Uttarakhand: అలకానంద నదిలో టెంపో పడి 14 మంది దుర్మరణం
ABN , Publish Date - Jun 15 , 2024 | 02:32 PM
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తు్న్న టెంపో ట్రావెలర్ రుద్రప్రయాగ్ జిల్లాలోని అలకానంద నదిలో పడి 14 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 12 మంది వరకూ గాయపడ్డారు.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తు్న్న టెంపో ట్రావెలర్ రుద్రప్రయాగ్ జిల్లాలోని అలకానంద నదిలో పడి 14 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 12 మంది వరకూ గాయపడ్డారు. టెంపోలో సుమారు 22 మందికి పైగా ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల స్పందన బృందం (SDRF) కమాండెంట్ మణికాంత్ మిశ్రా తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఘజియాబాద్ నుంచి చోప్టాకు టెంపో వెళ్తుండగా మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రమాదం చోటుచేసుకుంది. రుద్రప్రయాగ్ సిటీ నుంచి ఒక చిన్న మలుపు తిరుగుతుండగా ప్రమాదం జరిగిందని, వాహనం అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లిందని మిశ్రా చెప్పారు. తమ సిబ్బంది కాపాడిన వారిలో చాలామంది పరిస్థితి నిలకడగా ఉందని, నలుగురు తీవ్రంగా గాయపడటంతో వారికి రిషికేష్‌లోని ఎయిమ్స్‌కు పంపామని చెప్పారు. వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది ఢిల్లీకి చెందిన వారు ఉన్నట్టు తెలుస్తోంది.
Encounter: రెండ్రోజులుగా ఎదురు కాల్పులు.. మావోలకు చావు దెబ్బ
సీఎం దిగ్భ్రాంతి...
కాగా, ప్రమాద ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి విచారం వ్యక్తం చేశారు. స్థానిక అధికార యంత్రాంగం, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని చెప్పారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ఒక ట్వీట్‌లో తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణకు జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశించారు.
పీఎం ఎక్స్‌గ్రేషియా
ఉత్తరాఖండ్‌లో జరిగిన ప్రమాదం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Read Latest National News and Telugu News