ISRO : ప్రోబా-3 ప్రయోగానికి సిద్ధం
ABN , Publish Date - Dec 04 , 2024 | 04:01 AM
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలో చేపడుతున్న విదేశీ ఉపగ్రహం ప్రోబా-3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది.
నేడు పీఎ్‌సఎల్వీ-సీ59 ప్రయోగం
సూళ్లూరుపేట, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలో చేపడుతున్న విదేశీ ఉపగ్రహం ప్రోబా-3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. పీఎస్‌ఎల్వీ-సీ59 రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ)కి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లో ప్రథమ ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 4:08 గంటలకు ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం 2:38 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ కూడా మొదలైంది. ఈ ప్రయోగం ద్వారా ఈఎ్‌సఏకి చెందిన 550 కిలోల బరువున్న ప్రోబా-3 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ-సీ59 రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. సూర్యుడిపై పరిశోధనల నిమిత్తం ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపుతున్నారు. ప్రోబా-3లో ఉండే రెండు ఉపగ్రహాలు సూర్యుడి బాహ్య వాతావరణం, సౌర కరోనాపై అధ్యయనం చేస్తాయి. వాతావరణం అనుకూలించి, అన్నీ సజావుగా సాగితే బుధవారం సాయంత్రం 4:08 గంటలకు షార్‌లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి పీఎ్‌సఎల్వీ-సీ59 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లనుంది.