Union Budget 2024: బిగ్ అలర్ట్.. ఫిబ్రవరి 1 నుంచి ఈ రూల్స్ మారిపోతాయ్..!
ABN , Publish Date - Jan 27 , 2024 | 06:03 PM
Union Budget 2024: ఫైనాన్షియల్ అంశాలకు సంబంధించి ప్రతి నెలా ఏదో ఒక మార్పు ఉంటూనే ఉంటుంది. అయితే, మిగతా నెలలతో పోలిస్తే.. ఫిబ్రవరి నెల చాలా కీలకం అని చెప్పుకోవాలి. రానున్న ఫిబ్రవరి నెలలో ఫైనాన్షియల్ అంశాలకు సంబంధించి కీలక మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
ముంబై, జనవరి 27: ఫైనాన్షియల్ అంశాలకు సంబంధించి ప్రతి నెలా ఏదో ఒక మార్పు ఉంటూనే ఉంటుంది. అయితే, మిగతా నెలలతో పోలిస్తే.. ఫిబ్రవరి నెల చాలా కీలకం అని చెప్పుకోవాలి. రానున్న ఫిబ్రవరి నెలలో ఫైనాన్షియల్ అంశాలకు సంబంధించి కీలక మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. దీని ప్రభావం ప్రజల ఫైనాన్షియల్ అంశాలపై ప్రభావం చూపుతుంది. అలాగే.. పలు బ్యాంకులు ప్రకటించిన పథకాలకు కూడా జనవరి 30తో గడువు ముగియనుంది.
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మోదీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని పరిమితపిస్తున్న తరుణంలో వస్తున్న మధ్యంతర బడ్జెట్ ఇది. అందుకే ఈ బడ్జెట్‌పై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బడ్జెట్‌లో పన్ను మినహాయింపులు, ఆర్థిక సంస్కరణలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. బడ్జెట్‌తో పాటు.. ఫిబ్రవరిలో కొన్ని ఇతర అంశాలకు సంబంధించి నియమాలలో కూడా మార్పులు జరుగనున్నాయి. ఇందులో NPA పాక్షిక ఉపసంహరణలో మార్పులు, సావరిన్ గోల్డ్ బాండ్ పథకం న్యూ ఇన్‌స్టాల్‌మెంట్, ఎస్‌బిఐ హోమ్ లోన్ సహా పలు అంశాల్లో నియమ నిబంధనలు మారే అవకాశం ఉంది.
ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో చివరి బడ్జెట్ ఇది. దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అనేక రంగాలకు సంబంధించి కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం మూలధన వ్యయాన్ని పెంచుతుందన్న ఆశాభావాన్ని పలువురు నిపుణులు వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌లో ప్రత్యేక ప్రకటనలు ఏమీ ఉండకపోపవచ్చని చెబుతూనే.. మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కొన్ని రాయితీలను ప్రకటించవచ్చని భావిస్తున్నారు.
సావరిన్ గోల్డ్ బాండ్ (SGB)..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023-24 ఆర్థిక సంవత్సరంలో సావరిన్ గోల్డ్ బాండ్ చివరి విడతను ఫిబ్రవరిలో విడుదల చేస్తుంది. SGB 2023-24 సిరీస్ 4 ఫిబ్రవరి 12న ఓపెన్ అవుతుంది. 16 ఫిబ్రవరి 2024న ముగుస్తుంది. అంతకు ముందు విడత డిసెంబర్ 18న ప్రారంభమై డిసెంబర్ 22న ముగిసింది. ఈ వాయిదా కోసం, సెంట్రల్ బ్యాంక్ బంగారం ధరను గ్రాముకు రూ.6,199గా నిర్ణయించింది.
NPS ఉపసంహరణ నియమాలు..
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద పెట్టుబడి పెట్టిన నిధులను పాక్షికంగా ఉపసంహరించుకోవడానికి మార్గదర్శకాలను నిర్దేశిస్తూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) జనవరిలో మాస్టర్ సర్క్యులర్‌ను జారీ చేసింది. మొదటి ఇళ్లు కొనుగోలు లేదా నిర్మాణం కోసం మాత్రమే చందాదారులు పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చని పెన్షన్ బాడీ స్పష్టం చేసింది. ఈ నిబంధన ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానుంది.
ఫాస్టాగ్ ఈ-కేవైసీ..
కేవైసీ లేని అన్ని ఫాస్టాగ్‌లు జనవరి 31 తర్వాత డీయాక్టివేట్ అవుతాయని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే ప్రకటించింది. ఫిబ్రవరి 1 లోపు వినియోగదారులు తమ ఫాస్టాగ్ KYC పూర్తి చేసుకోవాలి. కాగా, దేశ వ్యాప్తంగా దాదాపు 7 కోట్ల ఫాస్ట్‌ట్యాగ్‌లు జారీ అయ్యాయి. వీటిలో కేవలం 4 కోట్లు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. ఇవి కాకుండా 1.2 కోట్ల డూప్లికేట్ ఫాస్టాగ్‌లు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటన్నింటినీ ఐడెంటీఫై చేయడానికే ఈ-కేవైసీ చేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది.
SBI హోమ్ లోన్స్..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం తన వినియోగదారులకు గృహ రుణాలపై భారీగా రాయితీలను అందిస్తోంది. 65 bps కంటే తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందిస్తోంది. హోమ్ లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజు, రాయితీలకు చివరి తేదీ 31 జనవరి 2024 గా ఇప్పటికే ప్రకటించింది. ఈ రాయితీ ఫ్లెక్సిపే, ఎన్ఆర్ఐ, నాన్-లైఫ్, ప్రివిలేజ్, ఇతరులకు అందుబాటులో ఉంది.
ధన్ లక్ష్మి ఎఫ్‌డి స్కీమ్..
'ధన్ లక్ష్మి 444 డేస్' పేరుతో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (PSB) ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం చివరి తేదీ జనవరి 31, 2024. అంతకు ముందు నవంబర్ 30, 2023 వరకే చివరి తేదీ ఉండగా.. దానిని జనవరి 31, 2024 వరకు పొడిగించింది. ఈ ఎఫ్‌డిలో డబ్బు పెట్టుబడి పెట్టేవారు గడువులోగా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఎఫ్‌డీ కాలవ్యవధి 444 రోజులు. వడ్డీ రేటు 7.4%, సూపర్ సీనియర్లకు ఇది 8.05% చొప్పు వడ్డీ రేటు అందిస్తోంది.