Share News

Vijayawada Floods: వరద తాకని రాజధాని!

ABN , Publish Date - Sep 03 , 2024 | 04:06 AM

నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి కాల పరీక్షను ఎదుర్కొని దీటుగా నిలిచింది. నవ నగరం నీట మునిగిందంటూ దుష్ప్రచారానికి దిగినవారికి గట్టిగా సమాధానమిచ్చింది. ప్రకృతి పెట్టిన కాల పరీక్షల్లో అత్యధిక మార్కులతో పాసై ప్రజా రాజధానిగా నిలిచింది.. ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక పర్యటనలో..

Vijayawada Floods: వరద తాకని రాజధాని!

  • నిక్షేపంగా నవనగరం..

  • వైసీపీ హయాంలో ముంచేందుకు కుట్ర

  • ఇప్పుడు కూడా భారీ వరదకు..

  • మునిగిపోయిందంటూ దుష్ప్రచారం

అమరావతి/గుంటూరు/తుళ్లూరు, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి (Amaravati) కాల పరీక్షను ఎదుర్కొని దీటుగా నిలిచింది. నవ నగరం నీట మునిగిందంటూ దుష్ప్రచారానికి దిగినవారికి గట్టిగా సమాధానమిచ్చింది. ప్రకృతి పెట్టిన కాల పరీక్షల్లో అత్యధిక మార్కులతో పాసై ప్రజా రాజధానిగా నిలిచింది.. ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక పర్యటనలో.. రాజధానికి అత్యంత అనువైన, సురక్షితమైన ప్రాంతంగా మరోమారు నిరూపించుకుంది. నవ్యాంధ్ర రాజధానిని విచ్ఛిన్నం చేయాలని ఎన్నో శక్తులు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) చెప్పినట్లు అమరావతి స్థల మహత్యమో, ప్రకృతి వరమో తెలియదుగానీ అమరావతి మునిగిపోవాలన్న కొందరి కలలు కల్లలుగానే మిగిలిపోతున్నాయి. మానవ నాగరికతలన్నీ నదీ పరివాహక నాగరికతలేనన్న చారిత్రక సత్యాన్ని తెలుసుకోలేని గత వైసీపీ ప్రభుత్వం.. రాజధానిని వరదల్లో ముంచాలని గతంలో ప్రయత్నించిందని రాజధానివాసులు ఆక్షేపిస్తున్నారు. ‘కృష్ణానదిని ఆనుకుని ఉన్న రాజధాని వరదల బారిన పడి మునిగి పోతుందని ప్రచారం చేయాలని చూసింది. అందుకోసం ప్రకాశం బ్యారేజా నుంచి వరదను దిగువకు వదలకండా బలవంతంగా నిల్వ ఉంచింది. వరద ముంపునకు గురైతే ఆ కారణం చూపి విశాఖకు రాజధానిని తరలించుకోవాలని ప్రయత్నించింది. కానీ ఒక్క చుక్క నీరు కూడా రాజధాని దరి చేరలేదు. తాజా రికార్డు వరద సమయంలోనూ అదే దుష్ప్రచారానికి వైసీపీ తెరలేపింది. రాజధాని నగరం మొత్తం మునిగిపోయిందని జగన్‌ నీలి మీడియా తప్పుడు వార్తలు వండివార్చింది. ఈ నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ రాజధాని గ్రామాల్లో పర్యటించింది. క్షేత్రస్థాయి పరిస్థితులను చిత్రీకరించింది.


