Arvind Kejriwal: సీఎం పదవికి ఎందుకు రాజీనామా చేయలేదో చెప్పిన కేజ్రీ
ABN , Publish Date - May 11 , 2024 | 02:54 PM
ఎక్సైజ్ పాలసీ కేసులో తనను అరెస్టు చేసినప్పటికీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోవడానికి కారణంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వివరణ ఇచ్చారు. బీజేపీ సారథ్యంలోని కేంద్రం అనుసరిస్తున్న నియంతృత్వం, నకిలీ కేసులో తనను జైలుకు పంపేందుకు జరిగిన కుట్రపై మడమతిప్పని పోరాటం చేస్తాననే సందేశం ఇచ్చేందుకే తాను రాజీనామా చేయలేదన్నారు.
న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ (Excise policy) కేసులో తనను అరెస్టు చేసినప్పటికీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోవడానికి కారణంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వివరణ ఇచ్చారు. బీజేపీ సారథ్యంలోని కేంద్రం అనుసరిస్తున్న నియంతృత్వం, నకిలీ కేసులో తనను జైలుకు పంపేందుకు జరిగిన కుట్రపై మడమతిప్పని పోరాటం చేస్తాననే సందేశం ఇచ్చేందుకే తాను రాజీనామా చేయలేదన్నారు. తనను కటకటాల వెనక్కి పంపి, ఢిల్లీలోని తన ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. రాబోయే 20 ఏళ్లలో 'ఆప్'ను ఏ పార్టీ కూడా ఓడించలేదని ధీమా వ్యక్తం చేశారు.
కేజ్రీవాల్ ఇంకేమన్నారంటే..?
''నేను జైలులో ఉన్నప్పుడు, కొందరు వ్యక్తులు కేజ్రీవాల్ ఎందుకు రాజీనామా చేయరంటూ ప్రశ్నించారు. కేజ్రీవాల్‌కు పదవీ వ్యామోహం లేదు. ఆదాయం పన్ను కమిషనర్ పోస్టును విడిచిపెట్టాను. ఢిల్లీ ప్రజల కోసం 10 ఏళ్ల పనిచేశాను. తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాను. 49 రోజుల్లో రాజీనామా చేశాను. ఇవాళ ఎందుకు రాజీనామా చేయడం లేదు? ఢిల్లీలో మమ్మల్ని ఓడించలేమని బీజేపీకి తెలుసు. ఢిల్లీలో వచ్చే 20 ఏళ్లలో ఏ పార్టీ కూడా ఆప్‌ను ఓడించలేదు. కేజ్రీవాల్ రాజీనామా చేస్తే ప్రభుత్వాన్ని పడగొట్టొచ్చనే కుట్ర జరిగింది. అందుకే రాజీనామా చేయరాదని నిర్ణయించుకున్నాను. ప్రజాస్వామ్యాన్ని కటకటాల వెనక్కి నెట్టేస్తే జైలు నుంచే మేము ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తాం. మీ వలలో మాత్రం చిక్కం'' అని బీజేపీని ఉద్దేశించి కేజ్రీవాల్ అన్నారు.
LokSabha Elections: మోదీ రిటైర్ అవుతున్నారు.. మీ ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరు..?
జూన్ 4 తర్వాత ఎన్డీయే తిరిగి రాదు..
ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదని, పలు చోట్ల సీట్లు కోల్పోతుందని కేజ్రీవాల్ చెప్పారు. మెజారిటీ మార్క్ వరకూ చేరదని, సుమారు 230 వారికి సీట్లు రావచ్చని జోస్యం చెప్పారు. జూన్ 4 తర్వాత ప్రభుత్వాన్ని ఎన్డీయే ఏర్పాటు చేయడం లేదని అన్నారు. హర్యానా, రాజస్థాన్, బీహార్, యూపీ, ఢిల్లీ, కర్ణాటక, పశ్చిమబెంగాల్, జార్ఖాండ్ సహా ప్రతి చోట వారి సీట్లు తగ్గుతాయని, వారికి 220 నుంచి 230 సీట్లు వస్తాయనే ఊహాగానాలు ఉన్నాయని చెప్పారు. కేంద్రంలో 'ఇండియా' కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, కూటమి భాగస్వామిగా ఉన్న తాము ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామని చెప్పారు. ఎల్జీ కూడా ఢిల్లీకి చెందిన వారే ఉంటారని, ప్రస్తుత ఎల్జీ గుజరాత్ నుంచి వచ్చారని తెలిపారు.
Read Latest National News And Telugu News