Share News

Visakha Steel Plant: విశాఖ ఉక్కు పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు..

ABN , Publish Date - Aug 04 , 2024 | 11:45 AM

విశాఖ: స్టీల్‌ ప్లాంటు విషయంలో ఏళ్ల నాటి నిరీక్షణకు తెరపడడంలేదు. విశాఖ ఉక్కుపై ఎన్డీయే ప్రభుత్వం మాటలు కోటలు దాటాయి. కానీ పనులు మాత్రం చేతులు దాటడడంలేదు. కేంద్రమంత్రి వచ్చి హాడావుడి చేసి వెళ్లారు తప్ప.. పనులు మాత్రం ఆచరణలోకి రావడంలేదు. మరోవైపు ప్లాంటు పరిస్థితి రోజు రోజుకు మరింతగా దిగజారిపోతోంది.

Visakha Steel Plant: విశాఖ ఉక్కు  పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు..

విశాఖ: స్టీల్‌ ప్లాంటు (Steel Plant) విషయంలో ఏళ్ల నాటి నిరీక్షణకు తెరపడడంలేదు. విశాఖ ఉక్కుపై ఎన్డీయే ప్రభుత్వం (NDA Govt.) మాటలు కోటలు దాటాయి. కానీ పనులు మాత్రం చేతులు దాటడడంలేదు. కేంద్రమంత్రి వచ్చి హాడావుడి చేసి వెళ్లారు తప్ప.. పనులు మాత్రం ఆచరణలోకి రావడంలేదు. మరోవైపు ప్లాంటు పరిస్థితి రోజు రోజుకు మరింతగా దిగజారిపోతోంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం (Kutami Govt.,) ప్లాంట్‌పై దృష్టి పెట్టాలన్న విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అని నినదించి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కుపై.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. ఏళ్లనాటి నిరీక్షణకు తెరబడుబోతోందని కార్మికులు సంబరపడ్డారు. ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనకు తెరపడే అవకాశం ఉందని ఉక్కు ఉద్యోగులు భావించారు.


అయితే విశాఖ ఉక్కు పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. సంస్థను ప్రైవేటీకరణ చేయబోమని ఎన్డీయే ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారే తప్ప అది ఆచరణలో ఏ మాత్రం కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం ఎలాంటి సాయం చేస్తుందన్న విషయంపై ఎలాంటి క్లారిటీ రావడంలేదు. సాక్షాత్తు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్టీల్ ప్లాంట్‌ను సందర్శించి 20 రోజులు కావస్తోంది. స్టీల్ ఫ్లాంట్‌ను ప్రైవేటుపరం చేస్తామని ఎవరు చెప్పారు? దాన్ని కాపాడ్డానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామంటూ కేంద్రమంత్రి కుమారస్వామి చెప్పిన మాటలు విని కార్మికులు సంబర పడ్డారు. విశాఖ ఉక్కుకు గత వైభవం వస్తుందని భావించారు. కానీ మంత్రి మాటలు మిగిలిపోయాయేతప్ప.. ఆచరణలో మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి కదలిక లేదు. దీంతో కేంద్రమంత్రి వచ్చి వెళ్లినా.. ప్లాంట్‌కు ఇదే పరిస్థితి తప్పదా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.


కాగా విశాఖ స్టీల్‌ ప్లాంటు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా సాయం అందించే నాథుడు కనిపించడం లేదు. రెండేళ్ల క్రితం అతుల్‌ భట్‌ను సీఎండీగా ఇక్కడికి పంపించారు. మూతపడిన మూడో బ్లాస్ట్‌ ఫర్నే్‌స్ (బీఎఫ్‌) ను తెరిపించి, పూర్తి సామర్థ్యంతో ప్లాంటును నడిపిస్తామని ఆయన ప్రకటించారు. గతేడాది డిసెంబరు 29న బీఎఫ్‌-3 తెరుచుకోగా, ఆ తరువాత 45 రోజుల్లోనే బీఎఫ్‌-1 మూతపడింది. ఉన్న మూడు బీఎఫ్‌లను నడపడానికి అవసరమైన ముడిపదార్థాలు సమకూర్చుకోలేక చేతులెత్తేశారు. భట్‌ వచ్చాకే ప్లాంటు ఉద్యోగులకు వాయిదాల పద్ధతిలో జీతాలు ఇవ్వడం మొదలైంది. వివిధ బ్యాంకుల నుంచి తెచ్చిన రుణాలకు ప్రతినెలా వడ్డీల రూపంలో రూ.కోట్లు చెల్లిస్తున్నారు. ముడి పదార్థాలకు రూ.985 కోట్లు, విడి భాగాలకు రూ.289 కోట్లు, విద్యుత్‌, నీరు బిల్లులకు రూ.105 కోట్లు, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గు, లైమ్‌స్టోన్‌, నౌకల రవాణా చార్జీలకు రూ.3,338 కోట్లు, పెన్షనర్లకు రూ.360 కోట్లు, గ్రాట్యుటీ రూ.239 కోట్లు, పీఎఫ్‌, లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్లు, ఎల్‌ఐసీ వంటివన్నీ కలిపి రూ.400 కోట్లు, ఆపరేషన్‌ కాంట్రాక్టర్లకు రూ.169 కోట్లు, మైన్స్‌ ఇతరాలకు మరో రూ.50 కోట్లు కలిపి దాదాపు రూ.6వేల కోట్ల అప్పు ప్లాంటు నెత్తిన ఉంది. ఇప్పుడు ప్లాంటును నడపాలంటే ముడిపదార్థాలకు నిధుల్లేవు. ఉద్యోగ, కార్మిక సంఘాలు ఎప్పటికప్పుడు స్థానిక, రాష్ట్ర నాయకులతోపాటు కేంద్రంలో పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా ప్లాంటు పరిస్థితి మెరుగు పరచడానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ప్రైవేటీకరణ చేయబోమని ఒక్క మాట చెప్పడంతో తమ పని అయిపోయినట్టుగా ప్రవర్తిస్తున్నారు.

Updated Date - Aug 04 , 2024 | 11:45 AM