Venkaiah Naidu: తాను ప్రస్తుతం ఏ పదవిలో లేను.. వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 04 , 2024 | 02:23 PM
మిల్లర్ల సమస్యలు పరిష్కారించడానికి కృషి చేస్తానని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఏ వస్తువుల ఎగుమతిపై లేని నిబంధనలు.... ఒక్క పంటల ఎగుమతి పైనే ఎందుకని ప్రశ్నించారు.
విజయవాడ: పంటల ఎగుమతిపై నిబంధనలు మంచిది కాదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. జాతీయ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ(సోమవారం) సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... తాను ప్రస్తుతం ఏ పదవిలో లేనని చెప్పారు. గతంలో మిల్లర్స్ అసోషియేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేశానని.. అందుకే పిలిచి ఉంటారని అన్నారు. దేశానికి వెన్నుముక రైతులు.. ఆ రైతులతో ఈ రంగానికి అవినాభావ సంబంధం ఉందని అన్నారు.
మిల్లర్స్ రంగంలో నెలకొన్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడాలని చెప్పారు. సమస్యలు పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. రాత్రి, పగలు కష్టపడి పండించిన పంటను ఎగుమతి చేసేందుకు ఇబ్బందులు ఉండకూడదని చెప్పారు. ఏ వస్తువుల ఎగుమతిపై లేని నిబంధనలు.... ఒక్క పంటల ఎగుమతి పైనే ఎందుకని ప్రశ్నించారు.
గత 10 రోజుల నుంచి తాను వైరల్ ఫివర్‌తో బాధపడుతున్నానని అన్నారు. కానీ ఈ అసోసియేషన్‌తో ఉన్న అవినాభావ సంబంధం వల్లే నేడు ఇక్కడికి రావడం జరిగిందని తెలిపారు. ఒక సమగ్ర భారత దేశాన్ని ఇక్కడ చూస్తున్నానని అన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి పలువురు సభ్యులు వచ్చారని తెలిపారు. ఏ సమస్యలు ఉన్నాయో వాటికి పరిష్కార మార్గాలను సభ్యులు చర్చించుకోవాలని చెప్పారు. తాను ఢిల్లీకి వెళ్లిన తర్వాత కేంద్ర ఆహార మంత్రితో మాట్లాడతానని చెప్పారు. మిల్లర్ల సమస్యలు పరిష్కారించడానికి కృషి చేస్తానని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.