Share News

flood disaster : మృత్యు విలయం

ABN , Publish Date - Jul 31 , 2024 | 05:50 AM

‘గాడ్స్‌ ఓన్‌ కంట్రీ’ కేరళ.. ప్రకృతి ప్రకోపానికి గురైంది..! పశ్చిమ కనుమల నడుమ.. తేనీటి తోటలు, ఏపుగా పెరిగే రబ్బరు చెట్లు, చూపరులను ఆకట్టుకునే కొబ్బరి చెట్లతో ఆహ్లాదంగా ఉండే వయనాడ్‌పై విపత్తు విరుచుకుపడింది..! తెరిపినివ్వకుండా కురుస్తున్న వర్షాలు.. బురదతో కూడిన వరద.. విరిగిపడ్డ కొండ చరియలు.. వెరసి సోమవారం అర్ధరాత్రి

flood disaster : మృత్యు విలయం

విరిగిపడిన కొండచరియలు.. వరద బీభత్సం..

వయనాడ్‌లో 133 మంది దుర్మరణం

65 కుటుంబాలు భూస్థాపితం!

వందలాది మందికి గాయాలు..

శిథిలాల కింద ఇంకా 250 మంది!

చలియార్‌ నదిలో

కొట్టుకొచ్చిన మృతదేహాలు

శవాల దిబ్బగా చురుల్‌మల?

టీ-ఎస్టేట్‌లో 600 మంది అసోం,

పశ్చిమ బెంగాల్‌ కార్మికుల గల్లంతు

ఓ రిసార్ట్‌లో చిక్కుకున్న 100 మంది

మదర్సా, మసీదుల్లో వైద్య శిబిరాలు

సహాయక చర్యల్లో త్రివిధ దళాలు,

ఎన్‌డీఆర్‌ఎఫ్‌

ఇంతటి విషాదాన్ని ఎన్నడూ

చూడలేదు: కేరళ సీఎం పినరయి

ప్రధాని మోదీ, రాహుల్‌ దిగ్ర్భాంతి

వయనాడ్‌, జూలై 30: ‘గాడ్స్‌ ఓన్‌ కంట్రీ’ కేరళ.. ప్రకృతి ప్రకోపానికి గురైంది..! పశ్చిమ కనుమల నడుమ.. తేనీటి తోటలు, ఏపుగా పెరిగే రబ్బరు చెట్లు, చూపరులను ఆకట్టుకునే కొబ్బరి చెట్లతో ఆహ్లాదంగా ఉండే వయనాడ్‌పై విపత్తు విరుచుకుపడింది..! తెరిపినివ్వకుండా కురుస్తున్న వర్షాలు.. బురదతో కూడిన వరద.. విరిగిపడ్డ కొండ చరియలు.. వెరసి సోమవారం అర్ధరాత్రి వయనాడ్‌కు కాళరాత్రిగా మారింది. పదుల సంఖ్యలో ఇళ్లు కొండ చరియల ధాటికి నేలమట్టమయ్యాయి. నిద్రలోనే 133 మంది పౌరుల ప్రాణాలు తిరిగి రాని అనంతలోకాలకు చేరుకున్నాయి. మరో 128 మంది క్షతగాత్రులయ్యారు. కొండ చరియల బీభత్సం ఒకవైపు.. వరదతో ఉప్పొంగిన నదులు మరోవైపు.. వరద ఉధృతికి శరీర భాగాలు తెగిపడి కిలోమీటర్ల దూరానికి కొట్టుకుపోతున్న మృతదేహాలు ఇంకోవైపు..! మృత్యుదేవత కరాళ నృత్యం చేస్తోందా? అన్నట్లు ఎక్కడ చూసినా మృతదేహాలు.. హాహాకారాలు.. ఆస్పత్రుల్లో బంధుమిత్రుల ఆర్తనాదాలు..! ఈ విపత్తులో వందల మంది గల్లంతయ్యారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదముందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. సహాయక చర్యల కోసం త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ, పారామిలటరీ, స్వచ్ఛంద సేవకులు రంగంలోకి దిగారు. ఈ విపత్తుపై రాజకీయ పార్టీలకు అతీతంగా యావత్‌ భారతం స్పందించింది. ప్రధాని నరేంద్ర మోదీ కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఫోన్‌ చేసి, ధైర్యం చెప్పారు. కేరళ సర్కారు రెండ్రోజులపాటు సంతాపదినాలను ప్రకటించింది. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(పీఎస్సీ) పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. వారం రోజులపాటు నాలుగు జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించింది. వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాలను, కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసింది. మరో వైపు భారత వాతావరణ శాఖ మరో రెండ్రోజులపాటు 8జిల్లాలకు రెడ్‌అలెర్ట్‌ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని హెచ్చరించింది.

