Varla Ramaiah: అధికారులను వీఆర్‌కు పంపడంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు..
ABN , Publish Date - Aug 16 , 2024 | 08:15 PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజా ఆగ్రహానికి గురై 11సీట్లకు పడిపోయినా తప్పుడు ప్రచారాలు మాత్రం మానడం లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు తన సొంత పేపర్, టీవీ ఛానెల్‌లో రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజా ఆగ్రహానికి గురై 11సీట్లకు పడిపోయినా తప్పుడు ప్రచారాలు మాత్రం మానడం లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు తన సొంత పేపర్, టీవీ ఛానెల్‌లో రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వీఆర్‌కు పంపడంపై ఇష్టమెుచ్చినట్లు మాట్లాడుతున్నారని, వైసీపీ హయాంలో ఏం జరిగిందో గుర్తు లేదా అంటూ వర్ల రామయ్య ప్రశ్నించారు. అధికారుల ఆత్మగౌరవంపై ఆటవిక దాడి చేసేలా బ్లూ మీడియా ప్రచారాలు ఉన్నాయంటూ మండిపడ్డారు.
అలాంటి వారిని వీఆర్‌కు పంపితే తప్పేంటి?
ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ.." తప్పు చేసిన అధికారులను వీఆర్‌లో పెట్టడం ప్రభుత్వ విధానం. అలాంటి అధికారులు తమ ఉద్యోగ ధర్మాన్ని చట్టబద్ధంగా నిర్వహిస్తారని పైఅధికారులు భావించినప్పుడు వారికి తిరిగి రెగ్యులర్ డ్యూటీ ఇస్తారు. వైసీపీ హయాంలో జుడీషియల్ కస్టడీలో ఉన్న ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును టార్చర్ చేసి చట్టాన్ని దుర్వినియోగం చేసిన ఐపీఎస్ అధికారిని వీఆర్‌లో పెట్టడం తప్పా?. భార్యభర్తల కేసులో డబ్బులు కోసం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అధికారిని, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న ఓ ఐఏఎస్ అధికారిని వీఆర్‌కు బదిలీ చేయడం ఏ విధంగా తప్పు అవుతుందని ప్రశ్నించారు. అలాంటి వారిని వీఆర్‌కు బదిలీ చేయడం ఆటవికదాడి అవుతుందా?. అసలు వారందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. వీఆర్‌కు పంపడం తప్పని భావించివారు దమ్ముంటే చర్చకు రావాలని" సవాల్ విసిరారు.
వైసీపీ పాలనలో అధికారులు బలయ్యారు..
వైసీపీ పాలనలో 170మంది వరకు అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, సీఐలు సంవత్సరాల తరబడి వీఆర్‌లో ఉన్నారని వర్ల రామయ్య అన్నారు. మాజీ సీఎం జగన్ దురాగతాలకు బలైన ఉన్నతాధికారులు ఎందరో ఉన్నారని చెప్పుకొచ్చారు. ముద్దాడ రవిచంద్రకు 2023నుంచి ఎన్నికలయ్యే వరకూ పోస్టింగ్ ఇవ్వలేదని, ఐఏఎస్‌లు నరేశ్, రాజమౌళిని వీఆర్‌లో ఉంచారని గుర్తు చేశారు. జగన్ అవినీతి కేసుల్లో A2గా ఉన్న విజయసాయిరెడ్డిని కలిసి ప్రసన్నం చేసుకుంటే తప్ప సతీశ్ చంద్రకు పోస్టింగ్‌కు ఇవ్వలేదని మండిపడ్డారు. మాజీ సీఎం జగన్‌కు సన్నిహితుడైన ఓ కాంట్రాక్టర్‌ను కలిస్తే తప్ప ఐఏఎస్ సాయిప్రసాద్‌కు పోస్టింగ్ ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇప్పుడు విమర్శలు చేస్తున్న వారంతా అప్పుడు ఎక్కడికి పోయారని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్త కూడా చదవండి:
CM Chandrababu: ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. వారితో భేటీ..