వితంతు కోడలికి మామ భరణం ఇవ్వక్కర్లేదు
ABN , Publish Date - Nov 12 , 2024 | 04:44 AM
వితంతువైన కోడలికి ఆమె మామ ఎలాంటి భరణం చెల్లించాల్సిన పనిలేదని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది.
భోపాల్, నవంబరు 11: వితంతువైన కోడలికి ఆమె మామ ఎలాంటి భరణం చెల్లించాల్సిన పనిలేదని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు మహమ్మదీయ చట్టం అంగీకరించదని తెలిపింది. భర్త చనిపోవడంతో తన పోషణ నిమిత్తం నెలకు రూ.40వేల భరణం ఇచ్చేలా మామను ఆదేశించాలని కోరుతూ ఓ ముస్లిం మహిళ కోర్టును ఆశ్రయించారు. ఇందుకు గృహ హింస చట్టాన్ని ఆసరాగా తీసుకున్నారు. ఆ చట్టంలోని 18 నుంచి 22 వరకు ఉన్న సెక్షన్లను ప్రస్తావిస్తూ అత్తవారింట్లో నివసించే హక్కు తనకు ఉందని, అందువల్ల భర్త తండ్రే ఆదుకోవాల్సి ఉందని కోరారు. విచారణ జరిపిన ట్రయల్ కోర్టు నెలకు రూ.3,000 చెల్లించాలని ఆదేశించింది. దీనిని సవాలు చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా న్యాయమూర్తి జస్టిస్ హృదేశ్ రాయ్ విచారణ జరిపారు. తన కుమారుడు జీవించి ఉన్నప్పుడు ఆమె ఎప్పుడూ తమ ఇంట్లో కలిసి ఉండలేదని, వారిద్దరు వేరేగా జీవించే వారని పిటిషనర్ వాదించారు. అందువల్ల ఆమెకు భరణం చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు.