Share News

Delhi: జమిలికి సై

ABN , Publish Date - Dec 13 , 2024 | 05:16 AM

జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. లోక్‌సభకు, దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులకు గురువారం కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

Delhi: జమిలికి సై

  • లోక్‌సభ, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి పోలింగ్‌

  • రెండు సవరణ బిల్లులకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం

  • వచ్చేవారమే పార్లమెంటులో ప్రవేశపెట్టే చాన్స్‌.. వెంటనే జేపీసీకి వెళ్తుందంటున్న బీజేపీ వర్గాలు

  • 2 బిల్లులను పార్లమెంటు ఆమోదిస్తే చాలు.. తొలిబిల్లుకు ఉభయసభల్లో 2/3 మెజారిటీ అవసరం

  • స్థానిక సంస్థలను చేర్చే ఆలోచనకు విరామం

  • సగం రాష్ట్రాల ఆమోదం అవసరమవడం వల్లే..

  • బిల్లులను చూసి స్పందిస్తామన్న కాంగ్రెస్‌

  • జమిలి కన్నా పెద్ద సమస్యలున్నాయని వ్యాఖ్య

  • తీవ్రంగా వ్యతిరేకించిన డీఎంకే, తృణమూల్‌

మద్దతు ఇచ్చిన పార్టీలు: బీజేపీ, అన్నాడీఎంకే, అప్నాదళ్‌, బిజూజనతాదళ్‌, అసోం గణపరిషత్‌, శివసేన, జేడీయూ, అకాలీదళ్‌

వ్యతిరేకించిన పార్టీలు: కాంగ్రెస్‌, సీపీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎస్పీ, ఎంఐఎం, సీపీఐ, డీఎంకే, బీఎస్పీ, ఆప్‌

స్పందించనివి: టీడీపీ, వైసీపీ, బీఆర్‌ఎస్‌, ఎన్‌సీపీ, ఆర్జేడీ, ఆర్‌ఎల్‌డీ, జేడీఎస్‌, ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కేరళ కాంగ్రెస్‌

న్యూఢిల్లీ, డిసెంబరు12 (ఆంధ్రజ్యోతి): జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. లోక్‌సభకు, దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులకు గురువారం కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. వచ్చే వారం మొదటి రెండు రోజుల్లో పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. రెండు బిల్లుల్లో మొదటిది లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు కాగా, రెండోది శాసనసభలున్న కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కశ్మీర్‌లకు ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన సాధారణ బిల్లు. పార్లమెంటు ఉభయ సభల్లో కేవలం సాధారణ మెజారిటీ ఉన్న ఎన్డీయే ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లును నెగ్గించుకోవాలంటే తప్పనిసరిగా అద్భుతం చేయాలి. లేదా విపక్షాల సహకారాన్ని తీసుకోవాలి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం గురువారం నాటి క్యాబినెట్‌ సమావేశానికి సంబంధించి ఎలాంటి బ్రీఫింగ్‌ ఇవ్వలేదు. నోట్‌ కూడా విడుదల చేయలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేవలం ఉభయ సభల్లో బిల్లులను ప్రవేశపెట్టి, వెంటనే సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలనకు పంపుతారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.


జమిలి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపైనా స్పష్టతనివ్వలేదు. తదుపరి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా జమిలి ఎన్నికల రూపంలోనే జరుగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఒకే దేశం ఒకే ఎన్నికల దిశగా ఎంతోకొంత ముందుకు వెళ్లాలని కృత నిశ్చయంతో ఉన్న ప్రభుత్వం ఇందుకు జేపీసీ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికల విషయంలో మాత్రం కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకోలేదు. స్థానిక ఎన్నికలను తర్వాత దశలో పరిశీలిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. జమిలి కోసం మొత్తం ఆరు బిల్లులు పెట్టాల్సి ఉండగా ప్రస్తుతం రెండింటికే పరిమితం అవుతున్నారు. తర్వాత దశల్లో అవి కూడా వీటికి జత చేరతాయని అంటున్నారు. తొలి బిల్లులో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 83(పార్లమెంటు కాలపరిమితి), ఆర్టికల్‌ 172(అసెంబ్లీ కాలపరిమితి)లను సవరిస్తారు. ఇందుకు ఉభయ సభల్లో హాజరైన సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది సభ్యుల మద్దతు అవసరం. లోక్‌సభలో మూడింట రెండు వంతులు అంటే 361 మంది సభ్యుల మద్దతు కావాలి. ఎన్టీయే కూటమి బలం 293 మాత్రమే. వైసీ పీ, బీజేడీ, అన్నాడీఎంకే మద్దతు ఇచ్చినా 2/3 చేరుకోవడం అసాధ్యం. రాజ్యసభలోనూ 154 మంది ఎంపీల మద్దతు కావాలి. ఎన్డీయే బలం నామినేటెడ్‌ సభ్యులు కలుపుకొని 119 మాత్రమే. అంటే, ఉభయ సభల్లో బిల్లు నెగ్గడం అంత తేలికేమీ కాదని చెబుతున్నారు.


