Share News

Jharkhand Floor Test: జార్ఖండ్ అసెంబ్లీలో బలబలాలివే..?

ABN , Publish Date - Feb 05 , 2024 | 09:22 AM

జార్ఖండ్ అసెంబ్లీలో ఈ రోజు బలపరీక్ష జరగనుంది. మనీ ల్యాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో జేఎంఎం సీనియర్ నేత చంపయి సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు సభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోబోతున్నారు.

Jharkhand Floor Test: జార్ఖండ్ అసెంబ్లీలో బలబలాలివే..?

రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీలో ఈ రోజు బలపరీక్ష జరగనుంది. మనీ ల్యాండరింగ్ కేసులో జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో జేఎంఎం సీనియర్ నేత చంపయి సోరెన్ (Champai Soren) జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు సభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోబోతున్నారు. జార్ఖండ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో సభలో తన మెజార్టీని చంపయ్ సోరెన్ నిరూపించుకోవాల్సి ఉంది. అసెంబ్లీలో అధికార, విపక్షాల బలబలాలు ఇలా ఉన్నాయి.

జార్ఖండ్ అసెంబ్లీలో 81 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 41. జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, రాష్ట్రీయ్ జనతా దళ్‌తో కలిపి 47 మంది సభ్యుల మద్దతు చంపయ్ సోరెన్‌కు ఉంది. చంపయ్ సోరెన్ ప్రభుత్వం మెజార్టీ మార్క్‌కు ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను విపక్ష బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుందని హైదరాబాద్ తరలించిన సంగతి తెలిసిందే. బలపరీక్ష నేపథ్యంలో సోమవారం ఉదయం 37 మంది ఎమ్మెల్యేలు రాంచీకి చేరుకున్నారు.

ప్రతిపక్ష బీజేపీకి జార్ఖండ్ అసెంబ్లీలో 25 మంది సభ్యులు ఉన్నారు. జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ పార్టీకి ముగ్గురు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ (ఎంఎల్, ఎల్) పార్టీలకు చెరో ఒక్క సభ్యులు ఉన్నారు. ముగ్గురు స్వతంత్ర్య అభ్యర్థులు ఉన్నారు. వీరంతా కలిపితే 33 మంది సభ్యులు అవుతారు. మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టైన మాజీ సీఎం హేమంత్ సోరెన్ విశ్వాస పరీక్షలో ఓటు వేసేందుకు పీఎంఎల్ఏ కోర్టు అనుమతి ఇచ్చింది. అసెంబ్లీలో సభ్యుడిగా ఓటు వేసే హక్కు ఆయనకు ఉందని స్పష్టంచేసింది. దీంతో హేమంత్ సోరెన్ ఈ రోజు ఓటింగ్‌లో పాల్గొంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 05 , 2024 | 09:23 AM