PM Modi: హుందాగా, అణకువగా ఉండండి
ABN , Publish Date - Jun 10 , 2024 | 04:25 AM
మంత్రులంతా ప్రజలకు నచ్చేలా అణకువగా, హుందాగా ఉండాలని, విధి నిర్వహణలో అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని కేంద్ర నూతన మంత్రి వర్గానికి ప్రధాని మోదీ సూచించారు. వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరేందుకు మంత్రి వర్గమంతా కృషి చేయాలని స్పష్టం చేశారు.
పార్టీలకతీతంగా తోటి సభ్యులను గౌరవించండి
అణకువగా ఉండండి తోటి సభ్యులను గౌరవించండి
కొత్త క్యాబినెట్‌కు మోదీ సూచన
కేంద్ర క్యాబినెట్ తొలి సమావేశం నేడు!
నూతన కేబినెట్‌కు ప్రధాని మోదీ సూచనలు
న్యూఢిల్లీ, జూన్ 9: మంత్రులంతా ప్రజలకు నచ్చేలా అణకువగా, హుందాగా ఉండాలని, విధి నిర్వహణలో అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని కేంద్ర నూతన మంత్రి వర్గానికి ప్రధాని మోదీ సూచించారు. వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరేందుకు మంత్రి వర్గమంతా కృషి చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న సభ్యులకు భారత ప్రధానిగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేసే ముందు నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం సాయంత్రం తేనేటి విందు ఇచ్చారు. 2014లో తొలిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మోదీ ఈ తేనేటి విందు సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. పార్టీలకతీతంగా పార్లమెంట్ సభ్యులు అందరికీ మంత్రులు సముచిత గౌరవం ఇవ్వాలని మోదీ ఈ సందర్భంగా ఎంపీలకు స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా వంద రోజుల కార్యాచరణ సిద్ధం చేసుకుని దానికి అనుగుణంగా పని చేసేందుకు మంత్రులంతా సిద్ధం కావాలని కోరారు. మరోవైపు, వరుసగా మూడో సారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టేముందు మహాత్మాగాంధీ. బీజేపీ నేత అటల్ బిహరీ వాజపేయికి మోదీ ఆదివారం నివాళులర్పించారు. ఆ తర్వాత ఇండియా గేట్ వద్ద జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించి నివాళులర్పించారు.
తరలివచ్చిన పారిశ్రామిక వేత్తలు, సినీ ప్రముఖులు
మోదీ ప్రమాణ స్వీకరాత్సోవానికి పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు తరలివచ్చారు. పారిశ్రామిక వేత్తలు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ, సినీ నటులు రజనీకాంత్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, రవీనా టాండన్, బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నేత షీలా రషీద్ కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ట్రాన్స్‌జెండర్ వర్గానికి చెందిన పలువురు ప్రముఖులు, పారిశుధ్య కార్మికులు, కొత్త పార్లమెంటు భవన నిర్మాణ కార్మికులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవానికి ట్రాన్స్‌జెండర్లు హాజరు కావడం ఇదే తొలిసారి.
సహాయ మంత్రి పదవి మాకొద్దు
మంత్రివర్గ కూర్పులో భాగంగా బీజేపీ నాయకత్వం తమకు కేటాయించిన కేంద్ర సహాయ మంత్రి(ఇండిపెండెంట్ చార్జ్) పదవిని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(అజిత్‌పవార్) తిరస్కరించింది. గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన తనకు సహాయ మంత్రి ఇవ్వడం పట్ల ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది తన స్థాయిని తగ్గించడమేనని ఎన్సీపీ అధిష్ఠానానికి స్పష్టం చేశారు.