Share News

Sneha Desai :ఈ గుర్తింపుతో కల సాకారమైంది

ABN , Publish Date - Sep 29 , 2024 | 05:37 AM

లాపతా లేడీస్‌... మహిళల గుర్తింపుపై బలమైన ముద్ర వేసిన సినిమా. బెస్ట్‌ ఫారిన్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ఇండియా నుంచి అధికారిక చిత్రంగా ఆస్కార్‌ బరిలో నిలిచింది.

Sneha Desai :ఈ గుర్తింపుతో కల సాకారమైంది

లాపతా లేడీస్‌... మహిళల గుర్తింపుపై బలమైన ముద్ర వేసిన సినిమా. బెస్ట్‌ ఫారిన్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ఇండియా నుంచి అధికారిక చిత్రంగా ఆస్కార్‌ బరిలో నిలిచింది. బిప్లాబ్‌ గోస్వామి అందించిన కథకు తన స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్‌తో మాయ చేశారు స్నేహా దేశాయ్‌. లాపతా లేడీస్‌తో తన కలను సాకారం చేసుకున్నారామె. మరిన్ని విశేషాలు ఆమె మాటల్లోనే...

‘‘ఒక రచయితగా ఈ గుర్తింపు నాకలను సాకారం చేసింది. ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన అందరికీ గుర్తింపు లభించింది. ఇందులో నేను కూడా భాగస్వామి కావడం నా అదృష్టం. ఈ చిత్రం మూల కథ బిప్లాబ్‌ గోస్వామి రాశారు. సినీస్థాన్‌ ఇండియా స్టోరీటెల్లర్‌ కాంపిటీషన్‌లో ఆయన రాసిన కథ పోటీలో నిలిచింది. ఆ కాంపిటీషన్‌ జ్యూరీలో అమీర్‌ఖాన్‌ ఉన్నారు.

Untitled-3 copy.jpg

ఆ స్టోరీ నచ్చడంతో స్ర్కీన్‌ప్లే డెవలప్‌ చేయమని నాకు ఇచ్చారు. అమీర్‌ఖాన్‌ వాళ్ల అబ్బాయి జునైద్‌ఖాన్‌ హీరోగా వచ్చిన ‘మహారాజ్‌’ సినిమాకు నేను పనిచేశాను. నా పని నచ్చడంతో గోస్వామి కథను డెవలప్‌ చేయమని చెప్పారు. అలా లాపతా లేడీస్‌ పట్టాలెక్కింది. సినిమా కోసం కొన్ని క్యారెక్టర్లు డెవలప్‌ చేసే స్వేచ్ఛను ఇచ్చారు. కథలు చెప్పడం భారతీయ మూలాల్లోనే ఉంది. అలాంటి వాతావరణంలోనే నేను పెరిగాను. మా తాత, అమ్మమ్మ, నానమ్మ, మా పేరెంట్స్‌ కథలు అద్భుతంగా చెప్పేవారు. ఆ ప్రభావం నాపై ఉంది.

  • అదే చూపించాం...

ఇది స్త్రీవాద చిత్రం కాదు. మహిళలు, మహిళా సాధికారత గురించి మాట్లాడే సినిమా. మహిళలు వాళ్ల సమస్యలకు పరిష్కారం కనుగొమని అడిగేందుకు ప్రయత్నించాం. స్వేచ్ఛ వైపు అడుగులు వేయమని కోరాం. ఇందులో పురుష క్యారెక్టర్లను కూడా అద్భుతంగా చూపించాం. మొత్తంగా బ్యాలెన్స్‌ చేశామనే అనుకుంటున్నాం. జీవితంలో ఎదగాలంటే ఒకరి సహకారం మరొకరకి అవసరం. అదే సినిమాలో చూపించాం.

సినిమాలో ప్రధాన స్త్రీ క్యారెక్టర్లకు ముసుగులు వేయడమనేది కథ ముందుకు వెళ్లేందుకు ట్రిగ్గర్‌లా ఉపయోగపడతాయని పెట్టాం. లక్ష్యాలు, ఆశయాలు ఎంత చిన్నవైనా, పెద్దవైనా కావచ్చు. అని కానీ వాటిని సంపూర్ణంగా సాధించుకోవాలి. ఉదాహరణకి గృహిణిగా ఉంటే అత్తగారితో స్నేహం చాలా ముఖ్యం. భాగస్వామి కోసం సబ్జీని వండటం ముఖ్యమైన అంశం. అదే ఇందులో చూపించాం.


