విజయ్... తీరం చేరేనా!?
ABN , Publish Date - Nov 11 , 2024 | 05:46 AM
సినిమాల్లో కథానాయకుడు... రాజకీయాల్లో నాయకుడు కావాలనే ఆశ, లక్ష్యం! ఎప్పటికప్పుడు రాజకీయ రంగ ప్రవేశానికి ఒక అడుగు ముందుకు వేస్తూనే... ‘ఇప్పుడు కాదు’ అంటూ రెండు అడుగులు వెనక్కి వేసిన నేపథ్యం! ఇప్పుడు... ఎట్టకేలకు ఈ కథానాయకుడు రాజకీయ నాయకుడిగా అవతరించాడు.
తమిళనాట నటుడు విజయ్ కొత్త పార్టీ
అభిమానులే ఆలంబనగా రాజకీయ ప్రస్థానం
రాజకీయ నేతల్లేకుండానే పార్టీ ఏర్పాటు
కరుణ, జయ లేని లోటు పూడ్చాలనే లక్ష్యం
డీఎంకే, బీజేపీపై బహిరంగంగా వ్యతిరేకత
టీవీకే ప్రస్థానంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం
‘ఐదు రూపాయల డాక్టర్’గా ప్రభుత్వ వైద్య వ్యవస్థలోని లోపాలపై విరుచుకుపడి... ‘అదిరింది’ అనిపించిన విజయ్!
ఓటు విలువ తెలియచేస్తూ... బడా రాజకీయ నాయకులనే ఢీకొట్టిన ‘సర్కార్’ నాయకుడు!
పార్టీలు, ప్రభుత్వాలు, పథకాలపై అనేక పంచ్ డైలాగులతో అభిమానులకు ఎప్పటి నుంచో ‘పొలిటికల్’ సంకేతాలు!
ఎట్టకేలకు, ఇప్పుడు రాజకీయ పార్టీ స్థాపన! పేరులో... విజయ్! పార్టీ పేరులోనూ విజయం (వెట్రి)! మరి... తమిళనాడు రాజకీయాల్లో విజయ్‌ని ఆ విజయం వరిస్తుందా? ఆయన చేరే తీరం ఏది?
(చెన్నై - ఆంధ్రజ్యోతి)
సినిమాల్లో కథానాయకుడు... రాజకీయాల్లో నాయకుడు కావాలనే ఆశ, లక్ష్యం! ఎప్పటికప్పుడు రాజకీయ రంగ ప్రవేశానికి ఒక అడుగు ముందుకు వేస్తూనే... ‘ఇప్పుడు కాదు’ అంటూ రెండు అడుగులు వెనక్కి వేసిన నేపథ్యం! ఇప్పుడు... ఎట్టకేలకు ఈ కథానాయకుడు రాజకీయ నాయకుడిగా అవతరించాడు. ఆయనే... విజయ్! తమిళ నటుడే అయినప్పటికీ... తెలుగు సినీ ప్రేక్షకులకూ సుపరిచితుడు! మరో ఏడాదిన్నరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో ‘ఇదే సరైన సమయం’ అంటూ విజయ్ తన పార్టీ ప్రకటించేశారు. ఆయన తీరేమిటి? భవిష్యత్తు ఎలా ఉండొచ్చు? ఇప్పటికే ఉన్న డీఎంకే, అన్నా డీఎంకేలలో విజయ్ వల్ల ఎవరికి నష్టం? ఎంత నష్టం? సినీ నటుడిగా ఉన్న జనాకర్షణ రాజకీయాల్లోనూ పనికొస్తుందా? ఆయన ఏర్పాటు చేసిన ‘తమిళగ వెట్రి కళగం’ (తమిళుల విజయం పార్టీ) విజయ తీరాలకు చేరుతుందా? దీనిపై తమిళనాట భారీ చర్చ జరుగుతోంది. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వారికీ సుపరిచితుడైన విజయ్ పార్టీపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి నెలకొంది.
నేతల్లేకుండానే టీవీకే ఆవిర్భావం..
