Share News

Sharmila: సీతారాం ఏచూరి పోరాటం మాకు స్ఫూర్తి

ABN , Publish Date - Sep 22 , 2024 | 07:18 PM

ఏచూరి రాజకీయ జీవితం, తరతరాలకు స్ఫూర్తిదాయకమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. పదవులు, పైసలు, పవర్ ముఖ్యం కానే కాదు అని సీతారాం ఏచూరి చాటి చెప్పారని కొనియాడారు. ఆయన విశిష్ట వ్యక్తిత్వానికి మరోసారి ఇదే మా నివాళి అని వైఎస్ షర్మిల తెలిపారు.

Sharmila: సీతారాం ఏచూరి పోరాటం మాకు స్ఫూర్తి

విజయవాడ: దివంగత మాజీ రాజ్యసభసభ్యులు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. విజయవాడలో ఇవాళ(ఆదివారం) సీతారాం ఏచూరి సంతాప సభ జరిపారు. ఈ సభలో పాల్గొని ఏచూరికి షర్మిల నివాళి అర్పించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... ఏచూరి లౌకిక వాది, మానవతావాది, మేధావి. గొప్ప రచయిత. ఉత్తమ పార్లమెంటేరియన్ అని కొనియాడారు.


2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకు, ప్రభుత్వం నిలబడటానికి ఆయన ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. ఇప్పుడున్న ఇండియా బ్లాక్ ఏర్పాటుకు కృషి చేశారని అన్నారు. ఏచూరి అంటే A protector of the idea of India with a deep understanding of our country. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఏచూరి అత్యంత సన్నిహితుడని వివరించారు. ఏచూరి ఈ దేశంలో ఒక లౌకికవాద పార్టీ అధికారంలో ఉండాలని కోరుకునేవారని గుర్తుచేశారు. మతతత్వ పార్టీ బీజేపీ మీద చేసిన పోరాటం మాకు స్ఫూర్తి అని తెలిపారు.


వ్యాపారాల కోసం, మనుగడ కోసం, స్వార్థంతో, పార్టీలు మారుతున్న నేటి కాలంలో, మొదటి రోజునుంచి, చివరి వరకు, తాను కట్టుబడిన సిద్ధాంతాల కోసం, ప్రజల కోసం, వారి హక్కుల కోసం ఏచూరి పోరాడారని చెప్పారు. ఏచూరి రాజకీయ జీవితం, తరతరాలకు స్ఫూర్తిదాయకమని వ్యాఖ్యానించారు. పదవులు, పైసలు, పవర్ ముఖ్యం కానే కాదు అని సీతారాం ఏచూరి చాటి చెప్పారని కొనియాడారు. ఆయన విశిష్ట వ్యక్తిత్వానికి మరోసారి ఇదే మా నివాళి అని వైఎస్ షర్మిల తెలిపారు.

Updated Date - Sep 22 , 2024 | 07:24 PM