Fake Case : నకిలీ పట్టాల కేసు కంచికేనా..?
ABN , Publish Date - Sep 04 , 2024 | 11:44 PM
బద్వేలు పట్టణం నానాటికి విస్తరిస్తోంది. చుట్టూ గ్రామీణ ప్రాంత ప్రజలు తమ పిల్లల చదువుల కోసం, వృత్తి, వ్యాపారాల రీత్యా బద్వేలు పట్టణానికి వచ్చి నివాసం ఉంటున్నారు. దీంతో స్థలాల ధరలకు రెక్కలు వచ్చి డీకేటీ భూములు కూడా లక్షల రూపాయలు పలుకుతున్నాయి.
ఆక్రమణలు, నకిలీలకు చెక్‌పడేనా
బద్వేలులో భూభాగోతంలో తెరవెనుక ఉన్నది ఎవరు
కూటమి ప్రభుత్వంలో అయినా వెలుగులోకి వచ్చేనా
బద్వేలులో భూ భాగోతం రెండేళ్ల క్రితం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో వైసీపీ నేతలు, రెవెన్యూ సిబ్బందితో కుమ్మక్కై డీకేటీ, పట్టా భూములకు సైతం నకిలీ పట్టాలు సృష్టించి విక్రయాలు సాగించారు. కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నారు. దీనిపై ఆర్డీవో దృష్టిసారించడంతో 17 మందిపై కేసు నమోదైంది. నిందితుల నుంచి పెద్ద ఎత్తున నకిలీపట్టాలు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఈ కేసు మరుగున పడిపోయింది. బద్వేలులో భూ ఆక్రమణలపై తాజాగా కూటమి ప్రభుత్వం చర్యలకు దిగింది. ఈ నేపథ్యంలో నకిలీపట్టాల కేసుపైనా దృష్టిసారించి నిందితులకు శిక్షపడేలా చేయాలని బాధితులు కోరుతున్నారు.
బద్వేలు టౌన, సెప్టెంబరు 4: బద్వేలు పట్టణం నానాటికి విస్తరిస్తోంది. చుట్టూ గ్రామీణ ప్రాంత ప్రజలు తమ పిల్లల చదువుల కోసం, వృత్తి, వ్యాపారాల రీత్యా బద్వేలు పట్టణానికి వచ్చి నివాసం ఉంటున్నారు. దీంతో స్థలాల ధరలకు రెక్కలు వచ్చి డీకేటీ భూములు కూడా లక్షల రూపాయలు పలుకుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో డీకేటీ భూములకు నకిలీ పట్టాలు తయారుచేసి, విక్రయించి భూ వివాదాలకు తెరలేపారు. భూ మాఫియా గ్యాంగ్ బద్వేలులో ప్రభుత్వ స్థలాలను, పేదల భూములను నకిలీ పట్టాలతో ఆక్రమించిన తీరు అప్పట్లో జిల్లాలో కలకలం రేపింది. ఈ వ్యవహారంలో కొందరు వైసీపీకి చెందిన నేతలు ప్రధానంగా ఎన్జీఓ కాలనీలో నకిలీ పట్టాలు పుట్టించి కోట్లరూపాయల సొమ్ముదోచుకున్నట్లు సమాచారం. బద్వేలు రెవెన్యూ డివిజన అయిన తరువాత మొదటి ఆర్డీవో ఆకుల వెంకటరమణ నకిలీ పట్టాలపై ఉక్కుపాదం మోపడంతో ఈ వ్యవహారం గుట్టురట్టు అయింది. నకిలీ పట్టాల తయారీలో కీలక సూత్రధారులు, పాత్రధారులపై మెరుపుదాడులు నిర్వహించారు. చాలా వరకు ఆధారాలు సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో పోలీసుశాఖ కూడా హడావిడి చేసి 17 మందిపై కేసు నమోదు చేసింది. అయితే కొందరిని మాత్రమే అరెస్ట్‌చేశారు. మరికొందరు వైసీపీకి చెందిన వారు కావడంతో వారిపై కేసులు నమోదు చేయలేదు. భూకబ్జాలు వెలికితీసి, నకిలీల గుట్టు రట్టుచేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన తీరు జిల్లాలోనే సంచలనంగా మారారు. అప్పట్లో అడ్డూ అదుపులేకుండా సాగిన బద్వేలు భూదందాపై ఇటు పోలీసు, అటు రెవెన్యూ శాఖలు చేపట్టిన చర్యలపై ప్రజల్లో సర్వత్రా హర్షం వ్యక్తం అయింది.
పెద్దల బండారం బయటపడలేదు
నకిలీ పట్టాలతో భూ ఆక్రమణలకు సంబంధించి బద్వేలులో వైసీపీకి చెందిన పెద్దల బండారం బట్టబయలు అవుతుందని అందరూ ఎదురుచూశారు. అయితే ఏమైందో ఏమో .. ఈ వ్యవహారం వెలుగుచూసి రెండేళ్లు అవుతున్నా నకిలీపట్టాల కేసు గప్‌చుప్ అయింది. నకిలీ దందా నడిపే పాత్రధారులపైన మాత్రమే చర్యలు తీసుకున్నారు తప్ప, ఈ దందా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది ఆరాతీసి అరెస్ట్ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ నకిలీ పట్టాల భూ దందాపై పోలీసుకేసులు నమోదు చేసినా ఏడుగురిని మాత్రమే అరెస్ట్ చేశారు. మిగిలిన 10 మంది వైసీపీ నాయకులు కావడంతో వారిపై కేసు నమోదు చేసినా అరెస్టు చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. బద్వేలు పట్టణంలో గత పదేళ్లుగా నకిలీ పట్టాలతో భూ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత ఐదేళ్లలో ఇవి మరింత తీవ్రం అయ్యాయి. దీని వెనక బద్వేలు నియోజకవర్గానికి చెందిన వైసీపీ ముఖ్యనేతకు కావలసిన వారు ఉండటంతోనే పోలీసులు, రెవెన్యూ వారు ఈ కేసును పట్టించుకోలేదనే విమర్శలున్నాయి.
డొంక కదలలేదు
ఏదైనా కేసుల్లో చిన్న క్లూ దొరికితేచాలు, దాన్ని శోధించి కలుగులో ఉన్న ఎలుకను పోలీసులు బయటకు తీసిన సంఘటనలు జిల్లాలో అనేకం ఉన్నాయి. బద్వేలులో రెండేళ్ల క్రితం వెలుగు చూసిన నకిలీ పట్టాలకు సంబంధించిన కేసులో.. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన వారిని మాత్రమే అరెస్ట్ చూపించారు.. ప్రముఖుల పేర్లు బయటకు వచ్చినప్పటికీ వారి అక్రమాల వ్యవహారం బయటకు పొక్కనివ్వకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం మారింది, అధికారులు మారారు. ఇప్పటికైనా నకిలీపట్టాల కేసును పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని దీని వెనక ఉన్న అసలు వ్యక్తులను బయట పెట్టాలని బద్వేలు ప్రజలు కోరుతున్నారు. నకిలీపట్టాల కేసుకు సంబంధించి బద్వేలు అర్బన సీఐ రాజుగోపాల్ యాదవ్‌ను వివరణ కోరగా.. తాను నూతనంగా బాధ్యతలు చేపట్టానని, త్వరలోనే నకిలీ పట్టాల కేసుపై విచారణ చేస్తామని అన్నారు.