లోక్‌సభ, అసెంబ్లీ జమిలిపైనే దృష్టి

లోక్‌సభ, అసెంబ్లీలకు మాత్రమే జమిలి ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాల్సిన అవసరం ఉండదని కేంద్రం భావిస్తోంది. స్థానిక ఎన్నికలను వాటితోపాటు కలిపితే కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీల్లోనైనా అమోదం పొందాల్సి ఉంటుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించాలని మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్టు ఈ వర్గాలు తెలిపాయి. మూడు నెలల క్రితం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ సమర్పించిన నివేదికలో లోక్‌సభ, అసెంబ్లీలతో పాటు స్థానిక సంస్థలకూ ఒకేసారి ఎన్నికలు జరపాలని, దేశవ్యాప్తంగా ఒకే ఓటర్ల జాబి తా రూపొందించాలని సిఫారసు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా చేర్చాలంటే 324(ఎ) పేరుతో ఆర్టికల్‌ను చేర్చాలని చెప్పింది. దీనికి సగం రాష్ట్రాల శాసనసభల ఆమోదం అవసరం. దీన్ని ప్రస్తుతానికి పక్కనబెట్టారు. కోవింద్‌ కమిటీ మూడు రాజ్యాంగ అధికరణలకు, మూడు చట్టాలకు కలిపి మొత్తం 18 సవరణలు సూచించింది. ప్రభుత్వ పాల న సాఫీగా జరగడానికి జమిలి ఎన్నికలు అవసరమని తాము భావిస్తున్నట్టు బీజేపీ చీప్‌ విఫ్‌ సంజ య్‌ జైశ్వాల్‌ తెలిపారు. ప్రతి కొద్ది నెలలకు ఎన్నికలు జరగడం వల్ల ప్రభుత్వ సమర్థత తగ్గిపోతుందని, అధికారులు, రాజకీయ నాయకులు నిరంతరం ఎన్నిక ల ప్రక్రియలో తలమునకలై ఉంటారని, సంక్షేమ పథకాలు అమలు చేయడం సాధ్యం కాదని జైశ్వాల్‌ చెప్పారు.


జమిలిని ప్రవేశపెడితే ఐదేళ్ల పాటు పాలన సాఫీగా సాగుతుందని ఆయన ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 1971 వరకు జమిలి ఎన్నికలు నిరాటంకంగా జరిగాయ ని, తర్వాతే వాటికి అంతరాయం కలిగింద న్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడాన్ని 30కి పైగా పార్టీలు సమర్థిస్తున్నాయి. కాంగ్రెస్‌ సహా మరో 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ ప్రతిపాదన ఆచరణాత్మమైనది కాదని కాంగ్రెస్‌ అంటోంది. జమిలి ప్రజాస్వామ్య వ్యతిరేకమ ని, ప్రాంతీయ ఆకాంక్షలకు గొంతు లేకుండా పోతుందని, సమాఖ్య వ్యవస్థ దెబ్బతింటుందని తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. జమిలిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత మమతా బెనర్జీ కూడా జమిలిని వ్యతిరేకించారు. రాజ్యాంగ ఉల్లంఘన, సమాఖ్య వ్యతిరేకం అని వ్యా ఖ్యానించారు. జమిలి ఎన్నికలపై తమకు అనేక సందేహాలు ఉన్నాయని, బిల్లులు సభలోకి వచ్చాక స్పందిస్తామని లోక్‌సభలో కాంగ్రెస్‌ ఉపనేత గౌరవ్‌ గొగో య్‌ అన్నారు. ఎన్నికల ప్రక్రియలో జమిలికి మించిన తీవ్రమైన సమస్యలు ఉన్నాయన్నారు. నాలుగు రాష్ట్రా ల్లో ఒకేసారి ఎన్నికలు పెట్టలేని పరిస్థితి దేశంలో ఉందని, దేశమంతా పెడతానని చెబుతున్న మోదీకి ఎంతటి సాధనా సంపత్తి అవసరమో అంచనా ఉందా? అని వి.హనుమంతరావు ప్రశ్నించారు.


