ISRO : పీఎస్ఎల్వీ-సీ60తో జంట ఉపగ్రహాలు
ABN , Publish Date - Dec 27 , 2024 | 05:43 AM
ఈ నెలాఖరులో మరో పీఎ్‌సఎల్వీ రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది.
స్పేస్ డాకింగ్ ప్రయోగానికి ఇస్రో శ్రీకారం
సూళ్లూరుపేట, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఈ నెలాఖరులో మరో పీఎ్‌సఎల్వీ రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఈ నెల 30 పీఎ్‌సఎల్వీ-సీ60 రాకెట్ ద్వారా స్పాడెక్స్ జంట ఉపగ్రహాలను రోదసీలోకి పంపనుంది. ఈ ప్రయోగం ద్వారా విభిన్న పరిశోధనలకు ఇస్రో శ్రీకారం చుట్టనుంది. దీన్ని స్పేస్ డాకింగ్ ప్రయోగంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన రాకెట్ అనుసంధాన పనులతోపాటు శిఖర భాగాన ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియను కూడా గురువారం పూర్తి చేసినట్లు ఇస్రో అధికారికంగా వెల్లడించింది. ఈ నెల 30వ తేదీ రాత్రి 9.48 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎ్‌సఎల్వీ-సీ60 రాకెట్ ప్రయోగం జరగనుంది. దీని ద్వారా చేసే పరిశోధనలు.. భవిష్యత్‌లో అంతరిక్షంలో భారత్ ఆధ్వర్యంలో స్పేస్ స్టేషన్ నిర్మాణానికి ఎంతో దోహదపడతాయని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా రెండు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపి.. వాటిని అనుసంధానిస్తూ, విడగొడుతూ ఇస్రో ప్రయోగాలు చేపట్టనుంది. ఈ ఉపగ్రహాలతో పాటు వివిధ రకాల పరిశోధనల కోసం 24 ఉపకరణాలను కూడా పంపుతున్నారు. ఈ మిషన్ విజయవంతమైతే మరిన్ని ప్రయోగాల్లో డాకింగ్ సిస్టమ్‌ను పరిశీలించనున్నారు.
తెనాలికి చెందిన ‘స్వేచ్ఛశాట్-వీ.0’ కూడా..
రాకెట్ నుంచి స్పాడెక్స్ ఉపగ్రహం విడిపోయిన తర్వాత నాలుగో దశలో విభిన్న పరిశోధనలకు ఇస్రో శ్రీకారం చుట్టనుంది. ఈ ప్రయోగంలో పీఎస్-4 ద్వారా ఏకంగా 24 పరిశోధనలు చేసేందుకు 24 చిన్న ఉపకరణాలను పంపుతున్నారు. ఈ పరిశోధనల ద్వారా ఇస్రోకు విలువైన సమాచారం రావడమే కాకుండా స్పేస్ స్టేషన్ నిర్మాణానికి ఎంతో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఉపకరణాల్లో ఇస్రోకు చెందినవి 14 కాగా.. మరో 10 ఉపకరణాలు దేశంలోని వివిధ ప్రైవేట్ స్టార్టప్ కంపెనీలు, విశ్వ విద్యాలయాలకు చెందినవి. ఇందులో తెనాలికి చెందిన ఎన్ స్పేస్ టెక్ సంస్థ వారు ఇస్రో సహకారంలో యుహెచ్‌ఎ్‌ఫ కమ్యూనికేషన్ మాడ్యూల్‌కు సంబంధించిన ‘స్వేచ్ఛశాట్-వీ.0’ని పీఎ్‌సఎల్వీ-సీ60 ద్వారా అంతరిక్షంలోకి పంపుతున్నారు. ముంబైకి చెందిన అవిటి యూనివర్సిటీ విద్యార్థులు పాలకూర కణాలను అంతరిక్షంలోకి పంపుతున్నారు. ఇది అంతరిక్షంలో ప్రత్యేక పరిస్థితిల్లో మొక్కలు ఎలా పెరగతాయనే దానిపై అధ్యయనం చేసేందుకు ఉపయోగపడనుంది.