పార్టీ కొత్తదే కావొచ్చు! కానీ... అప్పటికే రాజకీయాల్లో ఉన్న ప్రముఖులెవరో ఒకరు అందులో చేరడం ఇప్పటిదాకా చూశాం. కానీ... విజయ్ పార్టీలో అలాంటి రాజకీయ నాయకులెవరూ కనిపించలేదు. ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పేరుతో ఎలాంటి హంగూ ఆర్భాటాల్లేకుండా పార్టీని ప్రారంభించి... తొలి మహానాడును ప్రత్యర్థులు సైతం అచ్చెరువొందేలా 5లక్షలమందితో నిర్వహించారు. నిజానికి పార్టీ ప్రారంభానికి కేవలం అభిమానులతో సన్నాహాలు చేసుకున్న విజయ్.. రాజకీయ నేతలెవ్వరినీ దరిచేరనీయలేదు. ఆయన ఐదుగురు ఐపీఎస్‌లు, ముగ్గురు ఐఏఎస్‌ల సలహాలు, సూచనలతోనే పార్టీని నడుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ ఐపీఎస్‌లలో ఇద్దరు ఇప్పటికీ సర్వీసులో ఉన్నారు. వారు కూడా త్వరలో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని విజయ్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దాంతో టీవీకేలో రాజకీయ పార్టీ లక్షణాలే కనిపించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో 2026 మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ లోపు పార్టీని నిర్మించడం విజయ్ ముందున్న పెద్ద సవాల్.
పంచ్ డైలాగులతో...
విజయ్ పంచ్ డైలాగులకు థియేటర్లు దద్దరిల్లుతాయి. కానీ... కొందరు రాజకీయ నాయకులకు మాత్రం అవంటే గిట్టదు. ఆ డైలాగులు తమ గురించి, తమ పార్టీ గురించే చెబుతున్నారని వారి ఉద్దేశం. ఆదిలోనే విజయ్ డీఎంకేతో వైరం తెచ్చుకున్నారు. పలుమార్లు తన సినిమాల విడుదల, థియేటర్ల కాంట్రాక్టు వంటి విషయాల్లో తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో... 2011లో విజయ్ అభిమాన సంఘం జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకేకు మద్దతు పలికింది. జయ విజయం కోసం విజయ్ పరోక్షంగా పని చేశారు. తదనంతరం... జయ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఉచిత మిక్సీలు, గ్రైండర్ల వంటి వాటిని విమర్శిస్తూ విజయ్ సినిమాలో పంచ్ డైలాగులు పేల్చారు. దీంతో... ఆమె సర్కారు సైతం విజయ్ పట్ల కాస్త కఠినంగా వ్యవహరించింది. కొన్నాళ్లు విజయ్ చిత్రాల ప్రదర్శనకు థియేటర్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. రాజకీయ నేతల ‘పవర్’ ఏమిటో విజయ్‌కి తెలిసొచ్చింది. ఈ నేపథ్యంలో ‘పొలిటికల్ పవర్’ సాధించాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతారు.
ఎవరీ విజయ్?
విజయ్ పూర్తి పేరు... జోసఫ్ విజయ్ చంద్రశేఖర్. ఆయన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ సినీ దర్శకుడు. తల్లి శోభ ఒకప్పటి గాయని, సంగీత విద్వాంసురాలు. శోభ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, చంద్రశేఖర్‌ది ‘వేళాలర్’ (క్రిస్టియన్) వర్గం. 1974 జూన్ 22న జన్మించిన విజయ్‌కి ఆది నుంచీ సినిమాలపై ఆసక్తి. రాజకీయాలపై ప్రత్యేక ఆసక్తి! అందులో భాగంగా ఆయన 2009లో ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ పేరుతో అభిమానుల సంఘాన్ని ప్రారంభించి, దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే... కరుణానిధి, జయలలిత వంటి హేమాహేమీలు రాజకీయాల్లో ఉండడం, రజనీకాంత్ వంటి వారూ రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శిస్తుండటంతో విజయ్ తగిన సమయం కోసం వేచిచూశారు. ఇప్పుడు కరుణానిధి, జయలలిత లేరు! రజనీ రాజకీయాల్లోకి రాలేదు. దీంతో... తమిళ రాజకీయాల్లో తనకు ‘చోటు’ ఉందనే అంచనాకు వచ్చారు. కొత్త పార్టీని ప్రకటించేశారు.
బలాలు.. బలహీనతలు!
