Share News

డిసెంబరులో ఇస్రో బిజీ బిజీ..!

ABN , Publish Date - Dec 01 , 2024 | 04:55 AM

ఇస్రో డిసెంబరులో రెండు పీఎస్‌ఎల్వీ రాకెట్ల ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. శ్రీహరికోట ఈ ప్రయోగాలకు వేదిక కానుంది. ఈ నెల 4న నిర్వహించే పీఎస్‌ఎల్వీ-సీ59 ద్వారా యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహంతో పాటు మరో నాలుగు చిన్న శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.

డిసెంబరులో ఇస్రో బిజీ బిజీ..!

  • 20 రోజుల్లో రెండు పీఎస్‌ఎల్వీ ప్రయోగాలు

సూళ్లూరుపేట, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఇస్రో డిసెంబరులో రెండు పీఎస్‌ఎల్వీ రాకెట్ల ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. శ్రీహరికోట ఈ ప్రయోగాలకు వేదిక కానుంది. ఈ నెల 4న నిర్వహించే పీఎస్‌ఎల్వీ-సీ59 ద్వారా యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహంతో పాటు మరో నాలుగు చిన్న శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. సూర్యుడి వాతావరణం, సౌర కరోనాను అధ్యయనం చేయడం ప్రోబా-3 మిషన్‌ లక్ష్యం. గతంలోనూ ఈఎస్‌ఏకు చెందిన ప్రోబా-1 (2001), ప్రోబా-2 (2009)లను కూడా ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. 24న పీఎస్‌ఎల్వీ-సీ60 రాకెట్‌ ప్రయోగం చేపట్టేందుకు కూడా ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ఈ రాకెట్‌ ద్వారా రీశాట్‌-1బీ ఉపగ్రహంతో పాటు మరో నాలుగు విదేశీ ఉపగ్రహాలను రోదసీలోకి పంపనుంది.

  • ప్రోబా-3తో సౌర కరోనా అధ్యయనం

దాదాపు 200 మిలియన్‌ యూరోలతో అభివృద్ధి చేసిన ప్రోబా-3 మిషన్‌ రెండేళ్లపాటు కొనసాగనుంది. దీనిలో ఓక్యుల్టర్‌ స్పేస్‌క్రాఫ్ట్‌, కరోనాగ్రాఫ్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ అనే ఉపగ్రహాలు ఉన్నాయి. ప్రయోగం అనంతరం కక్ష్యలో ఈ రెండూ విడిపోయినప్పటికీ కచ్చితమైన సమన్వయంతో పనిచేస్తాయని, రెండూ కలిసి సోలార్‌ కరోనాగ్రాఫ్‌ను ఏర్పరుస్తాయని ఈఎస్‌ఏ వర్గాలు వెల్లడించాయి. ప్రోబా-3లోని ఏఎస్‌పీఐఐసీఎస్‌ పరికరం సూర్యుని లోపలి, బాహ్య కరోనా వీక్షణను అందిస్తుంది. దీనిలో ఉండే 1.4 మీటర్ల డిస్క్‌ కరోనాను నిశితంగా పరిశీలించడానికి ఉపయోగపడుతుంది. డిజిటల్‌ అబ్సల్యూట్‌ రేడియోమీటర్‌ సూర్యుడి శక్తి ఉత్పత్తిని నిత్యం కొలుస్తుంది.

  • భారత్‌కు ప్రయోజనం ఏమిటి..?

ప్రోబా-3ని ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెడితే.. తక్కువ ఖర్చుతోనే అంతరిక్ష ప్రయోగ సేవలందించే సంస్థగా నమ్మకం పెరగనుంది. అలాగే ఈ మిషన్‌ అందించే డేటా భారత శాస్త్రవేత్తలకు కూడా ఉపయోగపడనుంది. కొంతమంది భారతీయ పరిశోధకులు ఇప్పటికే బెల్జియం శాస్త్రవేత్తలతో కలిసి ప్రోబా-3 మిషన్‌ కోసం పనిచేశారు. సౌర అధ్యయనంలో కొత్త కోణాలను ఆవిష్కరించేందుకు ఇది అవకాశం కల్పిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

Updated Date - Dec 01 , 2024 | 04:55 AM