US Elections 2024: అమెరికా ఎన్నికలు మంగళవారమే ఎందుకు.. 179 ఏళ్ల కథ ఇదీ..
ABN , Publish Date - Nov 05 , 2024 | 12:21 PM
US Elections 2024: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు మంగళవారం (నవంబర్ 05, 2024) ఓటింగ్ జరగనుంది. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి అనేక దశల్లో ఓటింగ్ జరుగుతుంది. కానీ, అమెరికాలో మాత్రం ఒకే రోజు జరుగుతుంది. అవును, అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ఒక రోజు మాత్రమే ఓటింగ్ ఉంది.
US Elections 2024: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు మంగళవారం (నవంబర్ 05, 2024) ఓటింగ్ జరగనుంది. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి అనేక దశల్లో ఓటింగ్ జరుగుతుంది. కానీ, అమెరికాలో మాత్రం ఒకే రోజు జరుగుతుంది. అవును, అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ఒక రోజు మాత్రమే ఓటింగ్ ఉంది. అంతేకాదండోయ్.. ప్రతి నాలుగేళ్లకోసారి నవంబర్ మొదటి మంగళవారం నాడు ఓటింగ్ నిర్వహించాలనే నిబంధన ఉంది. అమెరికాలో 150 సంవత్సరాలకు పైగా నవంబర్ మొదటి మంగళవారం నాడు ఓటింగ్ నిర్వహించడం జరిగింది. కానీ ఈ సంప్రదాయం ఎప్పుడు.. ఎలా.. మొదలైందనే దాని గురించి ప్రజలకు తక్కువ సమాచారం ఉంది. మరి నవంబర్ మొదటి మంగళవారం నాడే అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఎందుకు నిర్వహిస్తారో ఈ కథనంలో తెలుసుకుందాం..
అమెరికా ఎన్నికల వ్యవస్థ.. చరిత్ర..
అమెరికా ఎన్నికల ప్రక్రియ భారతదేశం మాదిరిగా కేంద్రీకృతమై లేదు. ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ ప్రచార ఆర్థిక చట్టాలను పర్యవేక్షిస్తుంది. అయితే రాష్ట్ర, స్థానిక అధికారులు ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తారు. ప్రతి రాష్ట్రం ఓటరు అర్హత నుండి బ్యాలెట్ రూపకల్పన, ఓట్ల లెక్కింపు విధానాల వరకు దాని స్వంత ఎన్నికల నియమాలను రూపొందిస్తుంది. దీని కారణంగా.. దేశవ్యాప్తంగా ఓటింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియ విస్తృతంగా మారే అవకాశం ఉంటుంది. అయితే, అధ్యక్ష ఎన్నికల తేదీ మాత్రం దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది. అది నవంబర్ మొదటి మంగళవారం నాడే జరుగుతుంది.
19వ శతాబ్దం మధ్యకాలం వరకు.. డిసెంబరులో ఎలక్టోరల్ కాలేజీ సమావేశానికి ముందు ఓటింగ్ జరిగితే.. యునైటెడ్ స్టేట్స్‌లోని ప్రతి రాష్ట్రంలో వేర్వేరు రోజులలో ఓటింగ్ జరిగేది. 1844లో అధ్యక్ష ఎన్నికలు నవంబర్ ప్రారంభం నుండి డిసెంబర్ వరకు జరిగాయి. ఈ వ్యవస్థ అంత ప్రభావవంతంగా లేదని కొందరు అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. వేర్వేరు రోజులలో ఓటింగ్ ఉండటం వల్ల ఫలితాలు కూడా ప్రభావితం కావచ్చనే భయం కూడా ఏర్పడింది.
అన్ని సందేహాలను తొలగించడానికి, US కాంగ్రెస్ 1845లో ఒక చట్టాన్ని ఆమోదించింది. ఆ చట్టం ద్వారా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల తేదీని ఖరారు చేశారు. ఈ తేదీ.. నవంబర్ నెలలో మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం అని చట్టం పేర్కొంది. అయితే నవంబర్ మొదటి మంగళవారమే ఎందుకు ఎంచుకున్నారు? అంటే దీనికి కూడా ఓ కథ ఉంది.
అమెరికాలో నవంబర్ మొదటి మంగళవారం ఎందుకు ఓటింగ్ నిర్వహిస్తారు?
ఆ సమయంలో అమెరికా ఒక కొత్త దేశం. అది 100 సంవత్సరాలు కూడా ఉనికిలో లేదు. దేశ జనాభాలో ఎక్కువ మంది వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారు. అయితే, ఎన్నికలకు నవంబరు నెలను ఎంచుకున్నారు. ఈ సమయంలో రైతులు కాస్త ఫ్రీగా ఉంటారు. పైగా వచ్చేది చలికాలం. చాలా మంది రైతులు నగరాల్లోని పోలింగ్ కేంద్రాలకు రావాల్సి ఉంటుంది. చాలా మంది రైతులు నగరాల్లోని పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అంటే, వారు ఓటు వేయడానికి చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది. దానికి ఒక రోజు పడుతుంది. ఇవన్నీ బేరీజు వేసుకుని.. ఎన్నికల తేదీని నిర్ణయించేందుకు పలు మేధోమథనాలు జరిగాయి. ఆదివారం ఎంచుకుందామంటే.. క్రైస్తవులు ఆ రోజు చర్చికి వెళతారు. అందుకే ఆదివారాన్ని ఎంచుకోలేదు. బుధవారం అయితే మార్కెట్లు ఉంటాయి. ఆ రోజు రైతులు పంటలు, ఇతర వస్తువులను విక్రయించడంలో నిమగ్నమవుతారు.
ఆది, బుధవారాల్లో జనం రాకపోకలు సాగించే పరిస్థితి లేదు. దీతో సోమ, గురువారాల్లో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన కూడా విరమించుకున్నారు. మంగళవారం అన్ని విషయాల్లో అనుకూలమైన రోజు. అందుకే నవంబర్ మొదటి మంగళవారం ఓటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. అలా అప్పటి నుంచి నవంబర్ మొదటి మంగళవారం నాడు అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహిస్తారు.
Also Read:
ప్రైవేటు ఆస్తులపై ప్రభుత్వ హక్కులు అంశంపై సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు
గాంధీ అంటే గౌరవమే.. తప్పయింది క్షమించండి
కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలివే..
For More International News and Telugu News..