Katchatheevu:మోదీకి మాణికం సవాల్
ABN , Publish Date - Apr 01 , 2024 | 01:49 PM
ప్రధాని మోదీ కచ్చతీవులుపై ఎక్స్ వేదికగా చేసి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణికం ఠాగూర్ స్పందించారు. తమిళనాడుపై అంతగా ఆందోళన చెందుతుంటే.. శ్రీలంకకు అప్పగించిన కచ్చతీవులను వెనక్కి తీసుకు రావాలని ప్రధాని మోదీకి ఆయన ఈ సందర్బంగా సవాల్ విసిరారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ప్రధాని మోదీ కచ్చతీవులు ( Katchatheevu Island) పై ఎక్స్ వేదికగా చేసి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణికం ఠాగూర్ (Manickam Tagore) స్పందించారు. తమిళనాడుపై అంతగా ఆందోళన చెందుతుంటే.. శ్రీలంక (sriLanka)కు అప్పగించిన కచ్చతీవులను వెనక్కి తీసుకు రావాలని ప్రధాని మోదీకి ఆయన ఈ సందర్బంగా సవాల్ విసిరారు. సోమవారం న్యూఢిల్లీలో కచ్చతీవుల అంశంపై మాణికం ఠాగూర్ మాట్లాడారు.
రామనాథ్ జిల్లాలో మత్స్యకారులు, సోదరులపై దాడి జరిగితే.. కచ్చతీవులు వెనక్కి తీసుకోవాలని తాము గొంతు పెంచుతామని స్పష్టం చేశారు. అయితే తమిళనాడు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని.. అందుకే ప్రధాని మోదీ ఈ తరహా చౌకబారు పనులు చేస్తున్నారని విమర్శించారు. తమిళనాడు ప్రజలు ఆయన ప్రయత్నాలను ఇప్పటికే తోసిపుచ్చారని గుర్తు చేశారు. తమిళనాడులో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదన్నారు. అన్నామలై రెండో స్థానంలో కాదు.. మూడో స్థానంలో నిలుస్తారన్నారు.
తమిళనాడు ప్రజలు.. బీజేపీ, ఆర్ఎస్ఎస్, ప్రధాని మోదీని పక్కన పెట్టారని అందుకే ఆయన ఈ తరహా రాజకీయాలకు తెర తీశారని మండిపడ్డారు. తమిళనాడు రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీకి ప్రేమ ఎంత బాగా ఉందో అందరికీ తెలిసిందేనన్నారు. మధురైలో ఎయిమ్స్ సంస్థ నేటికి మొదలు కాలేదని.. అలాగే ఆ రాష్ట్రంలో కేంద్రం చేపట్టిన ఏ ప్రాజెక్ట్ ఇప్పటికి ప్రారంభం కాలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ఆయా ప్రాజెక్ట్‌లకు కేవలం శంకుస్థాపనలు మాత్రమే పరిమితమయ్యాయని ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు. శ్రీలంకకు కచ్చతీవులను భారత్ అప్పగించడం వెనక చారిత్రక నేపథ్యం ఉందన్నారు. పాత రామనాథపురం జిల్లాలోని 6 లక్షల మంది తమిళులను రక్షించడం కోసం.. ఆ దీవులను శ్రీలంకకు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 1974లో బారత ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక అధ్యక్షురాలు సిరిమావో బండారునాయకే మధ్య ఈ ఒప్పందం (Indira Gandhi-Sirimavo Bandaranaike agreement) జరిగిందని తెలిపారు. అందువల్ల తమిళులు రక్షించబడ్డారని మాణికం ఠాగూర్ వివరించారు.