TS Politics: హైదరాబాద్ ఎంపీ స్థానంలో అసదుద్దీన్‌పై మాధవీలత పోటీ!.. ఆమె ట్రాక్ రికార్డు ఇదే...
ABN , Publish Date - Mar 04 , 2024 | 01:36 PM
నగరంలో బీజేపీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. పాతబస్తీలో పార్టీని పటిష్టం చేయాలనే ధ్యేయంతో అడుగులు వేస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంలో మజ్లి్‌సకు గట్టి పోటీ ఇచ్చేందుకు విరించి ఆస్పత్రి, లతామా ఫౌండేషన్‌ల చైర్‌పర్సన్ మాధవీలతకు టికెట్ ఖరారు చేసింది. మజ్లి్‌సకు దీటుగా ఉండేందుకే మాధవీలతకు టికెట్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజకీయాలకు మాధవీలత కొత్త. ఆమెకు పార్టీలో గాడ్‌ఫాదర్ ఎవరూ లేరనే చెప్పొచ్చు. ఎంఐఎం కంచుకోటను బద్దలు కొడతానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ సిటీ, చాంద్రాయణగుట్ట, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): నగరంలో పూర్వ వైభవం కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. పాతబస్తీలో పార్టీని పటిష్టం చేయాలనే ధ్యేయంతో అడుగులు వేస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంలో మజ్లిస్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు విరించి ఆస్పత్రి, లతామా ఫౌండేషన్‌ల చైర్‌పర్సన్ మాధవీలతకు టికెట్ ఖరారు చేసింది. మజ్లిస్‌కు దీటుగా ఉండేందుకే మాధవీలతకు టికెట్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజకీయాలకు మాధవీలత కొత్త. ఆమెకు పార్టీలో గాడ్‌ఫాదర్ ఎవరూ లేరనే చెప్పొచ్చు. ఎంఐఎం కంచుకోటను బద్దలు కొడతానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. తొలుత హైదరాబాద్ స్థానంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బరిలో నిలపాలని భావించినా ఆయన నిరాకరించారని సమాచారం. ఎన్‌సీసీ క్యాడెట్‌గా, క్లాసికల్ సింగర్‌గా మాధవీలత గుర్తింపు తెచ్చుకున్నారు. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన మాధవీలత రెండేళ్లుగా పాతబస్తీ వేదికగా అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాలు, పాలనా స్ఫూర్తితో బీజేపీలో చేరారు. కొంతకాలంగా పాతబస్తీ ప్రజలతో మమేకమై పేదలను ఆదుకుంటున్నారు. సామాజిక కార్యకర్తగా త్రిపుల్ తలాక్‌పై అనేక ముస్లిం మహిళా సంఘాలతో కలిసి పనిచేశారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై కౌంటర్‌గా ఇచ్చిన పలు ఇంటర్వ్యూలతో ఆమె పాపులర్ అయ్యారు. బీజేపీ ప్రతినిధిగా అసదుద్దీన్ విధానాలను తనదైన శైలిలో వ్యతిరేకించడంతో పార్టీ అధిష్ఠానం దృష్టిలో పడ్డారు. మాధవీలత ఎంపికపై పునరాలోచించాలని హైదరాబాద్ స్థానం కోసం ప్రయత్నాలు చేసిన బీజేపీ భాగ్యనగర్ జిల్లా నాయకులు అధిష్ఠానాన్ని కోరుతున్నారు.
25 ఏళ్లు సంతోష్‌నగర్‌లోనే..
మాధవీలత పాతబస్తీలోని ఓల్డ్ సంతోష్‌నగర్‌లో జన్మించారు. విద్యాదాయిని పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించారు. నిజాం కాలేజీలో డిగ్రీ, కోఠి ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో పీజీ పూర్తి చేశారు. ఆమె పుట్టి పెరిగిందంతా ఓల్డ్ సంతోష్‌నగర్‌లోనే. 25 సంవత్సరాల పాటు అక్కడే ఉన్నారు. వివాహం అనంతరం భర్త కె.విశ్వనాథ్ (విరించి గ్రూప్ ఫౌండర్)తో కలిసి జూబ్లీహిల్స్‌కు వెళ్లిపోయారు. వీరికి ముగ్గురు పిల్లలు. ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రి చైర్‌పర్సన్ గా, లతా ఫౌండేషన్ నిర్వాహకురాలిగా వ్యవహరిస్తున్నారు.
