Share News

YSRCP: ప్లీజ్.. ప్లీజ్ టీడీపీలోకి వచ్చేస్తాం.. వెంటపడుతున్న వైసీపీ నేతలు!

ABN , Publish Date - Jul 04 , 2024 | 08:42 AM

ఎవరు ఏమనుకుంటే మాకేంటి..? మా పనులు సక్రమంగా సాగాలి..! పైసలు జేబులోకి రావాలి..! మా అవినీతి, అక్రమాలకు కొమ్ముకాస్తే టీడీపీలోకి వచ్చేందుకు మేము సిద్ధం అంటూ..

YSRCP: ప్లీజ్.. ప్లీజ్ టీడీపీలోకి వచ్చేస్తాం.. వెంటపడుతున్న వైసీపీ నేతలు!

  • ఊ.. అంటే వచ్చేస్తాం!

  • టీడీపీలో చేరేందుకు వైసీపీ నాయకుల తహతహ

  • అవినీతి, అక్రమాల కేసుల భయంతోనే..

  • వద్దంటున్న టీడీపీ కిందిస్థాయి కేడర్‌

అనంతపురం/పుట్టపర్తి: ఎవరు ఏమనుకుంటే మాకేంటి..? మా పనులు సక్రమంగా సాగాలి..! పైసలు జేబులోకి రావాలి..! మా అవినీతి, అక్రమాలకు కొమ్ముకాస్తే టీడీపీలోకి వచ్చేందుకు మేము సిద్ధం అంటూ కొంతమంది వైసీపీ (YSRCP) నాయకులు టీడీపీ (Telugu Desam) వెంట పడుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంత మంది ఛోటానాయకులు అడ్డదిడ్డంగా అవినీతి, అక్రమాలతో కోట్లకు పడగలెత్తారు. రెండోమారు వైసీపీ అధికారంలోకి వస్తుందన్న ఆశతో ఓటర్లను అనేక రకాలుగా ప్రలోభపెట్టారు. అయితే వారి ఆశలు ఫలించలేదు. టీడీపీ అధికారంలోకి రావడంతో వారి అక్రమాలకు అడ్డుకట్టపడ్డట్లైంది. అంతేకాక కూటమి ప్రభుత్వం తమ అవినీతి అక్రమాలను ఎక్కడ వెలికితీసి ఇబ్బంది పెడుతుందోనన్న భయం పలువు రు వైసీపీ నాయకులను పట్టుకుంది. దీంతో వారు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. ఆపార్టీ నాయకులతో రాయబారాలు నడిపారు. తమను పార్టీలో చేర్చుకుంటే తమ సంపాదనలో భాగం ఇస్తామంటూ ప్రలోభ పెడుతున్నారు.


TDP-And-YSRCP-Logo.jpg

చెలరేగిన వైసీపీ నాయకులు

గత వైసీపీ ప్రభుత్వం 2022లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా ఏర్పడింది. దీంతో రియల్‌ఎస్టేట్‌ అమాంతంగా పుంజుకుంది. ఇదే అదనుగా వైసీపీ నాయకులు చెలరేగి పోయి పేదల భూములను, ప్రభుత్వ భూములను కబ్జాచేశారు. మరికొంత మంది బెదిరింపులకు దిగి భూములను రాయించుకున్నారు. జగనన్న కాలనీల్లో బినామిపేర్లతో స్థలాలను కాజేశారు. ఈ అక్రమాన్నింటిని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీలో చేరేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు.


Anatapur.jpg

మీకు మేము.. మాకు మీరు!

వైసీపీ అధికారంలో ఉండగా మీకు మేము అండగా నిలిచాం. ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మీరు మాకు అండగా నిలవాలని కొందరు టీడీపీ నాయకులతో మంతనాలు చేస్తున్నారు. మీరు వైసీపీలోకి రాకపోయినా మీపనులు సాగేలా చూశాము. ఇప్పుడు అలాకాకుండా నేరుగా మీపార్టీలో చేరుతాము మీనాయకులతో మాట్లాడి మార్గం సుగమం చేయాలని కోరుతున్నారు.


ససేమిరా అంటున్న కేడర్‌!

అవినీతి అక్రమార్కులను టీడీపీలో చేర్చుకోవడానికి కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు ససేమిరా అంటున్నారు. అయినా స్థానికంగా ఉన్న కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు వారిని పార్టీలోకి తీసుకోవడానికి మీరు సమ్మతించాలని సంప్రదింపులు చేపట్టారు. ఎన్నికల ముందు వచ్చి ఉంటే మాకు సమ్మతమే. కానీ ఎన్నికల సందర్భంగా టీడీపీ ఓటమి కోసం దౌర్జన్యాలతో పని చేశారు. కేవలం అవినీతి, అక్రమాల కేసుల నుంచి రక్షణ పొందడానికే మనపార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడుతు న్నారు. తాము ఎంత మాత్రం ఒప్పుకునేది లేదంటూ కరాఖండిగా చెబుతు న్నారు. ఇదీ కొందరు టీడీపీ సీనియర్‌ నాయకులకు మింగుడుపడటంలేదు. అయినా మరోమార్గంలోనైనా వైసీపీ వారిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

Updated Date - Jul 04 , 2024 | 08:50 AM