IPL 2024: గుడ్ న్యూస్.. ఐపీఎల్ రెండో విడత కూడా ఇండియాలోనే? సాక్ష్యం ఇదిగో!
ABN , Publish Date - Mar 24 , 2024 | 04:12 PM
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త. ఐపీఎల్ 2024 రెండో విడత కూడా మన దేశంలోనే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల దృష్యా ఐపీఎల్ రెండో విడత మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహించనున్నారని, అందుకోసం యూఏఈని పరిశీలిస్తున్నారని పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త. ఐపీఎల్ 2024 రెండో విడత కూడా మన దేశంలోనే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల దృష్యా ఐపీఎల్ రెండో విడత మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహించనున్నారని, అందుకోసం యూఏఈని పరిశీలిస్తున్నారని పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో మన దేశంలోనే మొత్తం ఐపీఎల్‌ను నిర్వహించనున్నారనే వార్తలు వచ్చాయి. కానీ ఐపీఎల్ షెడ్యూల్ వెల్లడించే సమయానికి ఎన్నికల షెడ్యూల్ రాలేదు. దీంతో మొదటి 21 మ్యాచ్‌లకే బీసీసీఐ షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో రెండో విడత మన దేశంలో జరగడం అనుమానంగానే కనిపించింది. దానికి తగ్గట్టుగా యూఏఈలో వేదికలను పరిశీలిస్తున్నారనే వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఐపీఎల్ మిగతా మ్యాచ్‌లను కూడా ఇండియాలోనే నిర్వహించనున్నారు.
అంతేకాకుండా ఐపీఎల్ వేదికల విషయంలో ప్రతి సారి పాటించే సాంప్రదాయాన్నే ఈ సారి కూడా కొనసాగించనున్నారు. గత సీజన్ విజేతగా నిలిచిన జట్టు హోంగ్రౌండ్‌లో ఆరంభ మ్యాచ్‌తోపాటు ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఆ లెక్క ప్రకారం ఇప్పటికే మొదటి మ్యాచ్ చెన్నైలో జరగగా.. ఫైనల్ మ్యాచ్‌ను కూడా అక్కడే నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతుందట. అలాగే గత సీజన్‌లో రన్నరఫ్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ సొంత వేదికైన అహ్మదాబాద్‌లో క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లను నిర్వహించున్నారట. బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ గత ఏడాది డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ సొంత వేదికపై ఓపెనింగ్ గేమ్, ఫైనల్‌ను నిర్వహించే సంప్రదాయాన్ని అనుసరిస్తోంది’’ అని పేర్కొన్నారు. దీనిని బట్టి ఐపీఎల్ మిగతా మ్యాచ్‌లను కూడా ఇండియాలోనే నిర్వహించనున్నారని తెలుస్తోంది. అలాగే ఐపీఎల్ రెండో విడతకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ మే 26న జరగనుందని సమాచారం. ఇక ప్రస్తుతం మొదలైన మొదటి విడత మ్యాచ్‌లు ఏప్రిల్ 7 వరకు జరగనున్నాయి. మొదటి విడతలో మొత్తం 21 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.