అర్ధరాత్రి విరుచుకుపడ్డ కొండచరియలు

కేరళ వ్యాప్తంగా గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో వయనాడ్‌ ప్రాంతానికి.. ముఖ్యంగా చాలియార్‌ నదికి వరద ఉధృతి పెరిగింది. సోమవారం అర్ధరాత్రి సరిగ్గా 1.30 సమయంలో వరద బీభత్సానికి కొండ చరియలు విరిగిపడ్డాయి. ముండక్కై గ్రామాన్ని తుడిచిపెట్టేశాయి. ఆ గ్రామంలో 65 కుటుంబాలు నివసిస్తుండగా.. ఆ ఇళ్లలో నివసిస్తున్న వందల మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న ప్రభుత్వం వెంటనే పోలీసులను రంగంలోకి దింపింది. వర్షం, వరద, దట్టమైన పొగమంచు కారణంగా.. సహాయక బృందాలు ఆ ప్రాంతానికి చేరుకోవడంలో ఆటంకాలేర్పడ్డాయి. ‘‘మంగళవారం ఉదయం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎ్‌ఫతోపాటు.. త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. వైమానిక దళం హెలికాప్టర్లతో చిక్కుకుపోయిన వారిని గుర్తించి, రక్షించే ప్రయత్నం చేశాయి. కేరళలో స్థానిక యువకులతో ఏర్పాటు చేసిన ‘సివిల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌’ కూడా చురుగ్గా సహాయక చర్యల్లో పాల్గొంటోంది’’ అని కేరళ లోకల్‌ సెల్ఫ్‌ గవర్నమెంట్‌ శాఖ ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ వి.సాంబశివరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. వయనాడ్‌ ఘటన నేపథ్యంలో కేరళ సర్కారు తెలుగువాడైన సాంబశివరావును స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమించింది. కాగా.. నౌకాదళం గజ ఈతగాళ్లను రంగంలోకి దింపగా.. ఎన్‌డీఆర్‌ఎ్‌ఫతో పాటు ఆర్మీ, టెరిటోరియల్‌ ఆర్మీ జవాన్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం శిథిలాలను తొలగించడం ప్రారంభించాక.. నిమిష నిమిషానికి.. గంట గంటకూ మృతదేహాలు బయటపడ్డాయి. మంగళవారం రాత్రి కడపటి వార్తలందేసరికి 133 మంది మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. మరో 250 మంది వరకు శిథిలాల కిందే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు.. ముండక్కై గ్రామానికి ఆనుకుని ఉన్న చాలియార్‌ నదిలో 31 మృతదేహాలు కొట్టుకుని పోయాయి.


2Kerala2.jpg

సహాయక శిబిరంపైనా బండరాళ్లు

తొలుత తెల్లవారుజామున 3 గంటల సమయంలో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ముండక్కైలోని కొందరు స్థానికులను ఓ స్కూల్‌లో ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి తరలించారు. అయితే.. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ పాఠశాలపైనా కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ స్కూల్‌ పరిసరాల్లోని ఇళ్లు, దుకాణాలు సైతం బురదలో కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలేర్పడుతున్నాయని, మంగళవారం మధ్యాహ్నం మరోమారు కొండచరియలు విరిగిపడ్డాయని చెప్పారు. ముండక్కై, మెప్పాడిలో వరదలో కొట్టుకుపోయిన వారిని గుర్తించేందుకు వైమానిక దళానికి చెందిన డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఆర్మీ, పోలీసులు శిథిలాల కింద జాగిలాలతో గాలింపు చేపట్టారు.

తాత్కాలిక ఆస్పత్రులు..

విపత్తు వేళ క్షతగాత్రులకు వైద్యం అందించడానికి అధికారులు చూరాల్‌కొండలోని మదర్సాలు, మసీదుల్లో తాత్కాలిక క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. వయనాడ్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో కూడా తాత్కాలిక ఆస్పత్రి కొనసాగుతోందని అధికారులు చెప్పారు. వయనాడ్‌, కోళిక్కోడ్‌ ఫోరెన్సిక్‌ నిపుణులతో మెప్పాడి, నీలంబూర్‌లో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు వివరించారు. కడపటి వార్తలందేసరికి 104 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయినట్లు ప్రకటించారు.

రెడ్‌ అలెర్ట్‌

రానున్న రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ భారత వాతావరణ శాఖ(ఐఎండీ) కేరళలోని ఎనిమిది జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఈ జాబితాలో ఇడుక్కి నుంచి కాసర్గోడ్‌ మధ్యలో అన్ని జిల్లాలు ఉన్నాయి. శబరిమల ఉన్న పథనంతిట్ట, అలప్పుళ, కోటాయం, ఎర్నాకుళం జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌, తిరువనంతపురం, కొల్లాం జిల్లాలకు యెల్లో అలెర్ట్‌ ప్రకటించింది. ఈదురు గాలుల హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో పైకప్పులు బలంగా లేని ఇళ్లలో ఉండకూడదని పేర్కొన్నాయి. ప్రమాద బాధితుల కోసం కేరళ సర్కారు కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసింది. 1077, 1070 టోల్‌ఫ్రీ నంబర్లు, 9497900402, 0471-2721566 నంబర్లకు ఫోన్‌ ద్వారా సంప్రదించాలని అధికారులు కోరారు. రాత్రి కడపటి వార్తలందేసరికి త్రివిధ దళాలు, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు 481 మందిని కాపాడినట్లు వివరించారు.

