INDIA Alliance: కాంగ్రెస్-లెఫ్ట్ మధ్య సీట్ల చిచ్చు!
ABN , Publish Date - Oct 28 , 2024 | 05:18 AM
జార్ఖండ్, మహారాష్ట్ర, అసెంబ్లీ ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమిలో చిచ్చురేగింది. కాంగ్రెస్ ఏకపక్ష వైఖరి వామపక్షాలను ఆగ్రహానికి గురిచేస్తోంది.
జార్ఖండ్‌లో సీపీఎం, సీపీఐలను పట్టించుకోని జేఎంఎం-కాంగ్రెస్
మహారాష్ట్రలో కుదరని సర్దుబాటు
బెంగాల్ ఉప ఎన్నికల్లో ఎవరికి వారే
న్యూఢిల్లీ, అక్టోబరు 27: జార్ఖండ్, మహారాష్ట్ర, అసెంబ్లీ ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమిలో చిచ్చురేగింది. కాంగ్రెస్ ఏకపక్ష వైఖరి వామపక్షాలను ఆగ్రహానికి గురిచేస్తోంది. జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ సీట్లకు గాను జేఎంఎం-కాంగ్రెస్ 70 చోట్ల బరిలోకి దిగుతున్నాయి. మిగతా 11లో సీపీఐ-ఎంఎల్, ఆర్‌జేడీలకు చెరో నాలుగు సీట్లు కేటాయించాయి. మిగతా మూడింటిపై స్పష్టత ఇవ్వలేదు. కార్మిక వర్గాల ప్రాబల్యం ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో సీపీఎం, సీపీఐలకు కూడా చెప్పుకోదగిన బలం ఉంది. కానీ కాంగ్రెస్ వాటికి ఒక్కసీటు కూడా ఇవ్వలేదు. దీంతో సీపీఎం 9 స్థానాల్లో ఒంటరి పోరుకు దిగుతోంది. సీపీఐ 4 సీట్లలో పోటీకి సమాయత్తమైంది.
చెరో నాలుగు దక్కిన సీపీఐ-ఎంఎల్, ఆర్‌జేడీ కూడా అసంతృప్తిగా ఉన్నాయి. తనకు కేటాయించిన స్థానాల్లో ధన్వార్‌లో జేఎంఎం తన అభ్యర్థిని నిలపడంపై ఎంఎల్ మండిపడుతోంది. దీంతో తాను కూడా ఐదు చోట్ల పోటీకి సిద్ధమైంది. 288 సీట్ల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాఢీ (ఎంవీఏ)లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, పవార్ ఎన్‌సీపీ, ఉద్ధవ్ శివసేన ప్రస్తుతానికి తలో 85స్థానాలపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. మిగతా 33 సీట్లపై ఇప్పటికీ నిర్ణయానికి రాలేకపోతున్నా యి. ఇక్కడ కూడా సీపీఐ ఒకటి, సీపీఎం రెండు సీట్లు కోరుతుండగా పై 3 పార్టీలూ అందుకు సుముఖంగా లేవు. ఇక బెంగాల్లో 6అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగనున్నాయి. లెఫ్ట్ ఫ్రంట్‌తో జట్టుకట్టేందుకు కాంగ్రెస్ అంగీకరించలేదు. దీంతో ఎవరికివారు అభ్యర్థులను ప్రకటించేశారు.