Share News

Cyclone Dana: దానా తుపానుకి ఆ పేరు ఎలా వచ్చింది.. అర్థం ఏమిటో తెలుసా

ABN , Publish Date - Oct 23 , 2024 | 03:49 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది. పూరీ-సాగర్ ద్వీపం మధ్య ఇది తీరం దాటనుంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ను భయపెడుతున్న ఈ తుపాను దానా అని పేరు ఎలా వచ్చింది. భారతదేశమే ఈ పేరు పెట్టిందా? లేక ఇతర దేశం ప్రతిపాదించిందా?.. దానా పేరుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో..

Cyclone Dana: దానా తుపానుకి ఆ పేరు ఎలా వచ్చింది.. అర్థం ఏమిటో తెలుసా
Cyclone Dana

తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను తీవ్రమైనదిగా రూపాంతరం చెందిన విషయం తెలిసిందే. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున సమయంలో పూరీ-సాగర్ ద్వీపం మధ్య ఈ తుపాను తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. అత్యంత తీవ్రమైన తుపాను కావడంతో ప్రభావిత రాష్ట్రాలైన ఒడిశా, పశ్చిమ బెంగాల్ హడలిపోతున్నాయి. అత్యంత పకడ్బందీగా ముందుస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఈ తుపాను ఏపీపై కూడా పాక్షిక ప్రభావం చూపనుంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది.

ఇంతకీ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపానుకు ‘దానా’ అనే పేరు ఎలా వచ్చింది? దీనికి అర్థం ఏమిటి? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.


దానా అర్థం ఏమిటంటే..

దానా అనే పేరుకు అరబిక్‌లో సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. అరబిక్ భాషలో ఈ పదానికి ‘అందమైన ముత్యం’, అత్యంత సంపూర్ణ పరిమాణం, ఎంతో విలువైనది వంటి అర్థాలు వస్తాయి. సాధారణంగా ఈ పేరు పర్షియన్ గల్ఫ్‌లోని అరబ్ దేశాలలో ఎక్కువగా వినిపిస్తుంది. అక్కడ వేర్వేరు రకాల ముత్యాలకు ప్రత్యేకమైన పేర్లు పెడుతుంటారు. ‘దానా’ పేరు అత్యుత్తమమైన ముత్యాన్ని సూచిస్తుంది. ఇక పర్షియన్‌ భాషలో దానా అంటే ‘వివేకం’ అని అర్థం వస్తుంది.


Dana.jpg

ఏ దేశం సూచించింది?

‘దానా’ అనే పేరుని ఖతార్ సూచించింది. అంతర్జాతీయ తుఫాను నామకరణ విధానంలో భాగంగా ఈ పేరుని ప్రతిపాదించింది. తుపానుల గుర్తింపును సులభంగా మార్చడానికి, వాటి గమనాన్ని అంచనా వేయడానికి, సంభావ్య ముప్పు నుంచి ప్రజలను అప్రమత్తం, అవగాహన కల్పించేందుకు వీలుగా తుపానులకు ఈ విధంగా పేర్లు పెడుతుంటారు.


కాగా తుపానులకు పేర్లు పెట్టే పద్దతి ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రమాణంగా మారిపోయింది. దేశాల మధ్య పరస్పర సమాచారం పంపిణీ, తుపానుల గమనాన్ని గుర్తించడానికి ఈ విధానం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుపానులకు పేర్లు పెట్టేందుకు ఏప్రిల్ 2020 నాటికి 13 దేశాలు ఒక సమూహంగా ఏర్పడ్డాయి. ఈ దేశాల జాబితాలో భారతదేశం, బంగ్లాదేశ్, ఖతార్‌తో పాటు ఇతర దేశాలు ఉన్నాయి.

కాగా తుపానులకు పేర్లు పెట్టే ఈ ప్రక్రియను ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) పర్యవేక్షిస్తుంటుంది. తుపానులకు పెట్టే పేర్లు చక్కగా సాంస్కృతికంగా, ఉచ్చరించడానికి సులభంగా, ఏ సమూహాన్ని, వర్గాన్ని కించపరచని విధంగా ఉంటాయి. తుపానుల పేర్లను వార్షిక లేదా ద్వైవార్షిక సమావేశాల సమయంలో సభ్య దేశాలు ప్రతిపాదిస్తాయి. ఈ పేర్లను ఆమోదించాలంటే ప్రతి పేరు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాల్సి ఉంటుంది.


ఇవి కూడా చదవండి

దానా తుపానుపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన

తుపాను ఎఫెక్ట్.. రెండు రైళ్లు రద్దు

ఏపీలో లా అండ్ అర్డర్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు

For more AP News and Telugu News

Updated Date - Oct 23 , 2024 | 03:58 PM