Share News

సొంత పార్టీ నేతలపై శివాలెత్తిన సుగవాసి

ABN , Publish Date - Sep 23 , 2024 | 11:28 PM

రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట, సుండుపల్లె మండలాల్లో సోమవారం జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ గ్రామసభల్లో రాజంపేట నియోజకవర్గ టీడీపీ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం సొంత పార్టీకే చెందిన కీలక నాయకులపై శివాలెత్తిపోయారు.

సొంత పార్టీ నేతలపై శివాలెత్తిన సుగవాసి
ఒంటిమిట్టలో జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ గ్రామసభలో మాట్లాడుతున్న సుగవాసి బాలసుబ్రమణ్యం

సమావేశాలను అడ్డుకునే కుట్ర చేస్తున్నారు

చంద్రన్న ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు

తప్పు చేస్తే ప్రజలే నిలదీయాలి

‘ఇది మంచి ప్రభుత్వం’ గ్రామసభల్లో సుగవాసి

ఒంటిమిట్ట/సుండుపల్లె, సెప్టెంబరు 23: రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట, సుండుపల్లె మండలాల్లో సోమవారం జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ గ్రామసభల్లో రాజంపేట నియోజకవర్గ టీడీపీ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం సొంత పార్టీకే చెందిన కీలక నాయకులపై శివాలెత్తిపోయారు. సుండుపల్లె మండలం సొంఠంవారిపల్లి, ఒంటిమిట్ట కోదండరామాలయం సమీపంలో సోమవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ గ్రామ సభలు ఏర్పాటు చేశారు. ఈ రెండుచోట్లా పాల్గొన్న సుగవాసి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో మండల అధికారులు అందరూ పాల్గొని.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. అయితే రాజంపేట నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అధికారులు ఎవరూ రాకుండా.. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భయపెట్టి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి గ్రామ పంచాయతీలో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహించే కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించడం బాధాకరమన్నారు. ఆ ఎమ్మెల్సీ కలెక్టర్‌ ద్వారా.. అధికారులను రానివ్వకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో తాగు, సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు రాజంపేటలో అన్నక్యాంటీన్‌ ప్రారంభోత్సవం చేసేందుకు వెళ్తే పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు పోటీగా వచ్చారని విమర్శించారు. అంతేగాకుండా వైసీపీ నాయకులతో కలిసి గత ఎన్నికల్లో తన ఓటమికి కుట్ర చేశారని అన్నారు. ఎవరైతే ఎన్నికల్లో మోసం చేశారో ? ప్రతి ఒక్కరి పేరు, ఫోన్‌ నెంబర్‌తో సహా మంత్రి నారా లోకేశ్‌ దగ్గర ఉన్నాయన్నారు. స్వయంగా తనకు చూపించారన్నారు. 40 సంవత్సరాలుగా కష్టపడి సాధించుకున్న పేరు పోకుండా ప్రజల కోసం పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినా కొంతమంది హద్దు మీరి ప్రవర్తిస్తున్నారన్నారు. తెలుగుదేశం నీతికి కట్టుబడిన ప్రభుత్వమని, తనతో సహా ఎవరు తప్పు చేసినా శిక్షించమని ప్రజలను కోరారు.

అదే విధంగా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి అవినీతికి పాల్పడుతున్నాడని విమర్శలు చేశారు. వైసీపీలో ఉన్న వారు బంధువులు, స్నేహితులు, చుట్టాలని ఉపేక్షించవద్దని మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి తొలిమాటగా చెప్పారని, ప్రజలకు మేలు జరగాలి అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని చెప్పారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను ఇక్కడ జరగనివ్వడం లేదన్నారు. సుండుపల్లెలో అర్ధరాత్రి టిప్పర్లతో మట్టి తోలుతున్న వాళ్లను ప్రోత్సహిస్తోంది మంత్రి కాదా? అని ప్రశ్నించారు. రాజంపేటలో ఇసుకదందాకు తెరలేపుతున్నారని, వైసీపీతో కలిసి టీడీపీని నిర్వీర్యం చేయాలనుకుంటే కార్యకర్తలతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. సిద్దవటం మండలంలో ఇసుక రీచ్‌ ఓపెన్‌ కావడంలేదని, కాని అర్ధరాత్రి పెద్దఎత్తున ఇసుక టిప్పర్లతో బయటి ప్రాంతాలకు వెళుతుందని అన్నారు. పాలనలో జరిగే పొరపాట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్చించడం ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ప్రభుత్వంలో జరిగే లోటుపాట్లను పార్టీ దృష్టికి తీసుకుపోవడం ద్వారా పార్టీలో చర్చించి లోపాలను సరిదిద్దుతారని, అందుకోసం ప్రతిఒక్కరు ప్రశ్నించే తత్వం అలవరుచుకోవాలన్నారు. అనంతరం 100 రోజుల ఎన్డీయే పాలనపై, సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సుండుపల్లె ఎంపీపీ రాజమ్మ, టీడీపీ నాయకులు శివకుమార్‌నాయుడు, శివప్రసాద్‌నాయుడు, దామోదర్‌నాయుడు, ప్రతాప్‌రెడ్డి, వెంకటేశ్వర్లునాయుడు, రమేశ్‌నాయుడు, యూసుఫ్‌, యూనియన్‌బాషా, గురుస్వామినాయుడు, జనసేన నాయకులు రామాశ్రీనివాసులు, ఒంటిమిట్ట టీడీపీ నాయకులు బాలిశెట్టి హరిప్రసాద్‌, గజ్జల నరసింహారెడ్డి, బొబ్బిలిరాయుడు, రమణ, ఎంవీ రమణ, వీరాంజనేయరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వందరోజులు అయ్యీకాకనే..

కూటమి ప్రభుత్వం కొలువుదీరి వంద రోజులైనా సక్రమంగా కాకముందే.. రాజంపేట నియోజకవర్గంలో అధికారపార్టీ కుమ్ములాటలు రచ్చకెక్కడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు నాయకుల వల్లే నియోజకవర్గంలోని టీడీపీలో గొడవలు జరుగుతున్నాయని, అధిష్టానం, ఇతర నాయకుల మీద ఆధారపడకుండా.. స్వయంగా జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Sep 23 , 2024 | 11:28 PM