Share News

Minister Mandipalli: శాప్‌లో అక్రమాలపై విచారణ చేపడతాం.. మంత్రి మండిపల్లి వార్నింగ్

ABN , Publish Date - Aug 12 , 2024 | 01:09 PM

శాప్‌(స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్)‌లో అక్రమాలపై విచారణ చేపడతామని క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వంలో రూ. 120 కోట్లను ‘‘ఆడుదాం ఆంధ్ర’’ కోసమని 40 రోజుల్లోనే ఖర్చుపెట్టి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

Minister Mandipalli: శాప్‌లో అక్రమాలపై విచారణ చేపడతాం.. మంత్రి మండిపల్లి వార్నింగ్

విజయవాడ: శాప్‌(స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్)‌లో అక్రమాలపై విచారణ చేపడతామని క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వంలో రూ. 120 కోట్లను ‘‘ఆడుదాం ఆంధ్ర’’ కోసమని 40 రోజుల్లోనే ఖర్చుపెట్టి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఆధారాలను సేకరిస్తున్నామని.. దీనిపై విచారణ చేపడతామని హెచ్చరించారు. శాప్‌లో గత ప్రభుత్వంలో జరిగిన సర్టిఫికెట్ల కుంభకోణంపై అధికారులతో చర్చించామని చెప్పారు. సీఎం చంద్రబాబుతో చర్చించి కమిటీ వేసి శాప్‌లో జరిగిన దొంగ సర్టిఫికెట్ల కుంభకోణంపై తేల్చుతామని స్పష్టం చేశారు.


ఏసీని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. శాప్ అధికారులతో సోమవారం నాడు ఏపీ సచివాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మండిపల్లి మాట్లాడుతూ... ఈరోజు సాయంత్రం 4గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగే సమావేశంపై చర్చించినట్లు తెలిపారు. క్రీడావికాస కేంద్రాలు, గ్రామస్థాయిలో క్రీడల నిర్వహణ, ప్రోత్సాహంపై సీఎంతో చర్చిస్తామని అన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో క్రీడల నిర్వహణ పేరిట చేసిన అవినీతి అక్రమాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని వివరించారు.


ఆంధ్రప్రదేశ్‌కు క్రికెట్ ఐపీఎల్ టీం తీసుకు రావాలని ప్రతిపాదన ఉందని.. సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో అనుమతి లేని క్రీడా అకాడమీల అనుమతులు రద్దు చేస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వంలో శాప్‌లో అవకతవకలు చాలా జరిగాయని చెప్పారు. క్రీడాకారులకు ప్రోత్సాహకాలు, ఉద్యోగాలకు సంబంధించి పలు అక్రమాలు జరిగాయని చెప్పారు. అవినీతి అక్రమాలపై విచారణ జరుపుతామని అన్నారు. పే అండ్ ప్లే జీవో వల్ల ఇబ్బందులు ఉంటే చర్చించి రద్దు కోసం చర్యలు తీసుకుంటామని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Aug 12 , 2024 | 01:12 PM