UPSC aspirants death: విపత్తు కాదు, హత్యే.. పార్లమెంటులో ప్రస్తావిస్తానన్న స్వాతి మలివాల్
ABN , Publish Date - Jul 28 , 2024 | 05:49 PM
వెస్ట్ డిల్లీ రాజేందర్ నగర్‌లోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోడానికి బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ స్వాతి మలివాల్ మండిపడ్డారు. ఈ మరణాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగినవి కావని, ఇది 'హత్యే'గానే తాను భావిస్తున్నాని అన్నారు.
న్యూఢిల్లీ: వెస్ట్ డిల్లీ రాజేందర్ నగర్‌లోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోడానికి బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ స్వాతి మలివాల్ (Swati Maliwal) మండిపడ్డారు. ఈ మరణాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగినవి కావని, ఇది 'హత్యే'గానే భావించాలని అన్నారు. బాధ్యులైన అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. ఘటన జరిగి గంటలైన తర్వాత కూడా ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఏ ఒక్క మంత్రి కానీ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కానీ, ఇతర అధికారులు కూడా రాలేదని అక్షేపణ తెలిపారు.
కోచింగ్ సెంటర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులను కలిసిన స్వాతి మలివాల్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ''విద్యార్థులంతా చాలా బాధలో, ఆగ్రహంతో ఉన్నారు. ఘటన జరిగి 12 గంటల పైనే అయింది. ఇంతవరకూ మంత్రి కానీ, ఎంసీడీ మేయర్ కానీ, ఒక్క అధికారి కానీ రాలేదు. ఇదేదో ప్రకృతి విపత్తని నేను అనుకోవడం లేదు. ఇది హత్య. ప్రభుత్వాధికారులందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి'' అని స్వాతి మలివాల్ అన్నారు.
ఎన్నో ఆశలతో ఇక్కడకు వచ్చారు..
యూపీఎస్‌సీ పరీక్షలకు సిద్ధం కావడం ద్వారా జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలనే ఆశలతో దేశంలోని నలుమూలల నుంచి విద్యార్థులు ఇక్కడకు వచ్చారని, వారి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలకు ఓర్చి వారిని పంపారని చెప్పారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకుని విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే అంతకంటే దురదృష్టం ఏముంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
UPSC aspirants death: కోచింగ్ సెంటర్ యాజమానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
'కోటి' చొప్పున పరిహారం
ముగ్గురు విద్యార్థులు మరణించారా, ఇంతకంటే ఎక్కువ మంది మరణించారా అనేది ఇంకా నిర్ధారణ కాలేదని, మృతి చెందిన ప్రతి విద్యార్థి కుటుంబానికి కోటి రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రి, మేయర్ తక్షణం క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈ తరహాలో ఢిల్లీ పాలన జరగరాదని, ఈ అంశాన్ని పార్లమెంటులో తాను లెవనెత్తుతానని తెలిపారు. 12 రోజుల క్రితం డ్రైనేజీ సిస్టం బాగోలేదని కౌన్సిలర్‌కు ఫిర్యాదు చేసినట్టు విద్యార్థులు తనకు తెలిపారని, దీనికి కౌన్సిలర్, ఆయన పైన ఉన్న వారంతా సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు.
Read More National News and Latest Telugu News