AP Politics: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్లాన్ ఇదేనా..?
ABN , Publish Date - Aug 14 , 2024 | 12:17 PM
అసెంబ్లీ ఎన్నికల తరువాత జరుగుతున్న తొలి ఎన్నిక విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక. ఈ ఎన్నిక ఏపీ పాలిటిక్స్‌లో క్యూరియాసిటీని పెంచేస్తోంది. పైకి చూసేందుకు వైసీపీకే విజయం దక్కే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం వేరే టాక్ వినిపిస్తోంది.
అమరావతి, ఆగష్టు 14: అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏపీలో జరుగుతున్న తొలి ఎన్నిక విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక. ఈ ఎన్నిక ఏపీ పాలిటిక్స్‌లో రోజు రోజుకి క్యూరియాసిటీని పెంచేస్తోంది. పైకి వైసీపీకే విజయం దక్కే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం వేరే టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కని విని ఎరుగని రీతిలో విజయ బావుటా ఎగురవేసిన కూటమి.. అనూహ్యంగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. తాము ఈ ఎన్నికల బరిలో నిలవడం లేదని స్పష్టం చేశారు కూటమి తరఫున చంద్రబాబు. దీంతో ఈ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విజయం ఖాయం అని అంతా భావిస్తున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఆ ట్విస్ట్ ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఏం చేయబోతోంది? పొలిటికల్ అనలిస్ట్‌లు ఏం అంచనా వేస్తున్నారు? ప్రత్యేక కథనం మీకోసం..
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఈ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికకు సంబంధించి తమకు అవసరమైన బలం ఉండటంతో.. తమ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటించారు వైసీపీ అధినేత జగన్. మరోవైపు.. తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కూటమి తరఫున టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ, ఇందులోనే ఒక మతలబు ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి దూరమవడంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అందరూ అంచనా వేశారు. కానీ, బొత్సకు పోటీగా స్వతంత్ర అభ్యర్థిగా షఫీ ఉల్లా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ఆగష్టు 13వ తేదీతోనే ముగియగా.. 14న స్క్రూటినీ.. 16వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. అయితే, స్వతంత్ర్య అభ్యర్థి విత్ డ్రా చేసుకునే అవకాశాలైతే కనిపించడం లేదు. దీంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవం అయ్యే ఛాన్స్ దాదాపుగా లేనట్లే.
ఇదిలాఉంటే.. ఇండిపెండెంట్ అభ్యర్థి షఫీకి కూటమి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందని పొలిటికల్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డైరెక్ట్‌గా పోటీ చేయకపోయినప్పటికీ.. ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్ధతు ఇచ్చి.. వైసీపీకి ఝలక్ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కూటమి ఓట్లు ఇండిపెండెంట్ అభ్యర్థికి వేయించడంతో పాటు.. మరింత మందిని కూడగట్టి బొత్సకు షాక్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉందని అభిప్రాయపడుతున్నారు.
వాస్తవానికి విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల బలాబలాలు చూసుకుంటే.. మొత్తం 841 ఓట్లు ఉండగా.. అందులో వైఎస్సార్‌సీపీకి 615 ఓట్లు, టీడీపీ, జనసేన, బీజెపీకి కలిపి 215 ఓట్లు ఉన్నాయి. 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఒకవేళ టీడీపీ నేతృత్వంలోని కూటమి ఎన్నికల్లో పోటీకి దిగితే.. బలం లేకపోయినా పోటీ పెట్టారని.. ప్రలోభాలకు గురి చేశారని వైసీపీ నేతలు పెడబొబ్బలు పెట్టడం ఖాయం. ఈ నేపథ్యంలోనే నైతికంగా పోటీ నుంచి తప్పుకున్న కూటమి.. పరోక్షంగా ఇండిపెండెంట్ అభ్యర్థికి సపోర్ట్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే.. బొత్స ఇక ఇంటిదారి పట్టడం ఖాయం అని విశ్లేషిస్తున్నారు.
చంద్రబాబు అలా చేస్తారా?
ఈ వాదన ఇలా ఉంటే.. చంద్రబాబు అలా చేయరని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. సంఖ్యా పరంగా బలం తక్కువగా ఉందని.. అనైతిక పద్దతులు వద్దనే ఉద్దేశ్యంతోనే పోటీ నుంచి కూటమి తప్పుకుంటుందని చెబుతున్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో వైసీపీకి షాక్ ఇవ్వాలనుకుంటే.. కూటమి తరఫునే అభ్యర్థిని నిలబెట్టేవారు కదా? అని అభిప్రాయపడుతున్నారు.
ఏం జరుగుతుందో..
ఎవరి అభిప్రాయాలు, ఎవరి విశ్లేషణలు ఎలా ఉన్నప్పటికీ.. ఈ ఎన్నిక ఎన్ని ట్విస్టులు ఇస్తుందో తెలియాలంటే.. సెప్టెంబర్ 3వ తేదీ వరకు వేయిటింగ్ తప్పదు. ఆగష్టు 30న పోలింగ్ జరుగనుండగా.. సెప్టెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆ రోజున ఎవరి జాతకం ఏంటనేది తేలిపోతుంది.