Cyber Crime: సైబర్ మోసాల గురించి తెలుసుకో.. జీవితాన్ని కాపాడుకో..
ABN , Publish Date - Jul 23 , 2024 | 04:38 PM
భారతదేశాన్ని ప్రస్తుతం పట్టిపీడిస్తున్న సమస్యల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సైబర్ మోసాల గురించి. ఎప్పుడు ఎవరి బ్యాంకు ఖాతాల్లో నగదు ఎలా మాయం అవుతుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా, ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా మోసపోయే వాళ్లు పోతూనే ఉన్నారు. నగదు పోగొట్టుకుంటున్న బాధలో ఆత్మహత్యలు సైతం చేసుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు.
భారతదేశాన్ని ప్రస్తుతం పట్టిపీడిస్తున్న సమస్యల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సైబర్ మోసాల గురించి. ఎప్పుడు ఎవరి బ్యాంకు ఖాతాల్లో నగదు ఎలా మాయం అవుతుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా, ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా మోసపోయే వాళ్లు పోతూనే ఉన్నారు. నగదు పోగొట్టుకుంటున్న బాధలో ఆత్మహత్యలు సైతం చేసుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కూడా కేటుగాళ్ల బెదడ వదలడం లేదు. ఒక మోసాన్ని అడ్డుకుని ప్రజలకు దానిపై అవగాహన కల్పించగానే మరో కొత్త కోణంలో మోసాలకు తెరలేపుతున్నారు. విద్యావంతులు, ఉన్నత స్థాయిల్లో ఉన్నవారు సైతం వారి బారిన పడుతున్నారంటే కేటుగాళ్లు ఎలా బురిడీ కొట్టిస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇంక చిన్నచిన్న పట్టణాలు, గ్రామాల్లో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండడంతో సైబర్ మోసాలకు ఎక్కువగా గురవుతున్నారు. పోలీసులు ఎంత అప్రమత్తం చేసినా కూడా అత్యాశతో కొందరు, మోసాల పట్ల అవగాహన లేక మరికొందరు, బెట్టింగ్‌లకు బానిసలై మరికొందరు మోసపోతూనే ఉన్నారు.
సైబర్ మోసాలు రకాలు..
సైబర్ మోసాల గురించి చెప్పాలంటే అవి రకరకాలుగా ఉంటాయి. లోక్ యాప్స్ పేరుతో డబ్బులు ఆశ చూపి ఇచ్చిన దాని కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఇవ్వాలని వేధింపులకు గురి చేస్తారు. మీకు లాటరీ తగిలిందని ఆ నగదు ఇవ్వాలంటే ముందుగు మీరు కొంత సొమ్ము చెల్లించాలని మరికొన్ని మోసాలు జరుగుతున్నాయి. విదేశాల నుంచి మీకు విలువైన బహుమతులు వచ్చాయని అవి తీసుకోవాలంటే కస్టమ్స్ సుంకం చెల్లించాలని కేటుగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. బ్యాంక్ అధికారులమని ఖాతాను అప్డేట్ చేసేందుకు ఫోన్‌కు వచ్చే ఓటీపీ చెప్పాలంటూ నగదు దోచేస్తుంటారు. మీకు లోన్ వచ్చిందని ఈ లింక్‌పై క్లిక్ చేస్తే డబ్బులు మీ ఖాతాలో పడతాయని చెప్పి ఆ తర్వాత వారి ఖాతాల్లోని సొమ్మునే స్వాహా చేస్తున్న ఘటనలు మరికొన్ని. అలాగే యువత సైతం ఆన్ లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకుని ఇంట్లో చెప్పలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు ఎన్నో కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే వీటికి అంతే ఉండదు. కేటుగాళ్లు ఆన్ లైన్ మోసాలను ఆకాశమే హద్దుగా చేసుకుని రెచ్చిపోతున్నారు.
స్రవంతి ఘటనే ఉదాహరణ..
కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం మంటాడలో ఇలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. పేటేటి స్రవంతి(28) అనే వివాహిత చరవాణికి రూ.5లక్షలు రుణం ఇస్తామంటూ మెసేజ్ వచ్చింది. కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో ఆ నంబరుకు మహిళ ఫోన్ చేసింది. లోన్ ఇస్తామని చెప్పిన కేటుగాళ్లు అందుకు ముందుగా కొంత నగదు చెల్లించాలని చెప్పారు. దాంతో భర్త శ్రీకాంత్‌కు తెలియకుండా అప్పు చేసి మరీ విడతల వారీగా రూ.లక్ష వరకు చెల్లించింది. మరో రూ.1.20లక్షలు చెల్లిస్తే గాని మొత్తం రుణం ఇవ్వడం కుదరని చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించింది. దీంతో ఆమె ఆదివారం రోజున ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. చికిత్సపొందుతూ వివాహిత సోమవారం మధ్యాహ్నం మృతి చెందింది. ఆత్మహత్యకు ముందు స్రవంతి తీసిన సెల్ఫీ వీడియో సంచలనం సృష్టించింది. "తప్పు చేశా బావా, కుటుంబం కోసం అప్పు తీసుకోవాడానికి చూశా. కానీ వాళ్లు నన్ను మోసం చేశారు. నా ముఖం నీకు చూపించలేను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్న" అంటూ ఆమె చెప్పిన మాటలు కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలోకి నెట్టాయి.
ఇలాంటి లోన్ యాపులపై జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే పోలీసులు చాలాసార్లు హెచ్చరికలు జారీ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు, చిరుద్యోగులు, గృహిణులు ఎక్కువగా ఈ రుణ యాప్‌ల బారిన పడుతుంటారు. లోన్ ఇచ్చేందుకు ఫీజుల పేరుతో ఇలా ముందుగా వసూలు చేసే కేటుగాళ్లు కొందరైతే.. లోన్ ఇచ్చి అధికంగా వసూలు చేసేవారు మరికొందరు. వారు అడిగినంత డబ్బులు చెల్లించకపోతే బాధితుల ఫోన్ గ్యాలరీలోని ఫొటోలు మార్ఫింగ్ చేసి వారి బంధువులు, కుటుంబసభ్యులకే పంపిస్తూ నీచంగా ప్రవర్తింటారు. మీ ఫోన్‌కు వచ్చే మోసపూరిత ప్రకటనలు, సందేశాలు, లింక్‍లపై అప్రమత్తంగా ఉండండి. ఎలాంటి ఓటీపీలు ఎవ్వరికీ చెప్పవద్దు. అందరూ ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ చేసి ఎవరైనా మీపై ఒత్తిడి తీసుకువస్తే ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు. వెంటనే సైబర్ క్రైమ్ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేయండి.