Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్ పదవి ఎవరికి?.. చంద్రబాబు, నితీశ్ కుమార్ ఎందుకు కన్నేశారు?
ABN , Publish Date - Jun 10 , 2024 | 05:02 PM
‘మోదీ 3.0’ సర్కారు ఆదివారం కొలుదీరింది. దేశ ప్రధానిగా మూడవసారి నరేంద్ర మోదీ, 30 మంది కేబినెట్ మంత్రులు, 5 మంది స్వతంత్ర మంత్రులు, 32 మంది సహాయ మంత్రులు కలుపుకొని మొత్తం 72 మంది ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఇక్కడి వరకు ఓకే.. అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సర్వత్రా వినిపిస్తున్న ఆసక్తికరమైన ప్రశ్న లోక్‌సభ స్పీకర్ ఎవరు?.
‘మోదీ 3.0 సర్కారు’ (Mod 3.0 Cabinet) ఆదివారం కొలుదీరింది. దేశ ప్రధానిగా మూడవసారి నరేంద్ర మోదీ (Narendra Modi), 30 మంది కేబినెట్ మంత్రులు, 5 మంది స్వతంత్ర మంత్రులు, 32 మంది సహాయ మంత్రులు కలుపుకొని మొత్తం 72 మంది ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఇక్కడి వరకు ఓకే.. అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సర్వత్రా వినిపిస్తున్న ఆసక్తికరమైన ప్రశ్న లోక్‌సభ స్పీకర్ ఎవరు?. మోదీ 3.0 ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్‌లుగా ఉన్న టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu), జేడీయూ అధినేత నితీశ్ కుమార్ (Nitish Kumar) ఇద్దరూ లోక్‌సభ స్పీకర్ (Lok Sabha Speaker) పదవిని ఆశిస్తున్నారంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే అత్యంత కీలకమైన ఈ పదవిని ఇతరులకు ఇచ్చేందుకు తాము ఆసక్తిలేవని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
రాజ్యాంగం ఏం చెబుతోంది?
భారత రాజ్యాంగం ప్రకారం లోక్‌సభ తొలి సమావేశానికి ముందు స్పీకర్ పదవి ఖాళీగా ఉంటుంది. అయితే భారత రాష్ట్రపతి ప్రొటెం-స్పీకర్‌ను నియమిస్తారు. కొత్త ఎంపీల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం సభలో సాధారణ మెజారిటీతో లోక్‌సభ స్పీకర్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. స్పీకర్ ఎన్నికకు ప్రత్యేక నిబంధనలు ఏవీ లేకపోయినా.. రాజ్యాంగం, పార్లమెంటరీ రూల్స్‌ను దృష్టిలో ఉంచుకొని స్పీకర్ ఎన్నికను నిర్వహించాలి. గత రెండు లోక్‌సభల్లో బీజేపీకి స్పష్టమైన అధికారం ఉండడంతో సుమిత్రా మహాజన్, ఓం బిర్లా సాధారణ మెజారిటీతో ఎన్నికయ్యారు.
స్పీకర్ పదవిపై చంద్రబాబు, నితీశ్ కన్ను అందుకేనా?
‘ఎన్డీయే 3.0’ ప్రభుత్వంలో కింగ్ మేకర్‌గా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఇద్దరూ రాజకీయ అనుభవజ్ఞులు. సంకీర్ణ సర్కారు నిర్వహణలో దిట్టలు. రాజకీయ సంక్షోభాల సమయంలో స్పీకర్ పదవి ఎంతటి కీలకమైనదో బాగా అవగాహన ఉన్న నేతలు వీరిద్దరు. సంకీర్ణ ప్రభుత్వాల్లో స్పీకర్ పదవి ఒక ఇన్సూరెన్స్ లాంటిదని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటాయి. ఈ విషయాన్ని గ్రహించే ఇద్దరూ లోక్‌సభ పదవిని కోరుతున్నారు.
స్పీకర్ విలువపై బాగా అవగాహన కల్పించేలా గత రెండేళ్లుగా పలు రాష్ట్రాల్లో పాలక పక్షంలో తిరుగుబాట్లు వచ్చిన విషయం తెలిసిందే. అంతర్గత తిరుగుబాట్లు పార్టీల్లో చీలికలకు దారితీసిన పరిస్థితులు.. ప్రభుత్వాలు కుప్పకూలిన విషయాలు విధితమే. ఇటువంటి సందర్భాలలో స్పీకర్ పదవి చాలా కీలకంగా మారుతుంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం చట్టం కింద సభ్యులపై అనర్హత వేటు వేసే శక్తిమంతమైన హక్కు సభాపతికి ఉంటుంది. ఈ మేరకు స్పీకర్‌కు సంపూర్ణ అధికారం ఉంటుంది. మరోవైపు తన పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ప్రయత్నిచ్చిందంటూ గతంలో నితీశ్ కుమార్ ఒకసారి ఆరోపించారు. అటువంటి పరిస్థితుల్లో స్పీకర్ పదవి చక్కటి అస్త్రమని భావిస్తుంటారు. ఈ కారణంగానే కింగ్‌మేకర్‌లుగా టీడీపీ, జేడీయూ పార్టీలు అత్యంత వ్యూహాత్మకంగా లోక్‌సభాపతి స్థానాన్ని ఆశిస్తుండవచ్చునని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
స్పీకర్ పదవి.. అత్యంత కీలకం
లోక్‌సభ స్పీకర్ పదవి చాలా కీలకమైనది, క్లిష్టమైనదని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నాయి. సభను నడిపే వ్యక్తిగా స్పీకర్ పార్టీలకతీతంగా పారదర్శకంగా వ్యవహరించాలి. ఒక నిర్దిష్ట పార్టీకి చెందిన వ్యక్తే అయినప్పటికీ స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత మాత్రం అన్ని పార్టీలను సమానంగా చూడాలి. సభలో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. నాలుగో లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ దిగ్గజం నీలం సంజీవ రెడ్డి పారదర్శకంగా నడుచుకునేందుకుగానూ ఏకంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎవరూ ఈ విధంగా తమ పార్టీలకు రాజీనామా చేయలేదు. అయితే పీఏ సంగ్మా, సోమనాథ్ ఛటర్జీ, మీరా కుమార్ వంటి ఇతర మాజీ స్పీకర్లు అధికారికంగా పార్టీకి రాజీనామా చేయకపోయినప్పటికీ తాము సభకు సంబంధించినవారమని, పార్టీకి చెందిన వ్యక్తులం కాదని తెగేసి చెప్పారు. కాగా 2008లో లోక్‌సభ స్పీకర్ విషయంలో ఆసక్తికరమైన పరిణామాం జరిగింది. యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్టీ సూచనలను పట్టించుకోలేదనే కారణంగా నాటి స్పీకర్ సోమనాథ్ ఛటర్జీని సీపీఎం పార్టీ నుంచి బహిష్కరించింది.
ఇవి కూడా చదవండి
AP Election Results: కూటమి గెలిచినా బెట్టింగ్ రాయుళ్లు బికారులయ్యారే..!
గులాబీ బాస్ కీలక నిర్ణయం.. కేటీఆర్ ఔట్.. ఆ పదవి ఎవరికంటే..?
For more Political News and Telugu News