PM Modi: ఆలోచనల్లో కాంగ్రెస్ అవుట్‌డేటెడ్ అయింది, అందుకే అవుట్ సోర్సింగ్ ఇస్తోంది
ABN , Publish Date - Feb 07 , 2024 | 03:03 PM
కాంగ్రెస్ పార్టీపై మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఆలోచనల్లో కాంగ్రెస్ పార్టీ అవుట్‌డేటెడ్ అయిందని, అందుకే అవుట్ సోర్సింగ్ ఇస్తోందని అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావని పశ్చిమబెంగాల్‌లోని ఒక పార్టీ సవాలు చేసిందని గుర్తుచేశారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి విమర్శలు గుప్పించారు. ఆలోచనల్లో కాంగ్రెస్ పార్టీ అవుట్‌డేటెడ్ (Outdated) అయిందని, అందుకే అవుట్ సోర్సింగ్ (outsourced) ఇస్తోందని అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావని పశ్చిమబెంగాల్‌లోని ఒక పార్టీ సవాలు చేసిందని గుర్తుచేశారు. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపైం ధన్యవాద తీర్మానంపై చర్చకు రాజ్యసభ (Rajya Sabha) లో ప్రధాని బుధవారంనాడు సమాధానమిస్తూ, గతంలో జరిగిన సంఘటనలు కూడా తనకు గుర్తున్నాయని, రాజ్యసభలో మాట్లాడాలనుకున్నప్పుడు తన ప్రసంగాన్ని అడ్డుకున్నారని, అయినప్పటికీ తాను ప్రసంగాన్ని కొనసాగించానని అన్నారు. ఇవాళ కూడా తన మాటలు వినేందుకు వారు సిద్ధంగా లేరనే విషయం తనకు తెలుసునని అన్నారు. అయితే తన గొంతును ఎవరూ అణిచివేయలేరని, ఈ గొంతుకు ప్రజలే బలం ఇచ్చారని, ఈసారి కూడా తాను సన్నద్ధంగానే వచ్చానని చెప్పారు.
ఖర్గేను అక్కడ మిస్సయ్యాను..
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు తాను ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేనని మోదీ అన్నారు. లోక్‌సభలో ఆయనను మిస్ అయ్యామని, అయితే రాజ్యసభలో ఆయనను చూసి ఆనందం కలిగిందని అన్నారు. లోక్‌సభలో మిస్ అయిన ఎంటర్‌టైన్‌మెంట్ తిరిగి పొందానని అన్నారు. ఆయనే స్వయంగా బీజేపీకి 400కి పైగా సీట్లు వస్తాయని ఆశీర్వదించారని నవ్వుతూ మోదీ చెప్పారు.
కాంగ్రెస్‌కు స్ఫూర్తి బ్రిటిషర్లే..
కాంగ్రెస్ ఎప్పుడూ బీసీలు, ఎస్సీల కోటాకు వ్యతిరేకమని, బ్రిటిష్ వారు ఆ పార్టీకి స్ఫూర్తి అని అన్నారు. బ్రిటిషన్ వారి బానిసత్వ చిహ్నాలను దశాబ్దాల పాటు కొనసాగించారని ప్రధాని విమర్శించారు. దేశాన్ని కష్టకాలం నుంచి తమ ప్రభుత్వం బయటకు తెచ్చిందని, సమస్యలను అధిగమించామని అన్నారు. భారతదేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో చెప్పడాన్ని ప్రశంసించారు. భారతదేశ సత్తా, పటిష్టత, భవిష్యత్తుపై ధీమా వ్యక్తం చేసిన రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలుపుకొంటున్నానని ప్రధాని అన్నారు.