Share News

మరో 60 విమానాలకు బాంబు బెదిరింపు

ABN , Publish Date - Oct 29 , 2024 | 03:37 AM

దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం 60కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.

మరో 60 విమానాలకు బాంబు బెదిరింపు

న్యూఢిల్లీ, అక్టోబరు 28 : దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం 60కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. గత 15 రోజుల్లో 410 దేశీయ, అంతర్జాతీయ విమానాలకు ఉత్తుత్తి బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటిలో చాలావరకు సోషల్‌ మీడియా ద్వారానే వచ్చాయి. సోమవారం ఎయిర్‌ ఇండియా, ఇండిగో సంస్థలకు చెందిన చెరో 21 విమానాలకు, విస్తారాకు చెందిన 20 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తమ సంస్థకు చెందిన పలు విమానాలకు సోమవారం సోషల్‌ మీడియా ద్వారా బెదిరింపులు వచ్చినట్లు ఎయిర్‌ ఇండియా అధికార ప్రతినిధి చెప్పారు. నిబంధనల ప్రకారం సంబంధిత అధికారులను వెంటనే అప్రమత్తం చేసినట్లు చెప్పారు. అన్ని భద్రతా నియమాలను తుచ తప్పకుండా పాటించినట్లు వెల్లడించారు. ఇటువంటి ఉత్తుత్తి బెదిరింపులకు సంబంధించి నిబంధనల మేరకు వ్యవహరించాలని, వాటిని తొలగించాలని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కేంద్ర ఐటీ శాఖ కోరింది.

Updated Date - Oct 29 , 2024 | 03:37 AM