Share News

Prison Officer's : ఖైదీపై క్రూర లాఠీ

ABN , Publish Date - Dec 11 , 2024 | 03:41 AM

రాజమండ్రి సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ విషయంలో జైళ్ల ఉన్నతాధికారి ప్రవర్తించిన తీరు ఆ శాఖనేదిగ్ర్భాంతికి గురిచేస్తోంది. ఇంటి అవసరాలకు వాడుకుంటున్న ఖైదీని..

 Prison Officer's : ఖైదీపై క్రూర లాఠీ

  • జైలులో ఉండాల్సిన ఖైదీతో ఇంటి పనులు

  • సరిగా పనిచేయలేదంటూ బాదేసిన జైళ్ల ఉన్నతాధికారి

  • అడ్డొచ్చిన వార్డర్‌కు కూడా గాయాలు

  • రాజమండ్రి సెంట్రల్‌ జైలు పరిధిలో ఘటన

  • గతంలోనూ ఖైదీలపై రాక్షస ‘కిరణం’ పైశాచికం

  • సీమ వైసీపీ మాజీ మంత్రికి ఈయన బంధువు

  • తొలి నుంచీ జైళ్ల శాఖలో వివాదాస్పదుడిగా ముద్ర

అమరావతి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాజమండ్రి సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ విషయంలో జైళ్ల ఉన్నతాధికారి ప్రవర్తించిన తీరు ఆ శాఖనేదిగ్ర్భాంతికి గురిచేస్తోంది. ఇంటి అవసరాలకు వాడుకుంటున్న ఖైదీని..పనులు సరిగా చేయడం లేదంటూ ఆ అధికారి లాఠీ తీసుకుని గొడ్డును బాదినట్టు బాదేశారు. అడ్డొచ్చిన వార్డర్‌ను కూడా కొట్టారు. బాధిత ఖైదీ రాజమండ్రి ఓపెన్‌ ఎయిర్‌ జైలులో ఉంటున్నాడు. సాధారణంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను మాత్రమే ఓపెన్‌ జైలులో ఉంచుతారు. వ్యవసాయ పనులు మాత్రమే వారితో చేయిస్తారు. అలాంటి ఖైదీతో ఇంటి పనులు చేయించడమే పెద్ద తప్పు. పైగా.. పనులు సక్రమంగా చేయలేదని క్రూరంగా కొట్టడం ఇంకా పెద్ద నేరం. బీడీ తాగుతుంటే దండించినట్టు ఆయన వివరణ ఇచ్చినట్టు సమాచారం. అయితే, ఈ అధికారి గత చరిత్ర తెలిసిన జైళ్లశాఖలోని పలువురు... ఆయన వాదన నమ్మశక్యంగా లేదని అంటున్నారు.

  • ఆయనను బదిలీ చేస్తే స్వీట్లు పంచుకున్న సిబ్బంది..

గత వైసీపీ ప్రభుత్వంలో ఓ రాయలసీమ మంత్రికి సదరు అధికారి సమీప బంధువు. దీంతో ఆయనను కడప జైలు సూపరింటెండెంట్‌గా నియమించారు. అప్పట్లో వివేకానంద రెడ్డి హత్యకేసు నిందితులు అక్కడ ఉండటంతో ఆయనను అక్కడకు పంపించారు. అయితే ఈ అధికారి అరాచకాలపై పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో జగన్‌ సర్కారే ఈయనను భరించలేకపోయింది. దీంతో రాజమండ్రి జైలుకు బదిలీ చేసింది. ఆయన బదిలీ ఘటనను కడప జైలు సిబ్బంది వేడుకలా జరుపుకొన్నారు. స్వీట్లు పంచుకున్నారు.


ఖైదీల నుంచి జైలు ఉద్యోగుల వరకు ఎంతగా ఈయన టార్చర్‌ చేసేవారనేందుకు ఈ ఘటనే నిదర్శనం. వారి దృష్టిలో ఈయన ఓ ‘రాక్షస కిరణం’గా ముద్రపడ్డారు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు అప్పట్లో రాజమండ్రి జైలులోనే ఉన్నారు. చంద్రబాబు ఏడు వారాలకు పైగా ఆ జైలులో ఉన్నారు. ఈ సమయంలో ములాఖత్‌ల విషయంలో ఆ అధికారి చాలా ఇబ్బందిపెట్టారు. గతంలో నెల్లూరు జైలు సూపరింటెండెంట్‌గానూ ఆయన పనిచేశారు. ఆ సమయంలో ఒక ఖైదీ విషయంలో క్రూరంగా ప్రవర్తించారనే ఆరోపణలను ఈయన ఎదుర్కొంటున్నారు. ఇంటి పనులు సరిగా చేయడం లేదంటూ లాక్‌పలోకి లాక్కొచ్చి ఆయన దుస్తులు విప్పేసి కర్ర చొప్పించినట్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు సైతం ఈ ఘటనపై అప్పట్లో ఫిర్యాదులు అందాయి.

Updated Date - Dec 11 , 2024 | 03:41 AM