ఎన్నడూ చూడని ఘోర విషాదం: పినరయి

కేరళలో ఎన్నడూ చూడనంతలా ఘోరమైన విషాదాన్ని వయనాడ్‌లో చూశామని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. ‘‘వయనాడ్‌ జిల్లాలో యుద్ధప్రాతిపదికన 45 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశాం. అక్కడ 3,096 మందికి వసతి కల్పించాం. కేంద్రాల్లో ఆహారం, 20 వేల లీటర్ల తాగునీటిని అందుబాటులో పెట్టాం’’ అని వెల్లడించారు. ‘‘ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులర్పిస్తున్నాను. ప్రధాని మోదీ, రాహుల్‌గాంధీ, అమిత్‌షా, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనందబోస్‌ నాకు ఫోన్‌ చేసి, సాయాన్ని ప్రకటించారు’’ అని వ్యాఖ్యానించారు. ప్రజలు కూడా సీఎం సహాయ నిధికి విరాళాలు ఇచ్చి, క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. కేరళకు చెందిన ఓ బ్యాంకు రూ.50 లక్షలు, తమిళనాడు సీఎం రూ.5 కోట్లు, సియాల్‌ రూ.2కోట్ల చొప్పున సాయం ప్రకటించాయన్నారు.

ప్రధాని మోదీ దిగ్ర్భాంతి

వయనాడ్‌ దుర్ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలకు అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఫోన్‌ చేసి, పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు వివరించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

కాంగ్రెస్‌ కార్యకర్తలకు రాహుల్‌ పిలుపు

విపక్ష నేత రాహుల్‌ గాంధీ కూడా ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన ఆయన.. క్షేత్రస్థాయిలో సహాయక చర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విజయన్‌తో, జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కేంద్ర మంత్రులతో మాట్లాడి.. వయనాడ్‌కు అన్ని విధాలా సాయమందేలా చర్యలు తీసుకుంటామన్నారు. వయనాడ్‌ ఘటనపై లోక్‌సభలో అత్యవసర తీర్మానానికి కాంగ్రెస్‌ ఎంపీ వేణుగోపాల్‌ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.


2wayanad-rescue1.jpg

600 మంది గల్లంతు!

వయనాడ్‌ ముండక్కై ప్రాంతంలో ఉన్న తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పనిచేసేందుకు వచ్చిన పశ్చిమబెంగాల్‌, అసోం కార్మికుల జాడ తెలియడం లేదని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడి హారిసన్‌ మలయాళీ ప్లాంటేషన్‌ లిమిటెడ్‌లో 600 మంది పశ్చిమబెంగాల్‌, అసోం కార్మికులు పనిచేస్తున్నారని, వారి యోగక్షేమాలు తెలియడం లేదని ఆ కంపెనీ జనరల్‌ మేనేజర్‌ బెనిల్‌ జోన్స్‌ అన్నారు. ఇదే ప్రాంతంలో ఉన్న ట్రీవ్యాలీ రిసార్ట్‌లో సుమారు 100 మంది చిక్కుకుపోయారు.

శవాల దిబ్బగా చురుల్‌మల?

ముండక్కైలో కొండచరియలు బీభత్సం సృష్టించగా.. ఉప్పొంగుతున్న చాలియర్‌ నది ఒకవైపు.. వరద మూడువైపులా కలిపి.. చురుల్‌మల గ్రామాన్ని నీళ్లు చుట్టేశాయి. త్రివిధ దళాలు మంగళవారం సాయంత్రానికి గానీ అక్కడకు చేరుకోలేకపోయాయి. ఉదయం నుంచే హెలికాప్టర్లు, డ్రోన్లతో గాలింపు చేపట్టినా.. చురుల్‌మల ప్రాంతంలో దట్టమైన పొగమంచు కారణంగా సహాయక చర్యలు సాధ్యపడలేదు. నౌకాదళానికి చెందిన రివర్‌ క్రాసింగ్‌ టీమ్‌ రంగంలోకి దిగి.. మంగళవారం సాయంత్రం అక్కడకు చేరుకుంది. అధికారిక వర్గాల ప్రకారం చురుల్‌మలలో ఎక్కడ చూసినా మృతదేహాలే కనిపించాయని తెలిసింది.

సాయానికి క్యూ

వరద బాధితులకు అవసరమైన రక్తం ఇచ్చేందుకు.. దాతలు బ్లడ్‌ బ్యాంకుల వద్ద బారులు తీరారు. మెప్పాడి విమ్స్‌ వైద్య కళాశాల, బతేరీ తాలూకా ఆస్పత్రి, కాల్‌పేట ప్రభుత్వ ఆస్పత్రి.. అన్ని చోట్లా ఇవే దృశ్యాలు కనిపించాయి. రక్తదానం ఒక్కటే కాదు.. ఆహారం, తాగునీరు, దుస్తులు అందించడం ద్వారా ఈ సంక్షోభ సమయంలో బాధితులకు కేరళ ప్రజలు అన్నివిధాలా అండగా నిలుస్తున్నారు.

Updated Date - Jul 31 , 2024 | 07:09 AM