Bangladesh Clashes: కట్టుబట్టలతో వచ్చేశారు.. షేక్ హసీనా బృందం దుస్థితి
ABN , Publish Date - Aug 08 , 2024 | 06:25 PM
అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో హింసాత్మక(Bangladesh Clashes) తిరుగుబాటుతో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. నిరసనకారులు హసీనా భవనానికి సమీపిస్తున్నారని తెలియగానే.. ఆమె బృందం మొత్తం కట్టుబట్టలతో దేశాన్ని విడిచి వచ్చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో హింసాత్మక(Bangladesh Clashes) తిరుగుబాటుతో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. నిరసనకారులు హసీనా భవనానికి సమీపిస్తున్నారని తెలియగానే.. ఆమె బృందం మొత్తం కట్టుబట్టలతో దేశాన్ని విడిచి వచ్చేసింది. నిరసనకారులు సమీపిస్తుండటంతో కనీసం దుస్తులు ఇతర వ్యక్తిగత వస్తువులు సైతం తెచ్చుకునే పరిస్థితి లేకపోయిందని సన్నిహితులు వాపోయారు.
ప్రాణాలతో బయటపడటం ముఖ్యమని వారంతా హసీనా(Sheikh Hasina)తో కలిసి సీ-130 జే విమానంలో భారత్‌కు వచ్చేశారు. భారత్‌కి వచ్చాక ఆఫీసర్లు నిత్యావసరాల కొనుగోలులో వారికి సాయం చేసినట్లు తెలుస్తోంది. హసీనా బృందంతో జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ ధోబాల్ వారితో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నారు.
ఇంకా కోలుకోని హసీనా..
బంగ్లాదేశ్‌లో అనూహ్య పరిణామాలు తాను ఊహించలేదని మాజీ ప్రధాని షేక్ హసీనా తన సన్నిహితుల వద్ద అన్నారట. ఆ భయంకర అనుభవాల నుంచి ఇంకా తాను కోలుకోలేనట్లు చెప్పారట. బంగ్లాదేశ్ సైన్యం.. హసీనా రాజీనామా చేసేందుకు 45 నిమిషాల టైం మాత్రమే ఇచ్చింది. ఇచ్చిన సమయం కంటే ముందుగానే ఆమె తన రాజీనామాను అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్‌కు అందించారు. అనంతరం హుటాహుటిన భారత్‌కు బయల్దేరారు.
హిండన్ ఎయిర్‌బేస్‌లో షాపింగ్..
బట్టలు కూడా తీసుకురాకపోవడంతో హసీనా తన సోదరి రిహన్నాతో కలిసి ఘజియాబాద్లోని హిండన్ ఎయిర్ బేస్ షాపింగ్ కాంప్లెక్స్‌కు వచ్చారు. వారిరువురు తమకు అవసరమైన దుస్తులు ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేశారు. ఒక్కరోజే ఆమె రూ.30 వేల షాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ నగదుని భారతీయ కరెన్సీలో చెల్లించారని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే వారు షాపింగ్ చేసిన విషయాన్ని అధికారులు నిర్ధారించలేదు. హసీనా ప్రస్తుతం హిండన్ ఎయిర్ బేస్‌లోని ఓ ఇంట్లో ఉంటున్నారు. ఆమెను త్వరలో మరో ప్రదేశానికి తరలించనున్నట్లు తెలుస్తోంది.