ఏడు దేశాల్లో పరిశీలన

కోవింద్‌ కమిటీ జమిలి ఎన్నికలకు అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి ముందు జమిలి ఎన్నికలను నిర్వహించే ఏడు దేశాలను సందర్శించింది. దక్షిణాఫ్రికా, జర్మనీ, స్వీడన్‌, జపాన్‌, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌, బెల్జియం దేశాల ఎన్నికల విధానాలను పరిశీలించింది. కోవింద్‌ కమిటీ నివేదిక ప్రకారం లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి. తర్వాత వంద రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి. గత సెప్టెంబరులో మోదీ ప్రభుత్వం కోవింద్‌ కమిటీ నివేదికను ఆమోదించింది. దక్షిణాఫ్రికాలో లోక్‌సభ, శాసనసభల ఎన్నికలు ఒకేసారి ఐదేళ్లకోసారి జరుగుతాయి. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. స్వీడన్‌లో ఓట్ల శాతాన్ని బట్టి దామాషా పద్దతిలో సీట్లు కేటాయిస్తారు. అక్కడ పార్లమెంటు నుంచి స్థానిక సంస్థల వరకు ఒకేసారి నాలుగేళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం విషయంలో జర్మనీ పద్ధతిని అనుసరించాలని కోవింద్‌ కమిటీ సభ్యుడు సుభాష్‌ సీ కష్యప్‌ సూచించారు.


నిర్మాణాత్మక అవిశ్వాసం పద్ధతిలో ప్రస్తుత ప్రధానిని తొలగించేందుకు పెట్టే తీర్మానంలోనే మరో ప్రధానిని సాధారణ మెజారిటీతో ఎన్నుకోవాలి. సభ రద్దయితే మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నికలు జరగాలి. లోక్‌సభ కాలపరిమితితో శాసనసభల కాలపరిమితి ముగిసిపోవాలి. అన్ని ఎన్నికలకూ ఒకే ఓటర్ల జాబితా ఉండాలి. అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ఒకర్ని పిలవడం కాకుండా పార్లమెంటే సభానాయకుడిని ఎన్నుకోవాలని, అతన్నే రాష్ట్రపతి ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలని కష్యప్‌ ప్రతిపాదించారు. ఇది జపాన్‌లో అనుసరిస్తున్న విధానం. 2019లో ఇండోనేసియా విజయవంతంగా ఒకేరోజు దేశవ్యాప్తంగా అన్ని సభలకు ఎన్నికలు జరిపి జమిలి వ్యవస్థలోకి ప్రవేశించింది. ఓటేసిన వారి చేతులను ఇంక్‌ బాటిల్‌లో ముంచడం, 4 శాతం ఓట్లు వచ్చిన పార్టీలకు పార్లమెంటులో ప్రవేశం కల్పించడం, 50 శాతం ఓట్లు దాటిన వారికే అధ్యక్షుడిగా అవకాశం కల్పించడం ఇందులో ప్రత్యేకతలు. 20 కోట్ల మంది ఇండోనేసియన్‌ పౌరులు ఒకేరోజు ఓటేశారు. ఇది ప్రపంచంలోనే ఒకేరోజు జరిగిన అతిపెద్ద పోలింగ్‌.

Updated Date - Dec 13 , 2024 | 05:16 AM