కేన్స్‌ఎర్ర తివాచీ పరిచింది
ABN , Publish Date - May 16 , 2024 | 04:03 AM
ఒళ్లంతా తెల్ల మచ్చలు... బయటకు వెళితే వింత చూపులు... బాల్యం ఆటపాటలతో కాకుండా... అవహేళనలు అవమానాలతో గడిచింది. బాధను దిగమింగుకుని... ఆ హేళనలనే స్ఫూర్తిగా మలుచుకుని...

ఒళ్లంతా తెల్ల మచ్చలు... బయటకు వెళితే వింత చూపులు... బాల్యం ఆటపాటలతో కాకుండా... అవహేళనలు అవమానాలతో గడిచింది. బాధను దిగమింగుకుని... ఆ హేళనలనే స్ఫూర్తిగా మలుచుకుని... ఆత్మవిశ్వాసంతో నిలబడింది. కంటెంట్ క్రియేటర్‌గా లక్షల మందికి చేరువై... ఎందరికో ప్రేరణగా మారింది. ఇప్పుడు ప్రతిష్టాత్మక ‘కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్’ రెడ్ కార్పెట్‌పై మెరిసే తొలి విటిలిగో భారతీయురాలిగా చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతున్న ఆస్థా షా జర్నీ ఇది...
‘నేను నేనులా ఉంటా’... ఇది అస్థా షా చెప్పే మాట. ఎవరికో భయపడి, ఇంకెవరో ఏదో అనుకొంటారని ఒళ్లంతా కప్పుకొని తిరగడం తనవల్ల కాదంటుంది ఈ ముంబయి భామ. అయితే ఇప్పుడు పరిస్థితులు ఒకప్పటిలా కాదని... ఫ్యాషన్ పరిశ్రమ తనలాంటివారికి కూడా ర్యాంప్‌పై నడిచే అవకాశాలు కల్పిస్తోందని అంటుంది. అందుకు తననే ఒక ఉదాహరణగా చెబుతోంది 26 ఏళ్ల ఆస్థా. ఇంట్లో దేనికీ లోటు లేకపోయినా... ఆమె జీవితం పూల పాన్పు కాదు. అడుగు బయట పెడితే చాలు... చులకన చేసే మాటలు... ఉచిత సలహాలు. వినీ వినీ విసుగెత్తిపోయింది. రోదనలతో నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపింది. అమ్మానాన్నల అండతో తిరిగి మనిషి అయింది.
డిజిటల్ కంటెంట్ క్రియేటర్ అయిన ఆస్థా షా పేరు రెండేళ్ల కిందట బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. విటిలిగో (తెల్ల మచ్చలు)తో తాను చేస్తున్న పోరాటం... భావోద్వేగాలతో నిండిన తన నిత్య జీవితాన్ని నెటిజనులతో ఆమె పంచుకుంది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో లక్షల మందిని కదిలించింది.
మందులతో ఫలితం లేక...
ఆస్థానా తనకున్న దీర్ఘకాలిక చర్మ వ్యాధికి ఊహ తెలియకముందు నుంచీ చికిత్స తీసుకొంటోంది. కానీ ఏదీ ఫలితం ఇవ్వలేదు. ‘అల్లోపతి, హోమియోపతి, నేచురోపతి... అన్ని రకాల మందులూ వాడాను. గుళ్లు, గోపురాలు తిరిగాను. గ్రామాలకు వెళ్లి బాబాలను కలిశాను. ఏదీ పని చేయలేదు. నా ఒంటిపై తెల్ల మచ్చలు పెరుగుతున్నాయే కానీ ఏ మాత్రం తగ్గుముఖం పట్టలేదు. దీంతో ఆరేళ్ల తరువాత మందులు వాడడం మానేశాను. విటిలిగో అనేది పెరగవచ్చు... లేదా తగ్గవచ్చు. అది శరీర తత్వం మీద ఆధారపడి ఉంటుంది. దానికి మందు లేదు. వైద్యం తీసుకున్నన్ని రోజులూ నరకం చూశాను. చాక్లెట్లు, పుల్లని పదార్థాలు, శీతల పానీయాలు... ఏవీ తినలేకపోయాను. ఎండలో తిరగలేకపోయాను. నా బాల్యాన్ని పూర్తిగా కోల్పోయాను. ఎప్పుడైతే మందులు ఆపేశానో... ఇక అప్పటి నుంచి నా జీవితాన్ని నేను జీవించడం మొదలుపెట్టాను’ అంటూ చిన్ననాటి రోజులు గుర్తు చేసుకుంది ఆస్థా షా.
ఆమే నాకు స్ఫూర్తి...
