Share News

AP Fibernet: వ్యూహం సినిమాపై ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Dec 19 , 2024 | 12:28 PM

Andhrapradesh: ఇంటర్నెట్, కేబుల్ సర్వీసులను ప్రజలకు తక్కువకు ఇవ్వాలని గతంలో చంద్రబాబు ఏపీ‌ఫైబర్ నెట్ ప్రారంభించారని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. 2019 నాటికి పది లక్షల కనెక్షన్లు ఉన్నాయని.. 2024 నాటికి కేవలం ఐదు లక్షల కనెక్షన్లకు పడిపోయాయన్నారు.

 AP Fibernet: వ్యూహం సినిమాపై ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
AP Fibernet Chairman GV Reddy

విజయవాడ, డిసెంబర్ 19: ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు 2.15 కోట్లు ఫైబర్ నెట్ సంస్థ తరపున చెల్లించారని.. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం జరిగిందని తెలిపారు. అయితే ఆ సినిమాకి 1863 వ్యూస్ మాత్రమే వచ్చాయని.. అంటే ఒక్కో వ్యూస్‌కు 11 వేలు చెల్లించినట్లు అయ్యిందన్నారు. ఇలా అనేక అవకతవకలు జరిగాయని నిర్ధారణ అయ్యిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ ఎన్నో అవకతవకలు జరిగాయని, కనెక్షన్లు కూడా సగానికి పైగా పడిపోయాయని తెలిపారు. టీడీపీ హయాంలో అన్ని విధాలుగా తయారును చేసిన సంస్థకు మెయింటెనెన్స్‌ పేరుతో వేలకోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. గతంలో అక్రమంగా ఎంపిక చేసిన వారిని పూర్తిగా తొలగిస్తామని.. పూర్తి పారదర్శకంగా ఉండేలా తాము ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. కేబుల్ ఆపరేటర్‌లతో సమావేశాలు పెట్టి ఫైబర్ నెట్‌ను మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

Bhuvaneshwari: నాలుగురోజుల పాటు కుప్పంలో భువనేశ్వరి పర్యటన


ఐదేళ్లలో ఫైబర్ నెట్ సేవలు నిర్వీర్యం..

ఇంటర్నెట్, కేబుల్ సర్వీసులను ప్రజలకు తక్కువకు ఇవ్వాలని గతంలో చంద్రబాబు ఏపీ‌ఫైబర్ నెట్ ప్రారంభించారన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. వాటి‌ ఫలాలను కూడా ప్రజలు, ఉద్యోగులు చూశారని తెలిపారు. 2019 నాటికి పది లక్షల కనెక్షన్లు ఉన్నాయని.. 2024 నాటికి కేవలం ఐదు లక్షల కనెక్షన్లకు పడిపోయాయన్నారు. ఈ ఐదేళ్లల్లో ఫైబర్ నెట్ సేవలను నిర్వీర్యం చేశారని.. ఇప్పుడు దివాలా తీసే పరిస్థితిలో ఈ సంస్థ ఉందన్నారు. పురోగమనం లేకపోగా తిరోగమనం దిశగా మార్చిన ఘనుడు జగన్ అంటూ విరుచుకుపడ్డారు. ఇక సిస్టం అనేది లేకుండా లెక్కా పత్రం రాయకుండా అత్యంత దారుణంగా నడిపారన్నారు. ఆరోజు ఎండీ, ఛైర్మన్ ఏం పని చేశారో అర్ధం కావడం లేదన్నారు.


ఆదాయం వచ్చే సంస్థను కూడా..

ఐదేళ్లల్లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందన్నారు. ఆ నివేదిక వచ్చిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. గత టీడీపీ హయాంలో 108 మంది ఉద్యోగులు, 40 లక్షల జీతాలు నెలకు, పది లక్షల కనెక్షన్లు ఇచ్చారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు లక్షల కనెక్షన్లకు పడిపోగా, ఉద్యోగులు మాత్రం 1360 మంది, వారికి నెలకు నాలుగు కోట్ల జీతాలు చెల్లించారని మండిపడ్డారు. పది రెట్లు పెరగాల్సిన కనెక్షన్లు సగానికి తగ్గి దివాళా అంచనాకి తెచ్చాన్నారు. ఇంతమంది ఉన్నా... ఎందుకు కనెక్షన్లు తగ్గాయని ప్రశ్నించారు. కేబుల్ ఆపరేటర్లను కూడా చిత్ర హింసలు పెట్టారని.. వారి నుంచి డబ్బులు కూడా దోచుకుని కనెక్షన్లు ఇవ్వలేదన్నారు. 1262 కోట్ల రూపాయల అప్పు ఈరోజు ఈ‌ ప్రభుత్వ సంస్థపై ఉందన్నారు. ‘‘మాకు ఆదాయం వచ్చే సంస్థను కూడా అప్పుల ఊబిలోకి నెట్టారు’’ అంటూ మండిపడ్డారు.


వేల మందికి దోచిపెట్టారు..

3513 కోట్లతో అన్ని ఏర్పాటు చేసి ఫైబర్ నెట్ మొదలు పెట్టారని.. అంతా రెడీ చేసిన సంస్థకు వైసీపీ హయాంలో 6800 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. అన్ని విధాలా నెలకొల్పిన సంస్థకు అన్ని వేల కోట్లు ఎలా ఖర్చు చేశారని ప్రశ్నించారు. కేవలం మెయింటెనెన్స్‌కు అన్ని వేల‌కోట్లు ఎక్కడ పెట్టారని అడిగారు. ఎన్నికల ముందు డబ్బులు మొత్తం డ్రా చేసుకుని వెళ్లిపోయారని విమర్శించారు. ఈ అంశాలపై కుడా విచారణ జరుగుతుందన్నారు. ఈ సంస్థలో ఉద్యోగాలు కూడా అడ్డగోలుగా ఇచ్చారని.. ఒక్క వాట్సప్ మెసేజ్‌తో ఉద్యోగం, వేల రూపాయలు జీతం ఇచ్చారన్నారు. ఇలా వేలాది మందికి దోచి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా వైసీపీ నాయకుల ఇళ్లల్లో పని చేశారని.. జీతాలు ఇక్కడ తీసుకున్నారన్నారు. విచారణ మొత్తం పూర్తి అయ్యాక వైసీపీ అవినీతి మొత్తం బయట పెడతామన్నారు. కేబుల్ ఆపరేటర్‌లను విద్యుత్ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని.. పోల్‌కు వైర్లు ఉంటే తొలగించడం సరికాదన్నారు. ‘‘మీకు ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఉన్నతాధికారులు చెప్పినా, ఏఈ, డీఈ స్థాయిలో ఈ ఇబ్బంది ఉంది. ఇటువంటి చర్యలు చేయవద్దని విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నాం’’ అని ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి కోరారు.


ఇవి కూడా చదవండి...

Hyderabad: భర్త మోసం చేశాడని భార్యకు వేధింపులు

వాహనదారులకు షాక్.. హైకోర్టు సంచలన ఆదేశాలు..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 19 , 2024 | 12:42 PM