Share News

వరుస రైలు ప్రమాదాల వేళ ‘రైల్‌ రక్షా దళ్‌’

ABN , Publish Date - Sep 25 , 2024 | 03:07 AM

దేశంలో రైలు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే తొలిసారి ‘రైల్‌ రక్షా దళ్‌’ను ఏర్పాటు చేసింది. ప్రమాద సమయాల్లో సత్వరం ఘటనా స్థలికి చేరుకుని సహాయం అందించే సామర్థ్యం ఈ రైల్‌ రక్షా దళ్‌కు ఉంటుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

వరుస రైలు ప్రమాదాల వేళ ‘రైల్‌ రక్షా దళ్‌’

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: దేశంలో రైలు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే తొలిసారి ‘రైల్‌ రక్షా దళ్‌’ను ఏర్పాటు చేసింది. ప్రమాద సమయాల్లో సత్వరం ఘటనా స్థలికి చేరుకుని సహాయం అందించే సామర్థ్యం ఈ రైల్‌ రక్షా దళ్‌కు ఉంటుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ప్రస్తుతానికి దీన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా వాయువ్య రైల్వే జోన్‌లో ప్రవేశ పెట్టామని, త్వరలో దేశవ్యాప్తంగా ప్రవేశపెడతామని చెప్పారు. కవచ్‌ పనితీరును పరిశీలించేందుకు మంగళవారం జైపూర్‌ వెళ్లిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ప్రమాద సమయాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సేవలను వాడుకుంటున్నామని ఇకపై రైల్‌ రక్షా దళ్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అలాగే ఇటీవల రైళ్లను పట్టాలు తప్పించే కుట్రతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే ట్రాక్‌లపై హానికర వస్తువులు పెడుతున్నారని, రైలు పట్టాలను తొలగించడం.. రాళ్లు రువ్వడం వంటి విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈ చర్యలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు. ఈ ప్రమాదాలను నిలువరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, డీజీపీలు, హోంశాఖ కార్యదర్శులతో చర్చలు జరుపుతున్నామని, ఇందులో ఎన్‌ఐఏకు కూడా భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు.

Updated Date - Sep 25 , 2024 | 03:07 AM