1962లో జనసంఘ్ పోటీ
1962 ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంలో జనసంఘ్ పోటీ చేసింది. ఆ తర్వాత జనసంఘ్ జనతాపార్టీలో విలీనమైంది. 1980లో బీజేపీ తరఫున ఆలె నరేంద్ర రంగంలోకి దిగారు. ఆయనకు 1,35,304 ఓట్లు వచ్చాయి. 1984, 1989లో బీజేపీ తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చింది. 1991లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసిన బీజేపీ 42.2 శాతం, 1996లో జరిగిన ఎన్నికల్లో 26.68 శాతం ఓట్లు సాధించింది.
1991 నుంచి బరిలో బాల్‌రెడ్డి
1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున దివంగత నాయకుడు బద్దం బాల్‌రెడ్డి పోటీ చేసి 4,15,299 ఓట్లు సాధించారు. 1996లో జరిగిన ఎన్నికల్లో ఆయనకు 2,47,772 (26.13) ఓట్లు, 1998లో 4,14,173 (38.07) ఓట్లు వచ్చాయి. 1999లో జరిగిన ఎన్నికల్లో మరోసారి బద్దం బాల్‌రెడ్డి పోటీ చేయగా 3,87,344 ఓట్లు వచ్చాయి. 2004 ఎన్నికల్లో పోటీచేసిన సుబా్‌షచందర్‌జీ 2 లక్షల 78 వేల ఓట్లు సాధించారు. 2009లో సతీష్ అగర్వాల్ పోటీ చేసినా పెద్దగా ఓట్లు రాలేదు. 2009లో స్థానికంగా పట్టున్న భగవంతరావును బరిలోకి దింపగా గట్టి పోటీ ఇచ్చి దాదాపు 3.11,414 ఓట్లు సాధించారు. పాతబస్తీలో పార్టీకి పట్టుందని నిరూపించారు.
1984 నుంచి ఓవైసీల అడ్డా
హైదరాబాద్ స్థానం ఎంఐఎం అడ్డాగా పేరు పొందింది. ఇక్కడి నుంచి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ 2004 నుంచి వరుసగా విజయం సాధిస్తున్నారు. అంతకుముందు ఆయన తండ్రి సలావుద్దీన్ ఓవైసీ ఎంపీగా ఉన్నారు. మొత్తంగా 1984 నుంచి 2024 వరకు నాలుగు దశాబ్దాల పాటు ఎంఐఎం పార్టీదే ఆధిపత్యం. ఈ సారి ఎలాగైనా ఎంఐఎంకు చెక్ పెట్టి విజయం సాధించాలని భావిస్తున్న బీజేపీ అధిష్ఠానం అనూహ్యంగా మాధవీలతకు ఛాన్స్ ఇచ్చింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎంకు గట్టి పోటీ ఇచ్చిన ఎంబీటీ
పాతబస్తీలో తమకు ఎదురే లేదని భావిస్తున్న ఎంఐఎంకు ఇటీవల అసెంబ్లీ ఎన్నికలో యాకుత్‌పురాలో ఎంబీటీ అభ్యర్థి అంజదుల్లా ఖాన్ గట్టి పోటీ ఇచ్చారు. నాంపల్లిలో సైతం కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్ గట్టిగా నిలబడ్డారు. హైదరాబాద్ స్థానంలో అనేక సార్లు లోక్‌సభకు పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి బద్దం బాల్ రెడ్డి ఎంఐఎంకు గట్టిగా పోటీ ఇచ్చారు. నాటి నుంచి ఈ స్థానంలో ఎంఐఎం పట్టు నిలుపుకుంటూ వచ్చినా 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి నేటి వరకు బీఆర్‌ఎస్ సాయంతో గెలుస్తూ వస్తోంది.
బీజేపీ జెండా ఎగరేస్తా : మాధవీలత
సిట్టింగ్ ఎంపీగా ఉన్న అసదుద్దీన్ ఒవైసీని ఓడించి తీరుతా. హైదరాబాద్ ఎంపీ స్థానంలో బీజేపీ జెండా ఎగురవేస్తాం. ఇక్కడ విజయం సాధించి అయోధ్య బాలరాముడి పాదాలకు, ప్రధాని నరేంద్ర మోదీకి అంకితం ఇస్తా.
ఇవి కూడా చదవండి
Telangana: కాంగ్రెస్ తరఫున పోటీచేసే ఎంపీ అభ్యర్థులు వీళ్లేనా.. ఈ ఒక్క మార్పు జరిగితే..!?
Mallu Ravi: నాగర్‌కర్నూల్ ఎంపీ టికెట్‌పై మల్లు రవి క్లారిటీ
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం క్లిక్ చేయండి