Enforcement Directorate (ED) : ఢిల్లీ మద్యం కేసులో 1100 కోట్ల అక్రమాలు
ABN , Publish Date - Jun 04 , 2024 | 05:31 AM
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన కల్వకుంట్ల కవితపై మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 4 కింద చర్యలు తీసుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రత్యేక కోర్టును కోరింది. ఆమె ఆస్తుల స్వాధీనానికి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. మద్యం కుంభకోణంలో మొత్తం రూ.1100 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని, ఇందులో కవిత పాత్ర రూ.292 కోట్ల మేరకు ఉందని తెలిపింది.
అందులో రూ.292 కోట్ల మేరకు కవిత పాత్ర!
విజయ్ నాయర్ ద్వారా ఆప్‌కు రూ.100 కోట్లు ఇచ్చారు
డిజిటల్ సాక్ష్యాల్ని చెరిపేశారు.. ఫోన్లపైనా తప్పుడు ప్రకటనలు
మనీలాండరింగ్ చట్టం కింద కవితపై చర్యలు తీసుకోవాలి
ఆమె ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలి.. ఈడీ అనుబంధ చార్జిషీట్
న్యూఢిల్లీ, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన కల్వకుంట్ల కవితపై మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 4 కింద చర్యలు తీసుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రత్యేక కోర్టును కోరింది. ఆమె ఆస్తుల స్వాధీనానికి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. మద్యం కుంభకోణంలో మొత్తం రూ.1100 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని, ఇందులో కవిత పాత్ర రూ.292 కోట్ల మేరకు ఉందని తెలిపింది.
ఈ మేరకు ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో ఈడీ సోమవారం అనుబంధ అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. ‘ఢిల్లీ మద్యం కుంభకోణం ఎలా జరిగింది? ఇందులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత, అరుణ్ రామచంద్ర పిళ్లై, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రుతోపాటు వివిధ మద్యం సంస్థల పాత్ర ఏంటి? ఎక్కడెక్కడ సమావేశాలు నిర్వహించారు? గోవా ఎన్నికల సమయంలో ఆప్‌కు ఎలా ముడుపులు సమకూర్చారు?’ వంటి విషయాలన్నింటినీ ఈడీ వివరించింది. దాదాపు 44 మంది సాక్షులను, 92 కీలక డాక్యుమెంట్లను కూడా అభియోగపత్రంతో పాటు పొందుపర్చింది.
ఆప్‌కు 100 కోట్ల ముడుపులిచ్చిన కవిత..
ఢిల్లీ మద్యం విధానంలో.. కవిత 33 శాతం భాగస్వామిగా ఉన్న ఇండోస్పిరిట్ కంపెనీ రూ.92 కోట్ల మేరకు లాభాలు పొందిందని, కవితకు బినామీగా అరుణ్ రామచంద్ర పిళ్లై వ్యవహరించారని ఈడీ తెలిపింది. మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా మార్చేందుకు విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత రూ.100 కోట్ల ముడుపులను సమకూర్చారని పేర్కొంది.
తన మొబైల్ ఫోన్ నంబరు 8008666666లో ఉన్న సమాచారం అంతటినీ కవిత తొలగించారని, ఆమె ఇచ్చిన ఫోన్‌లో ఎలాంటి సమాచారం లభించలేదని తెలిపింది. కవిత సమర్పించిన పది ఫోన్లను ఫోరెన్సిక్ పరీక్షకు పంపామని, అందులో నాలుగు ఫోన్లను ఆమె ఫార్మాట్ చేశారని వివరించింది. ఉద్దేశ పూర్వకంగానే ఆమె డిజిటల్ సాక్ష్యాలను తొలగించారంది.
అనేక మంది సాక్షులను ప్రభావితం చేశారని తెలిపింది. అరుణ్ పిళ్లై కూడా కవిత పాత్ర గురించి తాను చేసిన ప్రకటనను వెనక్కి తీసుకున్నారని వెల్లడించింది. ఈడీ ముందు రికార్డు చేసిన ప్రకటనల్లో కవిత తప్పుడు సాక్ష్యాలు వెల్లడించారని, ఇండో స్పిరిట్‌లో తనకు ఎలాంటి వాటా లేదని బుకాయించారని.. బుచ్చిబాబు, రాఘవ మాగుంటల మధ్య వాట్సాప్ చాట్ల గురించి తనకేమీ తెలియదని చెప్పారని వివరించింది.
తానే తొమ్మిది ఫోన్లను ఈడీకి సమర్పించి, తన ఫోన్లను ఈడీ లాక్కున్నదని తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపించింది. సౌత్ గ్రూపులో సభ్యులు సమీర్ మహేంద్రుతో కలిసి ఇండో స్పిరిట్‌ను నెలకొల్పడంలో కీలకపాత్ర పోషించడంతో కవిత ఫెర్నాండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో కూడా డిస్ట్రిబ్యూషన్ హక్కులను పొందారని, మొత్తం లాభాల్లో రూ.192.8 కోట్లు కవితకు దక్కాయని ఈడీ తెలిపింది. కవిత పీఏ అశోక్ కౌశిక్.. దినేశ్ అరోరా కార్యాలయం నుంచి పెద్ద మూటల్లో నగదు సేకరించి మరో వ్యక్తికి ఇచ్చినట్లు సాక్ష్యాలు ఉన్నాయంది.
అభిషేక్ బోయినపల్లి ఆదేశాల మేరకే గోవాకు హవాలా మార్గంలో రూ.7 కోట్లు పంపానని ఆంధ్రప్రభ ఎండీ ముత్తా గౌతమ్ అంగీకరించారని వెల్లడించింది. ముత్తా గౌతమ్‌కు చెందిన ఇండియా ఎహెడ్ ఛానల్‌లో ఆమె తనకు లభించిన రూ.192.8 కోట్లలో రూ.1.70 కోట్లు వాటాగా పెట్టారని, అభిషేక్ బోయినపల్లిని అక్కడ డమ్మీగా పెట్టారని తెలిపింది.
ఇండియా ఎహెడ్‌కు ఎలా డబ్బు బదిలీ అయ్యిందో ఈడీ వివరించింది. మాగుంట రాఘవ, శరత్‌చంద్రారెడ్డి కూడా కవిత పాత్ర గురించి స్పష్టంగా తెలియజేసిన వైనాన్నీ వెల్లడించింది. కవిత తరఫునే అరుణ్ పిళ్లై పెట్టుబడి పెట్టినట్లు బుచ్చిబాబు వెల్లడించారని పేర్కొంది. వీటన్నింటిని బట్టి చూస్తే కవిత మనీలాండరింగ్ చట్టంలోని పలు సెక్షన్ల కింద అనేక నేరాలకు పాల్పడినట్టు స్పష్టమవుతోందని ఈడీ వెల్లడించింది.