Viral Video: తాగడానికి ఒప్పుకోలేదని ఇంత దుర్మార్గమా.. డాబాపైన నలుగురు కలిసి..
ABN , Publish Date - May 28 , 2024 | 04:24 PM
మనుషుల్లో రానురాను నేర స్వభావం ఎక్కువైపోతోంది. చిన్న చిన్న కారణాలకే పగలు ప్రతీకారాలు పెంచుకొని.. దారుణాలకు పాల్పడుతున్నారు. చివరికి.. అయిన వాళ్లను కూడా విడిచిపెట్టడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోనూ..
మనుషుల్లో రానురాను నేర స్వభావం ఎక్కువైపోతోంది. చిన్న చిన్న కారణాలకే పగలు ప్రతీకారాలు పెంచుకొని.. దారుణాలకు పాల్పడుతున్నారు. చివరికి.. అయిన వాళ్లను కూడా విడిచిపెట్టడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోనూ (Uttar Pradesh) ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. కేవలం మద్యం తాగడానికి నిరాకరించాడన్న పాపానికి.. నలుగురు స్నేహితులు కలిసి అతడిని చితకబాదారు. డాబాపై నుంచి కిందకు తోసేశారు. అంతటితో ఆగకుండా.. కిందకు దిగి అతడ్ని మరింత కొట్టారు. ఈ మొత్తం ఘటన ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Read Also: అనన్యా పాండేతో కలిసి రసెల్ ‘లుట్ పుట్ గయా’
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని (Lucknow) రుప్పుర్ ఖద్రా అనే ప్రదేశంలో రంజిత్ సింగ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతను స్థానికంగా ఓ దుకాణం నిర్వహిస్తున్నాడు. అతని దుకాణానికి నలుగురు వ్యక్తులు తరచూ వెళ్లేవారు. ఈ క్రమంలోనే ఆ నలుగురితో అతనికి స్నేహం ఏర్పడింది. కట్ చేస్తే.. శుక్రవారం రాత్రి ఆ నలుగురు స్నేహితులు అతని ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు. అనంతరం తమతో కలిసి మద్యం తాగాలని వాళ్లు పట్టుబట్టారు. కానీ.. రంజిత్ అందుకు నిరాకరించాడు. తనకు మద్యం అలవాటు లేదని చెప్పి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో.. ఆ నలుగురు స్నేహితులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Read Also: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్కౌంటర్.. భారీగా ప్రాణనష్టం
కానీ.. మరుసటి రోజు మరోసారి ఆ నలుగురు రంజిత్ ఇంట్లోకి చొరబడ్డారు. అతడిని డాబాపైకి తీసుకెళ్లి దౌర్జన్యానికి దిగారు. ఈ గొడవ చినికి చినికి గాలివానగా మారడంతో.. ఆ నలుగురిలో ఒక వ్యక్తి రంజిత్‌ను డాబాపై నుంచి కిందకు తోసేశాడు. అక్కడితో అతడిని విడిచిపెట్టలేదు. రోడ్డుపై పడిన రంజిత్ని మిగిలిన ముగ్గురు విచక్షణారహితంగా దాడి చేశారు. చివరికి స్థానికులు రంజిత్ని ఆ నలుగురి నుంచి రక్షించి.. దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు.
Read Latest Viral News and Telugu News