Share News

Delhi: ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన.. స్వాతిమాలివాల్‌కి చేదు అనుభవం

ABN , Publish Date - Jul 28 , 2024 | 01:58 PM

ఢిల్లీలో శనివారం కురిసిన భారీ వర్షానికి సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న భవనం బేస్‌మెంట్‌లోకి నీరు చేరి.. ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.

Delhi: ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన.. స్వాతిమాలివాల్‌కి చేదు అనుభవం

ఢిల్లీ: ఢిల్లీలో శనివారం కురిసిన భారీ వర్షానికి సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న భవనం బేస్‌మెంట్‌లోకి నీరు చేరి.. ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. విషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యురాలు స్వాతిమాలివాల్‌ ఘటనా స్థలానికి వెళ్లారు. విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించాలని భావించిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది . పలువురు విద్యార్థులు స్వాతిమాలివాల్‌ రాకపై మండిపడ్డారు.ఈ అంశానికి రాజకీయ రంగు పులుమొద్దని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని పట్టుబట్టారు. కాగా.. కొందరు విద్యార్థుల మద్దతుతో ఆమె అక్కడ బైఠాయించడంతో.. మిగతా విద్యార్థులు స్వాతిమాలివాల్‌ ‘గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. దాంతో అక్కడ గందరగోళం పరిస్థితి నెలకొంది.


ఘటన తర్వాత ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లో ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోకి అకస్మాత్తుగా వరద నీరు రావడంతో సివిల్స్ పరీక్షల కోసం శిక్షణ పొందుతున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.

ఏసీ గదుల్లో కూర్చిని పోస్ట్‌ చేయడం కాదు...

ఢిల్లీ ప్రభుత్వం ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించింది. 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది. మరోవైపు ఈ ఘటనపై విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మంత్రి అతిషి న్యాయవిచారణకు ఆదేశించడంపై నిరసనలో పాల్గొన్న ఓ విద్యార్థి మాట్లాడుతూ.. ఈ సంఘటనకు ఎవరూ బాధ్యత వహించరన్నారు. ప్రభుత్వం నుండి ఎవరైనా ఇక్కడికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులందరికీ బాధ్యత వహించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. ఏసీ గదుల్లోంచి పోస్ట్‌లు చేయడం లేదా లేఖలు రాయడం ద్వారా ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు.


మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ అధికారులకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీలో కోచింగ్ సెంటర్లకు సంబంధించిన 80 శాతం గ్రంథాలయాలు బేస్‌మెంట్‌లోనే ఉంటాయని.. వర్షం కురిసిన 10 నిమిషాలకే ఈ ప్రదేశం నీటితో నిండిపోతుందని.. దీనిపై ఎంసీడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు.

కేజ్రీ సర్కార్‌దే తప్పు: బీజేపీ

కోచింగ్ సెంటర్‌లో వరద నీరు చేరి విద్యార్థులు మృతి చెందిన ఘటనకు ఆప్ ప్రభుత్వం బాధ్యత వహించాలని బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ డిమాండ్ చేశారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చిన విద్యార్థుల జీవితాలను ఆప్ అంధకారం చేసిందన్నారు. విద్యార్థుల సంరక్షణను గాలికొదిలేసి.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిందన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలోని మురుగును శుభ్రం చేయాలని ఎమ్మెల్యే దుర్గేష్‌ పాఠక్‌కు ఎన్నోసార్లు విన్నవించినా ఉపయోగంలేదని ఎంపీ తెలిపారు. విద్యార్థుల మరణాలకు కేజ్రీవాల్ సర్కారే బాధ్యత వహించాలన్నారు.


వెంటనే రెస్క్యూ ఆపరేషన్..

నీట మునిగిన ఘటనపై సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది హుటాహుటిన వెళ్లి రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. 30 మంది విద్యార్థులను రక్షించారు. కానీ ముగ్గురు విద్యార్థులు మరణించారు. వారిలో ఇద్దరు యువతులు, ఓ యువకుడు ఉన్నారని అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం 7.15 గంటలకు సమాచారం వచ్చిందని, వెంటనే ఐదు ఫైర్‌ ఇంజిన్లతో ఘటనాస్థలానికి వెళ్లామని ఢిల్లీ అగ్నిమాపక అధికారి అతుల్‌ గార్గ్‌ తెలిపారు.

అప్పటికే సెల్లార్‌ మొత్తం నీటితో నిండి ఉందని, ఇద్దరు యువతులు, ఒక యువకుడి మృతదేహాలను వెలికి తీశామని వెల్లడించారు. ఘటనకు కారణమైన ఇద్దరిని అరెస్టు చేశామని సీనియర్‌ పోలీస్‌ అధికారి హర్షవర్ధన్‌ చెప్పారు. మృతులు నవీన్‌ డాల్విన్‌ (28) తానియా సోని (25), శ్రేయ యాదవ్‌ (25)గా గుర్తించామని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఢిల్లీ రెవెన్యూ శాఖ మంత్రి అతిశీ పేర్కొన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 01:59 PM