‘‘నేను రోడ్డు మీదకు వెళితే కొంతమంది నా ముఖంకేసి వింతగా చూస్తారు. ఒళ్లంతా కప్పుకోమని మరికొందరు సలహాలిస్తారు. అందుకని గడప దాటకుండా ఇంట్లోనే బందీగా ఉండలేముగా! ఆ వింత చూపులు, ఉచిత సలహాలే నాకు ప్రేరణగా మలుచుకున్నా. అలాంటి ఘటనలు ఎదురైన ప్రతిసారీ మరింత కసితో నా లక్ష్యం వైపు పరుగులు పెట్టడం అలవాటు చేసుకున్నా. నాలో ఇంతటి స్ఫూర్తిని, ధైర్యాన్ని నింపింది ఎవరో కాదు... కెనడియన్ మోడల్ విన్నీ హార్లో. ‘విక్టోరియాస్ సీక్రెట్ ఫ్యాషన్ షో-2016’లో క్యాట్‌వాక్ చేసిన మొట్టమొదటి విటిలిగో మోడల్‌గా విన్నీ చరిత్ర సృష్టించింది. అది చూపించి మా నాన్నకు చెప్పాను... ‘విన్నీలా నేను కూడా ఏదోఒక రోజు ర్యాంప్‌పై నడుస్తా’నని. విన్నీతో పోలిస్తే నా పరిస్థితి భిన్నమైనది. ఇప్పుడు మచ్చలు నా ఒళ్లంతా వ్యాపించేశాయి. కానీ విన్నీ ఏనాడూ తన మచ్చలను దాచే ప్రయత్నం చేయలేదు. ఆమె ఆమెలా జీవించడానికే ఇష్టపడుతుంది. ఆ అంశమే నన్ను బాగా ఆకట్టుకుంది. నా మీద నాకు ప్రేమ కలిగించింది’’ అంటుంది ఆస్థా.
కలలో కూడా ఊహించనిది...
కెనడియన్ ఫ్యాషన్ మోడల్ అయిన విన్నీ షా 2018లో ‘కేన్స్’ రెడ్ కార్పొట్ మీద నడిచింది. అప్పట్లో అదొక సంచలనం. ఎందుకంటే అక్కడ మెరిసిన తొలి విటిలిగో సెలబ్రిటీ విన్నీ. అదే బాటలో ఆస్థా షా నడుస్తోంది. ఈ నెల 19న ‘కేన్స్’ ఎర్ర తివాచీపై ఆమె హొయలు ఒలికించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా ఆ వేదికపై క్యాట్‌వాక్ చేసిన తొలి విటిలిగో భారతీయురాలిగా చరిత్ర సృష్టించనుంది. ఈ అవకాశం తనకు రావడంపట్ల ఆస్థా ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అదే సమయంలో ఒకింత గర్వంగానూ భావిస్తోంది. ‘‘ఇది నిజమేనా! ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. కలలో కూడా ఊహించనిది. ఆ ఉత్సవానికి ఏ డ్రెస్ వేసుకోవాలో నిర్ణయించుకోలేకపోతున్నా. అయితే నాకు సాయం చేయడానికి చాలామంది డిజైనర్లు ముందుకు వస్తున్నారు. ‘కేన్స్’లో విన్నీలా నేను కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించాలని కోరుకొంటున్నా. ఏదిఏమైనా నాకు వచ్చిన అద్భుత అవకాశం ఇది. నాలాంటి వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకొంటున్నా. రెడ్ కార్పెట్ మీదకు వెళ్లగానే ‘విన్నీ... నీవల్లే ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను’ అని బిగ్గరగా అరిచి చెప్పాలని ఉంది. ‘డాల్మేషన్ డాగ్‌లా ఉన్నావని’ నన్ను హేళన చేసినవారికి ‘ఇది నేను సాధించిన విజయం. మనిషి ఆకారాన్ని, లోపాలను కాదు... అతడిలోని ప్రతిభను గుర్తించండి’ అనే సందేశం ఇవ్వాలనుకొంటున్నా. ‘కేన్స్’కు పయనమవుతున్న వేళ ఇలా నాలో ఎన్నో ఆలోచనలు, అంతర్మథనాలు’’ అంటూ తన అంతరంగాన్ని పంచుకుంది ఆస్థా షా.
వాళ్లే నా బలం
‘కేన్స్’ రెడ్ కార్పెట్ మీద కనిపించనున్న ఆస్తా షాకు సామాజిక మాధ్యమాల్లో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తరచూ రీల్స్ పోస్ట్ చేస్తుంటుంది. కొన్ని బడా బ్రాండ్లకు ప్రచారకర్తగా కూడా వ్యవహరిస్తోంది. ‘సామాజిక మాధ్యమాల్లోకి వచ్చాకే నేనేంటో అందరికీ తెలిసింది. చాలామంది నాలోని లోపాన్ని కాకుండా... కంటెంట్ క్రికెటర్‌గా నాలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. మొట్టమొదటి వీడియో పోస్ట్ చేశాక... ‘ఈ సమాజంలో ఎలా నెట్టుకొస్తున్నావ’ని కొందరు అడిగారు. నా కథ విని ఎందరో చలించారు. అలాంటి మాటలు నాలో ఉత్తేజాన్ని కలిగిస్తాయి’ అంటున్న ఆస్థా షా ఇప్పుడు ఎంతోమందికి ప్రేరణ అయ్యారు.