విజయ్ అభిమానుల్లో అత్యధికులు యువతే. 18-35 సంవత్సరాల మధ్య వయస్కుల్లో అధికశాతం ఓట్లను తాము ఆకర్షించగలమని టీవీకే వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఇందులో ఓటు హక్కు కలిగివున్న వారెందరు? ఓటు వేసే వారెందరు? అని ప్రశ్నిస్తే సమాధానం కోసం తడుముకోవాల్సిన పరిస్థితి. విజయ్ ఎక్కడికెళ్లినా సందడి చేసే యువత.. రాజకీయంగాను అండగా నిలుస్తుందా అన్నది చూడాలి. అందుకే విజయ్ మిగిలిన వర్గాలను ఆకట్టుకోవడం తక్షణావసరమని పలువురు సీనియర్లు సూచిస్తున్నారు. సినీ నటుడుగా విజయ్‌కి మహిళా అభిమానులు ఎక్కువ. విజయ్ క్రైస్తవుడైనప్పటికీ, హిందూ మతాచారాలు పాటిస్తారని ఆయన గురించి బాగా తెలిసిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఆయనకు నమ్మకాలు కూడా ఎక్కువే. జనాలతో సరిగ్గా మమేకమవకపోవడం ఆయనకు పెద్ద మైనస్. దీనికి తోడు ముక్కుమీద కోపం! డబ్బును ఆచితూచి ఖర్చు చేస్తారనే పేరూ ఉంది.
అన్నా డీఎంకేతో పొత్తుకు చాన్స్!
విజయ్ ఈ ఎన్నికల్లో అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ మహానాడులో ఆయన డీఎంకే, బీజేపీపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. అన్నా డీఎంకేపై ఇప్పటిదాకా ఎలాంటి విమర్శలు చేయలేదు. ఈ పరిణామాలను గమనిస్తే... రెండు పార్టీలు భవిష్యత్తులో కలిసికట్టుగా సాగే అవకాశముందని చెప్పవచ్చు. పోలింగ్‌బూత్ వరకు ఓటర్లను తీసుకురాగలిగిన క్యాడర్ ఇంకా సమకూరకపోవడం, ఆర్థికంగానూ తన శక్తిసామర్థ్యాలు సరిపోవని భావించిన విజయ్.. అన్నా డీఎంకేతో పొత్తుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అధికార డీఎంకే కూటమిని ఢీకొట్టడానికి ప్రస్తుతం అన్నా డీఎంకే నానా తంటాలు పడుతోంది. విజయ్‌తో పొత్తు తమకు కలిసొస్తుందని అన్నా డీఎంకే అధినేత పళనిస్వామి గట్టిగా తలపోస్తున్నారు. అందుకే విజయ్‌పైన గానీ, ఆయన పార్టీపైనగానీ విమర్శలు చేయరాదని పళనిస్వామి తన అనుచరులకు సంకేతాలు పంపారు. అంతేగాక... ఇటీవల జరిగిన టీవీకే మహానాడుకు అన్నా డీఎంకే పరోక్షంగా సహకరించినట్లు తెలుస్తోంది.
ఎవరు తన వైపు?
తమిళనాట డీఎంకే-అన్నాడీఎంకేలకు పటిష్ఠమైన క్యాడర్ ఉంది. పార్టీ చిహ్నం చూసి ఓటేసే ప్రజలు అధికంగానే ఉన్నారు. ఈ రెండు పార్టీలకు కలిపి 60 శాతానికి పైగా ఓటు బ్యాంకు ఉంటుంది. మిగిలిన 40ు ఓట్లను ఇతర పార్టీలతోపాటు విజయ్ పంచుకోవాలి. లేదా... రెండు ప్రధాన పార్టీల ఓట్లకు గండి కొట్టాలి! దీనికోసం ఆయన చాలా శ్రమించాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే క్రిస్టియన్ మైనారిటీ ఓట్లను టీవీకే చీల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ తండ్రి సామాజికవర్గమైన వేళాలర్ ఓట్లు తమిళనాడులో 1-2ు ఉన్నాయి. ఈ ఓట్లలో అధికభాగం టీవీకేకే పడే అవకాశముంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే..విజయ్ ఒంటరిగా పోరాడితే 7-8 ు ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.