Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
ABN , Publish Date - May 21 , 2024 | 01:10 PM
మీ ఆధార్‌కు లింక్ అయిన 3 బ్యాంకు ఖాతాల నుంచి విదేశాలకు డబ్బు సరఫరా అయిందని, అరెస్ట్ తప్పదంటూ బెదిరించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) నగరవాసి నుంచి రూ.3.05 లక్షలు కాజేశారు.
- రూ. 3.05 లక్షలు కాజేసిన సైబర్ మోసగాళ్లు
హైదరాబాద్ సిటీ: మీ ఆధార్‌కు లింక్ అయిన 3 బ్యాంకు ఖాతాల నుంచి విదేశాలకు డబ్బు సరఫరా అయిందని, అరెస్ట్ తప్పదంటూ బెదిరించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) నగరవాసి నుంచి రూ.3.05 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన టీచర్(44)కు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి తాము బీఎస్ఎన్‌ఎల్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. ప్రస్తుతం మీరు వినియోగిస్తున్న ఫోన్ నెంబర్ ద్వారా చాలా చట్టవ్యతిరేక పనులు జరిగాయని, ఈ కారణంగా మరో 2 గంటల్లో మీ సిమ్ కార్డు బ్లాక్ అవుతుందని చెప్పారు. అంతేకాకుండా హాట్‌లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా లక్నోలోని ఆలంబాగ్ పోలీస్టేషన్ అధికారులకు అందుబాటులోకి రావాలని సూచించారు. బాధితుడితో మాట్లాడిన సైబర్ నేరగాడు తనను తాను సబ్ ఇన్‌స్పెక్టర్(Sub Inspector)గా పరిచయం చేసుకున్నాడు.
ఇదికూడా చదవండి: ఐదు రోజుల్లో నాలుగు చోరీలు.. నగరంలో దోపిడీ దొంగలు
మీ ఆధార్ నెంబర్(Aadhaar Number)కు మూడు ప్రముఖ బ్యాంకుల ఖాతాలు అనుసంధానమై ఉన్నాయని, ఈ బ్యాంకు ఖాతాల ద్వారా విదేశాలకు హవాలా మార్గంలో డబ్బు తరలిందని చెప్పాడు. ఖాతా దారుడైన మీపై ఫెమా, పీఎంఎల్‌ఏ కేసులు నమోదయ్యాయని, మరో రెండు గంటల్లో అరెస్ట్, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాడు. ఇప్పుడు మాట్లాడుతున్న ఫోన్ కాల్ సాక్షంగా రికార్డు చేస్తున్నామని నమ్మబలికాడు. అరెస్ట్, తదుపరి విచారణ నుంచి మినహాయింపు కావాలంటే రూ.3.05,533 డబ్బు సూచించిన ఖాతాలో జమచేయాలని సూచించాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు బాధితుడు అతడు సూచించిన విధంగా రూ. 3.05,533 పలు ఖాతాల్లో జమచేశాడు. తర్వాత ఫోన్‌లు రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొత్త నెంబర్ల ద్వారా గుర్తు తెలియని ఫోన్ చేసి, పోలీసు అధికారులమని భయపెడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సైబర్ క్రైం అధికారులు సూచించారు.
ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్ రోజున.. తగ్గిన పొల్యూషన్
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News