Share News

World Bank: అమరావతికి అండగా ప్రపంచ బ్యాంకు

ABN , Publish Date - Aug 13 , 2024 | 04:20 AM

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి అండగా నిలిచేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. వైసీపీ నేతల పితూరీల కారణంగా ఆగిపోయిన రుణ ప్రణాళిక మళ్లీ తెరమీదకు వస్తోంది.

World Bank: అమరావతికి అండగా ప్రపంచ బ్యాంకు

మళ్లీ తెరపైకి రుణ ప్రణాళిక

చంద్రబాబును కలిసిన బృందం

ప్రస్తుత పరిస్థితిని వివరించిన అధికారులు

రాజధానిలో 2050 నాటికి 35 లక్షల జనాభా

20 శాతం పచ్చదనం.. పార్కులు

తగిన సదుపాయాల కల్పనకు భారీ వ్యయం

మరోసారి రాష్ట్రానికి రానున్న బృందం

ఆ తర్వాత రుణ మంజూరుపై స్పష్టత

గతంలో వైసీపీ తప్పుడు ఫిర్యాదులతో గండి

అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి అండగా నిలిచేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. వైసీపీ నేతల పితూరీల కారణంగా ఆగిపోయిన రుణ ప్రణాళిక మళ్లీ తెరమీదకు వస్తోంది. శనివారం నుంచి అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్న నలుగురు సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంకు బృందం సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసింది. అమరావతి నిర్మాణానికి అందించాల్సిన ఆర్థిక సహాయ సహకారాలపై ముఖ్యమంత్రి వీరితో చర్చించారు. ప్రపంచబ్యాంకు ఉన్నతాధికారుల బృందం మరోసారి రాష్ట్రానికి వస్తుందని, ఆ తర్వాత అమరావతికి రాబోయే రుణంపై ఒక స్పష్టత వస్తుందని సీఆర్‌డీఏ అధికారులు చెప్పారు.


తాజా చర్చల్లో భాగంగా... 2050 నాటికి అమరావతి జనాభా 35 లక్షలకు చేరుకుంటుందని, వీరందరికీ ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన నిధులను రుణంగా ఇవ్వాలని రాష్ట్ర అధికారులు ప్రతిపాదించినట్టు సమాచారం. మొత్తం రాజధానిలో 20 శాతాన్ని పార్కులు, పచ్చదనంతో గ్రీన్‌ ఏరియాగా మార్చుతామని, అమరావతిలోని ప్రతి ఒక్కరూ కాలినడకన పార్కులకు చేరుకునే స్థాయిలో వీటిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే... డ్రైనేజీ, రోడ్ల కనెక్టివిటీ, మంచినీరు, ట్రంక్‌ ఇన్‌ఫ్రాల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. వీటికోసం భారీగా నిధులు అవసరమైనప్పటికీ... మొదటి దశలో రూ.15,000 కోట్లు కావాలని ప్రభుత్వం భావిస్తోంది.


వైసీపీ అడ్డుకుందిలా..

chandrababu-white-paper.jpg

అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు సహకారం కోసం గతంలోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించింది. ఇదంతా ఒక కొలిక్కి కూడా వచ్చింది. కానీ... వైసీపీ కుట్రల కారణంగా ఆగిపోయింది. అప్పట్లో... రూ.7,200 కోట్ల రుణం ఇవ్వాలని ప్రపంచ బ్యాంకుకు సీఆర్డీయే ప్రతిపాదనలు పంపింది. తొలిదశలో రూ.3,200 కోట్లు, రెండో దశలో మరో రూ.3,200 కోట్లు తీసుకోవాలని అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించింది. తొలిదశ రుణం తీసుకునేందుకు అప్పుడు కేంద్రం కూడా అంగీకరించింది. ప్రపంచ బ్యాంకు సూత్రప్రాయ ఆమోదంతో కొన్ని ప్రాధాన్య మౌలిక వసతుల కల్పన పనులను సీఆర్డీయే చేపట్టింది. కానీ... అదే సమయంలో వైసీపీ కుట్రలు మొదలయ్యాయి.


ప్రపంచబ్యాంకు నిధులతో చేపడుతున్న ప్రాజెక్టులు తమ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయంటూ ‘అమరావతి స్థానికుల’ పేరుతో వైసీపీ నేతలు ప్రపంచబ్యాంకుకు లేఖ రాశారు. 2017 మే 25న ఫిర్యాదు చేశారు. దీంతో ప్రపంచ బ్యాంకు బృందం రుణ సౌకర్యాన్ని పెండింగ్‌లో పెట్టి తనిఖీల కోసం అమరావతికి వచ్చింది. అమరావతిలోని అధికారులు, స్థానికులతో మాట్లాడింది. ఆ బృందం తన ప్రాథమిక నివేదికను ప్రపంచబ్యాంకుకు సమర్పించింది. పూర్తిస్థాయి నివేదిక కోసం మరిన్ని తనిఖీలు అవసరమని చెప్పింది. ఈలోగా రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. జగన్‌ ఏకంగా అమరావతిని అటకెక్కించారు. ‘మూడు ముక్కలాట’ కు తెరలేపారు. చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావడంతో అమరావతి మహర్దశ పడుతోంది. ప్రపంచ బ్యాంకు బృందం మూడు రోజులపాటు అమరావతిలో పర్యటించి... నిశిత పరిశీలనలు జరిపింది.

Updated Date - Aug 13 , 2024 | 06:22 AM