Floods.jpg

సురక్షిత నగరంగా అమరావతి

అమరావతికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ మహానగరం వరద ముంపునకు గురయింది. గుంటూరులోనూ భారీవర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అమరావతి మునిగిపోయిందంటూ ప్రచారం మొదలుపెట్టింది. సోషల్‌ మీడియాలో తప్పుడు వీడియోలు పోస్టుచేసింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది. హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించే కోర్‌ క్యాపిటల్‌ ప్రాంతం అత్యంత సురక్షితంగా ఉంది. రాజధాని గ్రామాల్లో వర్షం కారణంగా నిలిచిన నీరు తప్ప ఎక్కడా వరద ఆనవాలు లేదు. హైకోర్టుకు వెళ్లే దారులు, శాసన సభ్యులు, మండలి సభ్యుల భవనాలకు వెళ్లే దారులు, సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు, ఆలిండియా సర్వీస్‌ ఉద్యోగుల భవన సముదాయాలు, గ్రూప్‌-డీ ఉద్యోగుల భవనాల పరిసరాల్లోచుక్క నీరు కూడా నిలిచి లేదు. తుఫాను ప్రభావాన్ని దాటి, అతి భారీ వర్షాల ధాటిని అధిగమించి ఆ ఆకాశ హర్మ్యాలు దర్జాగా నిలిచి ఉన్నాయి.


AP-Capital.jpg

మాస్టర్‌ ప్లాన్‌తో ముందుచూపు..

రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించే సమయంలోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. రాజధాని గ్రామాల్లో ముంపునకు కారణమయ్యే ఏకైక అవకాశం కొండవీటి వాగుగా గుర్తించింది. దాని ముంపు నుంచి రాజధానిని రక్షించేందుకు అప్పుడే చర్యలు చేపట్టింది. ఆ వాగు వరద నీరు సాధారణంగా కృష్ణా నదిలో కలిసే అవకాశం ఉన్నా, అత్యధిక వరద వచ్చినప్పుడు సమస్య తలెత్తకుండా లిఫ్టులను ఏర్పాటు చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ లిఫ్టులను వాడకుండా కొండవీటి వాగు వరద నీటితో అమరావతిని ముంపు బారిన పడేలా చేయాలని ప్రయత్నించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అవే లిఫ్టులు కొండవీటి వాగు వరద ముంపు నుంచి అమరావతిని రక్షించడానికి దోహదపడ్డాయి. రాజధాని ప్రాంతానికి, నదికి మధ్యలో పెద్ద కరకట్ట అడ్డుగా ఉంది. వరద నీరు దాని వరకూ వచ్చి ఆగిపోయింది. ఆ రెంటి మధ్యలో ఉన్న కొన్ని భవనాలు మాత్రం కొంత మేర ముంపునకు గురయ్యాయి. మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమం నది ఒడ్డునే ఉంది.

AP-Capital-Situation.jpg

దానిలోకి నీళ్లు వచ్చాయి. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం నివాసం ఉంటున్న అద్దె ఇల్లు కూడా నదిని ఆనుకునే ఉంటుంది. ఆ ఇంటి ప్రహరీ గోడను తాకుతూ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ఇంటి ఆవరణలోకి కూడా స్వల్పంగా నీళ్లు వచ్చాయి. కానీ కరకట్టను దాటి మాత్రం ప్రవేశించలేదు. మంతెన ఆశ్రమం వద్ద కరకట్ట వద్ద ఒక తూమును గతంలో మూసివేయకుండా వదిలేశారు. ఆ తూము వద్ద వరద నీరు లీక్‌ అవుతుండడంతో ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు. ఈ ఆశ్రమం నుంచి రాష్ట్ర సచివాలయం ఐదు కిలోమీటర్ల దూరంలో. హైకోర్టు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వాటి దరిదాపుల్లో కూడా వరద ప్రభావం కనిపించలేదు. రాజధానికి భూ సేకరణకు ముందు ఆ ప్రాంతంలో కొండవీటి వాగు వరద సమస్య సృష్టిస్తూ ఉండేది. కానీ టీడీపీ ప్రభుత్వం దాని వరద కోసం ప్రత్యేకంగా ఎత్తిపోతల పధకం ఏర్పాటు చేయడంతో ఈసారి ఆ వాగు ప్రవాహం సాఫీగా వెళ్లిపోయింది. అమరావతి పేరుతో ఒక మండల కేంద్రం రాజధాని ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఆ అమరావతి గ్రామంలోని పల్లపు ప్రాంతాల్లోకి మాత్రం వరద కొంతమేర వచ్చింది.

AP-Capital.jpg

Updated Date - Sep 03 , 2024 | 07:45 AM