Delhi : నీతి ఆయోగ్ సమావేశం నుంచి మమత వాకౌట్
ABN , Publish Date - Jul 28 , 2024 | 03:19 AM
కేంద్ర బడ్జెట్లో పశ్చిమ బెంగాల్‌కు నిధుల కేటాయింపులో వివక్ష, రాష్ట్ర విభజన ప్రయత్నాలపై నిలదీస్తానంటూ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన ఆ రాష్ట్ర సీఎం మమత మధ్యలోనే వాకౌట్ చేశారు.
సమావేశం నుంచి మమత వాకౌట్
నిధులపై మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారని ఆరోపణ
భవిష్యత్తులో ఇంకెప్పుడూ హాజరు కాబోనంటూ ప్రకటన
న్యూఢిల్లీ, జూలై 27: కేంద్ర బడ్జెట్లో పశ్చిమ బెంగాల్‌కు నిధుల కేటాయింపులో వివక్ష, రాష్ట్ర విభజన ప్రయత్నాలపై నిలదీస్తానంటూ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన ఆ రాష్ట్ర సీఎం మమత మధ్యలోనే వాకౌట్ చేశారు. తాను మాట్లాడుతుండగా మధ్యలోనే మైక్ ఆపివేయడాన్ని నిరసిస్తూ బాయ్‌కాట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు 20 నిమిషాలు, గోవా, అసోం, ఛత్తీ్‌సగఢ్ సీఎంలకు 15 నిమిషాల వరకు కేటాయించారని.. తనకు మాత్రం 5నిమిషాలకే మైక్ బంద్ చేశారని మమత ఆక్షేపించారు.
బడ్జెట్లో తమ రాష్ట్రానికి నిధుల కేటాయింపు గురించి మాట్లాడడం మొదలుపెట్టగానే ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇది అవమానకరమని ఇంకెపుడూ నీతి ఆయోగ్ భేటీకి రానని ప్రకటించారు. ఆ వెంటనే కోల్‌కతాకు వెళ్లిపోయారు. ఇతర రాష్ట్రాలకు అధిక నిధులు ఇవ్వడంపై తనకు అభ్యంతరం లేదని.. బెంగాల్ పట్ల వివక్ష చూపడం మాత్రం సహించబోనని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల నుంచి నీతి ఆయోగ్‌కు హాజరైన ఏకైక సీఎం తానేనని, కనీసం 30 నిమిషాల సమయం ఇవ్వాల్సిందని అన్నారు.
కానీ, పదేపదే బెల్ నొక్కారని, ఇది అవమానించడం కాదా? అని ప్రశ్నించారు. కాగా, ఇకపై అయినా నీతి ఆయోగ్‌కు ఆర్థిక అధికారాలు కల్పించాలని లేదంటే ప్రణాళికా సంఘాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని కోరారు. మమత నిర్ణయాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ సమర్థించారు. కాగా, నీతి ఆయోగ్ సమావేశంలో 5 నిమిషాలే కేటాయించారన్న మమత ఆరోపణలను నిర్మలా సీతారామన్ ఖండించారు.
పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా మమత ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది. ఆమెకు కేటాయించిన సమయం అయిపోయినట్లు మాత్రమే గడియారం చూపిందని వివరించింది. నీతి ఆయోగ్ సీఈవో సుబ్రమణియన్ స్పందిస్తూ.. ప్రతి సీఎంకు 7 నిమిషాల సమయం ఇచ్చామని చెప్పారు. అక్షర క్రమంలో తొలుత ఏపీకి మాట్లాడే అవకాశం ఇచ్చామన్నారు. ఆ లెక్కన మమత ప్రసంగం భోజన విరామం తర్వాత ఉందని, ఆమె కోల్‌కతా వెళ్లాలని చెప్పడంతో ముందుకు జరిపామన్నారు.