోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
న్యాయం జరగలేదు..
రిషితేశ్వరి కేసుపై న్యాయస్థానం తీర్పు తర్వాత బాధితురాలి తల్లితండ్రులు స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తల్లి దుర్గాబాయి మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లుగా పోరాడుతున్నామని, న్యాయం జరుగుతుందని భావించామన్నారు. తమకు న్యాయం జరగలేదంటూ ఇంకెవరికీ న్యాయం జరగదని ఆమె అభిప్రాయపడ్డారు. అప్పీల్‌కు వెళ్లాలా లేదా అనే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పారు. ఇక పోరాడే ఓపిక లేదని ఆమో ఆవేదన వ్యక్తం చేశారు.
డైరీని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు..
రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ మాట్లాడుతూ.. రిషితేశ్వరి డైరీలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో అర్థం కావటం లేదన్నారు. డైరీలో అన్ని విషయాలు వివరంగా ఉన్నాయన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా రిషితేశ్వరే డైరి రాసినట్లు నివేదిక ఇచ్చిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here