Rajnath Singh: ఉగ్రవాదులు పాక్ పారిపోయినా విడిచిపెట్టం: రాజ్‌నాథ్ హెచ్చరిక
ABN , Publish Date - Apr 06 , 2024 | 04:04 PM
దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి సరిహద్దుల మీదుగా పారిపోయేందుకు ప్రయత్నించే ఏ ఒక్కరినీ విడిచిపెట్టమని, వారిని పాక్‌గడ్డపైకి అడుగుపెట్టయినా సరే మట్టుబెడతామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారంనాడు గట్టి హెచ్చరిక చేశారు.
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి సరిహద్దుల మీదుగా పారిపోయేందుకు ప్రయత్నించే ఏ ఒక్కరినీ విడిచిపెట్టమని, వారిని పాక్‌గడ్డపైకి అడుగుపెట్టయినా సరే మట్టుబెడతామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) శుక్రవారంనాడు గట్టి హెచ్చరిక చేశారు. 2020 నుంచి విదేశీ గడ్డపై ఉన్న ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించిన సరిహద్దు వ్యూహంలో భాగంగా పాకిస్థాన్‌లోని 20 మందిని భారత ప్రభుత్వం మట్టుబెట్టిందంటూ ''గార్డియన్'' పత్రిక ఒక కథనం రాసిన నేపథ్యంలో రాజ్‌నాథ్ స్పందించారు. దేశ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఉగ్రవాదులను ప్రభుత్వం విడిచిపెట్టేది లేదన్నారు.
''వాళ్లు పాకిస్థాన్ పారిపోతే, వారిని మట్టుబెట్టేందుకు మేము పాక్‌లోకి అడుగుపెడతాం'' అని మీడియా అడిగిన ఒక ప్రశ్నకు రాజ్‌నాథ్ సమాధానమిచ్చారు. ఇరుగుపొరుగు దేశాలతో మైత్రీ సంబంధాలను భారత్ ఎప్పుడూ కోరుకుంటుందని, అయితే భారతదేశం ఆగ్రహం పదేపదే చూడాలని ఎవరైనా కోరుకుని ఇండియాకు వచ్చి, ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తే మాత్రం సహించేది లేదు'' అని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.
Narendra Modi: 'ఫ్లాప్ చిత్రం' రిపీట్.. రాహుల్, అఖిలేష్ జోడీపై మోదీ వ్యంగ్యోక్తులు
లక్షిత హత్యలపై భారత్ ఖండన
2019 పుల్వామా ఘటన తర్వాత దేశానికి ప్రమాదంగా మారుతున్న వ్యక్తులను న్యూఢిల్లీ లక్ష్యంగా చేసుకుందంటూ బ్రిటన్‌కు చెందిన 'గార్డియన్' పత్రిన ఇటీవల భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. భారత విదేశీ ఇంటెలిజెన్స్ సంస్థ 'రా' సుమారు 20 లక్షిత హత్యలు చేసి ఉంటుందని ఆరోపించింది. ఈ ఆరోపణలను భారత విదేశాంగ శాఖ వెంటనే ఖండించింది. ఇది పూర్తిగా తప్పుడు సమాచారమని, భారత వ్యతిరేక ప్రచారమని పేర్కొంది. విదేశీ గడ్డపై లక్షిత హత్యలు భారత్ విధానం కాదని స్పష్టం చేసింది.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.