  • తగిన గుర్తింపు లేదు

ఒక సినిమా విజయం సాధించినప్పుడు దర్శకులకు, నటులకు వచ్చినంత గుర్తింపు రచయితలకు రావడం లేదు. ఇది బాధ కలిగించే అంశమే. అయితే పెన్నుకున్న పవర్‌ను ప్రేక్షకులు ఆర్థం చేసుకుంటున్నారు. ఒక బౌండ్‌ స్ర్కిప్ట్‌కున్న పవర్‌ని, రచయితలకు ఉన్న శక్తిని ప్రేక్షకుడు తెలుసుకున్నారు. గుల్జార్‌, జావేద్‌ అక్తర్‌, జుహీ చతుర్వేది లాంటి గొప్ప రచయితలు కథలు అందించిన సినిమాలు వాళ్ల పేర్లతో అమ్ముడవుతున్నాయి.

  • అవకాశాలు పుష్కలం

కథలు రాయడాన్ని కెరీర్‌గా ఎంచుకునే వారికి బోలెడు అవకాశాలు ఉన్నాయి. అయితే రాసే కథలో కాంప్రమైజ్‌ కావద్దు. మీ మనసును ఫాలో కావాలి. కథలను స్వేచ్ఛగా రాయాలి. ముందుగా బాగా చదవడం అలవాటు చేసుకోవాలి. సాహిత్యం, కామిక్స్‌, ఫిక్షన్‌ చదవాలి. పదాలు వెతుక్కునేందుకు శ్రమ పడకుండా ఉండేలా తయారవ్వాలి. సినిమాలు బాగా చూడాలి. రాసిన పదాలు చాలా దూరం ప్రయాణిస్తాయి. అందులో సందేహం లేదు.


  • నటన నుంచి రచన వైపు...

మాది ముంబయి. నాకు గుజరాతీ థియేటర్‌తో చాలా సంబంధం ఉంది. దాదాపు 25 ఏళ్లు పనిచేశాను. నేను ముందుగా నటిని. ఆ తరువాతే రచయితగా మారాను. స్నేహితులతో వన్‌ లైన్‌ ఐడియాస్‌, స్టోరీస్‌ షేర్‌ చేసే దాన్ని. గుజరాత్‌ థియేటర్‌ తరువాత టీవీ రంగంలోకి అడుగుపెట్టాను. గుజరాతీ టీవీ నుంచి హిందీ టీవీకి వచ్చాను. హిందీ టీవీ నుంచి మహారాజ్‌ అవకాశం వచ్చింది. ఆ తరువాత లాపతా లేడీస్‌ ఛాన్స్‌ దక్కింది. ప్రతినెలా టీవీ కోసం 56 ఎపిసోడ్‌లు రాసేదాన్ని. టీవీ రంగంలో టైమ్‌లైన్‌ కీ ఫ్యాక్టర్‌గా ఉంటుంది. ఈ రోజు నువ్వు రాసింది రేపు లేక ఎల్లుండి షూట్‌కి వెళుతుంది. డ్రాఫ్ట్‌ రీరైట్‌ చేయడం ఉండదు.

  • సహకారం మరువలేనిది

స్నేహితులు, బంధువులు, వెల్‌విషర్స్‌ నుంచి అభినందనలు చెబుతూ చాలా మెసేజ్‌లు వచ్చాయి. వాళ్ల సపోర్టు నాకెంతో అనందానిచ్చింది. నా కుటుంబ సభ్యులు నన్నెంతో నమ్మారు. నా కష్టాలను వాళ్లు చూశారు. ఇప్పుడు వాళ్లెంతో గర్వపడుతున్నారు. దర్శకురాలు కిరణ్‌రావుతో పనిచేయడం ఎంతో సంతోషానిచ్చింది. ఆమె తన టీమ్‌ మొత్తాన్ని నమ్మారు. మొదటి నుంచి కథను డెవలప్‌ చేయడానికి క్రియేటివ్‌ ఫ్రీడం అందించారు. ఆమెతో చేసిన డిస్కషన్స్‌ ఎంతో ఉపయోగపడ్డాయి. ఆమె సహకారం వల్లే రచన సులువుగా సాగిపోయింది. దర్శక రచయితల మధ్య రిలేషన్‌షి్‌పలో ఆ నమ్మకం, సహకారం చాలా అరుదుగా చూస్తుంటాం. యువ రచయితలను ప్రోత్సహించడంలో అమీర్‌ఖాన్‌ ఎప్పుడూ ముందుంటారు.’

Updated Date - Sep 29 , 2024 | 05:38 AM