Digital Payments: బ్యాంకు ఖాతా లేకున్నా యూపీఐ చెల్లింపులు!
ABN , Publish Date - Aug 09 , 2024 | 04:56 AM
గూగుల్‌పే, ఫోన్‌పేలాంటి యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు జరపాలంటే వాటిని మన బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాల్సిందే! మరి బ్యాంకు ఖాతాలు లేనివారి పరిస్థితి?
వేరొకరి ఖాతా నుంచి చెల్లించే చాన్స్.. యూపీఐలో డెలిగేటెడ్ పేమెంట్స్ వ్యవస్థ
బ్యాంకు అకౌంట్ లేని మైనర్లు తల్లిదండ్రుల ఖాతాను వినియోగించుకునే అవకాశం!
యూపీఐ ద్వారా ప్రస్తుతానికి రూ.లక్షగా ఉన్న పన్ను చెల్లింపు పరిమితి 5 లక్షలకు పెంపు
ఇక గంటల్లోనే చెక్కుల క్లియరెన్స్‌కు ఆదేశం.. 9వసారీ రెపో రేటు యథాతథం
జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణ అంచనాలూ అంతే.. ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలు
సూచీలకు ఆర్బీఐ దెబ్బ.. మళ్లీ నష్టాల్లోకి మార్కెట్లు.. సెన్సెక్స్ 581 పాయింట్ల పతనం
వేరొకరి ఖాతా నుంచి చెల్లించే అవకాశం
త్వరలో అందుబాటులోకి తేనున్న ఆర్బీఐ
యూపీఐ ద్వారా ప్రస్తుతానికి రూ.లక్షగా ఉన్న పన్ను చెల్లింపు పరిమితి 5 లక్షలకు పెంపు
ఇక గంటల్లోనే చెక్కుల క్లియరెన్స్‌కు ఆదేశం
వరుసగా 9వసారీ రెపో రేటు యథాతథం
ముంబై, ఆగస్టు 8: గూగుల్‌పే, ఫోన్‌పేలాంటి యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు జరపాలంటే వాటిని మన బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాల్సిందే! మరి బ్యాంకు ఖాతాలు లేనివారి పరిస్థితి? అలాంటివారు వేరొకరి ఖాతా నుంచి చెల్లింపులు జరిపే వీలు కల్పించేలా.. డెలిగేటెడ్ పేమెంట్స్ (ప్రాతినిధ్య చెల్లింపులు) విధానాన్ని త్వరలో అందుబాటులోకి తేనున్నట్టు భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) ప్రకటించింది. డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు, యూపీఐ వినియోగాన్ని మరింతగా పెంచేందుకు ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
అందులో ప్రధానమైనది ఈ ప్రాతినిధ్య చెల్లింపుల విధానం. ఈ విధానంలో.. ఒక యూపీఐ వినియోగదారు తన బ్యాంక్ అకౌంట్ నుంచి నిర్దేశిత పరిమితి వరకూ యూపీఐ చెల్లింపులు జరిపేందుకు మరో వ్యక్తికి అధికారమిచ్చే వీలుంటుంది. బ్యాంక్ ఖాతా లేని వ్యక్తులు, మైనర్లు తమ తల్లిదండ్రులు లేదా సంబంధిత వ్యక్తుల బ్యాంక్ ఖాతాల ద్వారా యూపీఐ చెల్లింపులు జరిపేందుకు ఈ కొత్త విధానం ఉపయోగపడనుందని థర్డ్‌పార్టీ పేమెంట్ అప్లికేషన్ కివీ సహ-వ్యవస్థాపకులు మోహిత బేడీ అన్నారు. అయితే, ఈ వెసులుబాటుకు సంబంధించిన పూర్తి విధివిధానాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
ఇక యూపీఐ పరిమితి రూ.5 లక్షలకు..
యూపీఐ ద్వారా పన్ను చెల్లింపుల పరిమితి ప్రస్తుతం రూ.లక్షగా ఉండగా.. దాన్ని రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. తద్వారా పన్ను చెల్లింపుదారులు అధిక మొత్తంలో పన్నును సైతం యూపీఐ ద్వారా సులువుగా, వేగంగా చెల్లించేందుకు వీలవుతుందని పేర్కొంది. అలాగే చెక్కుల ద్వారా చెల్లింపులను మరింత వేగవంతం చేయనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ప్రస్తుతం చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్) బ్యాచ్-ప్రాసెసింగ్ విధానంలో పనిచేస్తుంది.
అంటే, నిర్దిష్ట సమయం వరకు వచ్చిన చెక్కులన్నింటినీ ఒక బ్యాచ్‌గా ప్రాసెస్ చేసి, క్లియర్ చేస్తారు. ఈ విధానంలో చెక్కు క్లియరెన్స్‌కు రెండు రోజుల దాకా సమయం పడుతుంది. ఇకపై బ్యాచ్ ప్రాసెసింగ్‌కు బదులు ఆన్ రియలైజేషన్ సెటిల్‌మెంట్ విధానంలో చెక్కులను క్లియర్ చేస్తారు. అంటే.. చెక్కు వచ్చిన తక్షణమే క్లియరెన్స్‌కు వెళుతుంది. తద్వారా కొన్ని గంటల సమయంలోనే అది క్లియర్ అవుతుంది. ఈ విధానం వల్ల చెక్కు ద్వారా చెల్లింపులు జరిపే వారికి, సొమ్ము అందుకునేవారికీ ఉపయోగం.
అనధికారిక డిజిటల్ రుణ యాప్స్‌కు చెక్
అనధికారిక రుణయా్‌పలకు చెక్ పెట్టేందుకు తమ నియంత్రణలోని సంస్థలు నిర్వహిస్తున్న డిజిటల్ రుణ యాప్‌లతో ఒక రిపాజిటరీని ఏర్పాటు చేయాలని ఆర్బీఐ ప్రతిపాదన చేసింది. అనధికారిక యాప్‌లను గుర్తించడంతోపాటు కస్టమర్లు వాటి వలలో పడకుండా ఉండేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది.